రష్యాకు చెందిన ‘రోస్‌నెఫ్ట్’, ‘ల్యూక్ ఆయిల్’ కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లో పెడుతూ అక్టోబరు 22న అమెరికా తీసు కున్న నిర్ణయం రష్యానూ, రష్యా చమురు కొంటున్న దేశాలనూ ఉక్కిరిబిక్కిరిచేస్తోంది. రష్యా ముడిచమురు ఆదాయంలో 57 శాతం ఈ రెండు దిగ్గజసంస్థల ద్వారానే సమకూరుతుంది.
ఇతర చిన్నాచితకా కంపెనీల ద్వారా మిగిలిన 43 శాతం లభిస్తోంది. చిన్న కంపెనీల మీద ఎలాంటి ఆంక్షలు విధించనప్పటికీ, ఇండియా వంటి ప్రధాన చమురు దిగుమతి దేశాల మీద అమెరికా చర్య ప్రభావం గణనీయంగా ఉంటుంది. బ్లాక్ లిస్టెడ్ కంపెనీల నుంచి కొనుగోళ్లు చేయ బోమని ఇండియా చమురు కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి.
రష్యా నుంచి ఇండియా ఆయిల్ దిగుమతులు ఒకప్పుడు కేవలం1 శాతం ఉండేవి అలాంటిది ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అవి 38 శాతం గరిష్ఠ స్థాయికి పెరిగాయి. ఇండియా ఇలా రష్యా ముడి చమురు కొంటూ పుతిన్ యద్ధానికి పరోక్షంగా మద్దతు ఇస్తోందని ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. చౌకగా లభిస్తున్నందువల్లే దేశ ప్రయోజనాల దృష్టిలో తాము రష్యా చమురు కొంటున్నామని భారత ప్రభుత్వం ఈ ఆరోపణను కొట్టివేసింది.
ఇండియా సందిగ్ధం
అమెరికా తాజా నిర్ణయంతో ఇండియా సందిగ్ధంలో పడింది. ఏదో ఒక విధంగా రష్యా చమురు కొనుగోళ్లను కొనసాగించడమా, లేదంటే రష్యా చమురుకు పూర్తిగా దూరం కావటమా అన్నది తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. నిజానికి రెండు సర్వసత్తాక దేశాల నడుమ ద్వైపాక్షిక వాణిజ్యం ఎలా జరగాలో శాసించే హక్కు అమెరికాకు లేదు.
తమ కంపెనీలు రెండిటిని అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టినప్పటికీ, చమురు ఎగుమతులు నిలిపివేయాలని రష్యా భావించడం లేదు. కానీ బ్లాక్ లిస్టెడ్ కంపెనీలతో వ్యాపారం చేసే దేశాల మీద అమెరికా ద్వితీయ స్థాయి ఆంక్షలు విధించే అవకాశం ఉన్నందున, అంత రిస్కు తీసుకుని రష్యా చమురు కొనాలా వద్దా అనేది ఇండియా, చైనా వంటి దిగుమతిదారులు తమకు తాముగా తీసు కోవలసిన నిర్ణయం.
ఇప్పుడు ఇండియా ముందు రెండు మార్గాలు ఉన్నాయి. అమె రికా ఆంక్షలు విధించినా సరే రష్యా చమురును ఇకమీదటా కొనడం వాటిలో ఒకటి. అమెరికా ఆంక్షలు వర్తించకుండా దళారుల ద్వారా సమకూర్చుకునే వీలుంది. రష్యా రహస్యంగా నడుపుతున్న రహస్య (షాడో) ట్యాంకర్ల ద్వారానూ తెప్పించుకోవచ్చు. ఏదో విధంగా చౌక ధరలకు రష్యా చమురు తెప్పించుకోవడం సాధ్యమే. అయితే ఈ చర్యలు ట్రంప్‌కు ఆగ్రహం కలిగిస్తాయి.
చపల చిత్తుడైన ట్రంప్‌ఆంక్షలను ధిక్కరించడం తెలివైన పని అనిపించుకోదు. ట్రంప్‌తో ఢీకొనడం అంటే, తలను రాతి గోడకేసి కొట్టుకోవడమే. అమెరికాతో తలపడటంలో మన కంటే గట్టిదైన చైనా సైతం ఆ రెండు రష్యాకంపెనీల నుంచి కొనుగోళ్లు నిలిపి వేస్తామని సూచనప్రాయంగా వెల్లడించింది.
వాణిజ్య ఒప్పందమే ఆచరణీయం
ట్రంప్‌తో తల గోక్కోవడం కంటే, ఆచరణీయ వైఖరి అవలంబించాలి. విస్తృత వ్యూహాత్మక లక్ష్యాలకు ముప్పు వాటిల్లని రీతిలో, దౌత్య ఇంధన ఆర్థిక ప్రయోజనాలను సమతుల్యం చేసేట్లు ఈ వైఖరి ఉండాలి. ఇది రెండో మార్గం. మన చేతిలో ఉన్న ముక్కలతోనే మనం ఆడాలి. సమకాలీన భౌగోళిక రాజకీయాల్లో ఆచరణవాదమే నడుస్తోంది. ఇండియా భిన్నంగా వ్యవహరించలేదు. అమెరికా ఒత్తిడికి లొంగిపోతున్నామా అన్నది ముఖ్యం కాదు. దేశానికి గరిష్ఠ ప్రయోజనం దేనివల్ల సిద్ధిస్తుందో ఆ మార్గాన్ని ఎంచుకోవాలి.
ఒకటి: ఆంక్షలకు గురికాని రష్యా ఇంధన కంపెనీల నుంచి కొను గోళ్లు చేసే అవకాశం ఇప్పటికీ ఉంది. రోస్‌నెఫ్ట్, ల్యూక్‌ఆయిల్ నుంచి కాకుండా మిగిలిన రష్యా కంపెనీల నుంచి కొంటే అమెరికా సెకండరీ ఆంక్షలు వర్తించవు. ఆంక్షలు ఆ రెండు కంపెనీల మీదే కానీ రష్యా ఆయిలు మీద కాదు. అయినా సరే ఇది అనుకున్నంత సులభం కాదు.
రెండు: అమెరికా ఆంక్షలను ఇండియా తోసిరాజన గలదా, ఆ సాహసం ఫలితమిస్తుందా, అమెరికాతో ముడిపడి ఉండే విస్తృత వ్యూహాత్మక ప్రయోజనాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని మాత్రమే రష్యా చమురు కొనుగోళ్ల కొనసాగింపుపై ఒక నిర్ణయానికి రావలసి ఉంటుంది.
ఇండియా వస్తువుల మీద ట్రంప్ తొలుత విధించిన 25 శాతం సుంకాలను వీలైనంత తగ్గించేలా అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలి. అదే సమయంలో రష్యా నుంచి చమురు కొను గోళ్లను నిలిపివేసినట్లయితే, తరువాత మోపిన 25 శాతం అదనపు సుంకాలను కూడా తగ్గించడానికి లేదా రద్దు చేయడానికి వీలు ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, అమెరికాతో సానుకూల వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోడానికి అనువుగా రష్యా చమురుకు స్వస్తి పలికే అంశాన్ని పరిశీలించాలి.
ప్రతిష్ఠ స్థానే ప్రయోజనాలు
ట్రంప్ ఏకపక్ష ఆంక్షలను తోసిరాజన్నట్లయితే, దేశ గౌరవం ఇనుమడిస్తుంది. కానీ దానివల్ల ఒనగూరే ప్రయోజనాలు పరిమిత మైనవి. వాటి కంటే మనం ఎదుర్కొనే రిస్కులు ఎక్కువ. కాబట్టి, అమెరికా విధానంలో మార్పు కోసం రష్యా నుంచి చమురు కొను గోళ్లను నిలిపివేసే ఆలోచన చేయాలి.
తద్వారా, దక్షిణాసియాలోఇండియాకు వ్యతిరేకంగా ట్రంప్ అవలంబిస్తున్న ప్రతికూల భౌగో ళిక రాజకీయ వైఖరికి తెరపడుతుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ప్రాంతీయ బలాబలాల సమతౌల్యాన్ని సానుకూల రీతిలో పునురు ద్ధరించుకునేందుకు అమెరికా సహకారం తీసుకుని తీరాలి. ప్రాంతీ యంగా వారి వ్యూహాత్మక ప్రయోజనాలకూ ఢోకా ఉండదన్న భరోసా ఇవ్వాలి.
స్పష్టంగా చెప్పాలంటే, రష్యా చమురు కంపెనీల మీద అమెరికా ఆంక్షలు ధిక్కరించడానికి ఇండియాకు ఉన్న అవకాశాలు పరి మితం. ఈ తప్పనిసరి పరిస్థితి నుంచి ఎంతో కొంత లబ్ధి పొందే ప్రయత్నం చేయాలి. కీలకమైన తన వ్యూహాత్మక ప్రయోజనాలు పరిరక్షించేట్లయితే, రష్యాపై ఆంక్షల పట్ల అభ్యంతరం లేదనిఇండియా ప్రతిపాదించాలి. జాతి గౌరవం, దేశ ప్రతిష్ఠ అంటూ అతిశయాలకు పోతే ప్రయోజనం ఉండదు.
-వ్యాసకర్త ‘కౌన్సిల్ ఫర్ స్ట్రేటజిక్ డిఫెన్స్ అండ్‌రిసెర్చ్’ వ్యవస్థాపక డైరెక్టర్ (‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
-హ్యాపీమాన్ జాకబ్


