ఇటీవలి ‘ఏసియాన్’ సదస్సులో అమెరికా, ఇండియా రక్షణ మంత్రులు
విశ్లేషణ
ఇండియా, అమెరికా వాణిజ్య ఒప్పందం ఒక కొలిక్కి వచ్చినట్లేనా? సంతకాలు చేయడమే తరువాయి అంటూ ఆరు నెలలుగా వింటున్నాం. అయినా, ఉభయ పక్షాలూ ఆ చివరి ఘట్టం చేరుకోలేకపోతున్నాయి. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ఇండియా మీద విధించిన 25 శాతం అదనపు సుంకం విషయానికి వద్దాం. ప్రైవేటు రంగ సంస్థలు రష్యా చమురు కొనుగోళ్లను తగ్గించాయి. మరి ఆ 25 శాతం అదనపు సుంకాలను అమెరికా ఎత్తివేస్తుందా? అలాంటి సంకేతాలేమీ లేవు.
చమురు కొనకపోయినా...
ఇండియా–యూఎస్ రక్షణ సహకారం మరో పదేళ్లు కొన సాగుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమెరికా యుద్ధ వ్యవహారాల మంత్రి పీట్ హెగ్‌సేథ్ ‘ఏసియాన్’ రక్షణ మంత్రుల సదస్సు సందర్భంగా అక్టోబర్ 31న కౌలాలంపూర్‌లో ప్రకటించారు. దీంతో వాణిజ్య వివాదం త్వరలోనే పరిష్కరం కాగలదన్న ఆశలు చిగురించాయి. ఇండియాకు రక్షణ సామగ్రి సరఫరా చేయడం ద్వారా అమెరికా బిలియన్ల డాలర్లను అర్జిస్తోంది. కాబట్టి మనపై ఆంక్షలు తొలగిస్తుందని అనుకోవడానికి వీల్లేదు.
అమెరికా అధ్యక్షుడి లెక్కలు వేరేగా ఉంటాయి. ఇండియా జాగ్రత్తగా అడుగులు వేయాలి. రాబోయే రోజుల్లో ఎస్–500 తరహా రష్యా అత్యాధునిక ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు ట్రంప్ అభ్యంతరం చెప్పరని అనుకోలేం. వాటిని సమకూర్చుకునేట్లయితే తాము ఇండియాకు రక్షణ పరికరాలను, విడిభాగాలను విక్రయించబోమంటూ పేచీ పెట్టరన్న గ్యారంటీ లేదు. చమురు కొనుగోళ్లపై ఆంక్షలు విధిస్తారని అనుకున్నామా?
రష్యా చమురుకు చైనా కూడా భారీ కొనుగోలుదారు. నాటో కూటమి సభ్యులైన టర్కీ, హంగరీ సైతం గణనీయంగా ఆ దేశం నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాయి. అయినా, అమెరికా ఇండియాను మాత్రమే వేరు చేసి ఆంక్షల శిక్ష విధించింది. బూసాన్ (దక్షిణ కొరియా)లో ఎపెక్ సదస్సు సందర్భంగా ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ట్రంప్ చర్చలు జరిపారు. అందులో రష్యా చమురు ప్రస్తావన తేలేదని అన్నారు. ఇండియా మీద ఆంక్షల కత్తి ఝుళిపించిన ట్రంప్ చైనా విషయంలో అలా చేయలేక పోయారు. ప్రతీకార చర్యలు తీసుకుంటామని చైనా ముందే హెచ్చరించడం అందుకు కారణం కావచ్చు.
‘క్వాడ్’ లేనట్లేనా?
అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం చైనా ముప్పు నుంచి కాపాడుతుందన్న నమ్మకాన్ని పునఃసమీక్షించుకోవాలి. నంబర్ 1, నంబర్ 2 దేశాల నడుమ నెలకొన్న వ్యవస్థాగత పోరు సమసి పోనప్పటికీ, ఇరు దేశాలూ వ్యూహాత్మక సర్దుబాట్లు చేసుకుంటున్నందువల్ల ఇండియా ఎత్తుగడలు ఫలించే అవకాశం తగ్గిపోతుంది. యుక్తమైన దౌత్యవిధానం అనుసరించడం ద్వారానే ఈ ముప్పును ఎదుర్కోవలసి ఉంటుంది.
అమెరికా ఇండో–పసిఫిక్ వ్యూహం యథాతథంగా కొనసాగు తుందనడానికి ఇటీవలి ట్రంప్ ఆసియా పర్యటనే నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు. అయితే, ఈ వ్యూహంలో ఇండియా ప్రయోజనాలకు సంబంధించిన ‘క్వాడ్’ అంశం మరుగున పడింది. ఈ ఏడాది అఖరున క్వాడ్ దేశాధినేతల సమావేశం జరగాల్సి ఉంది. ఇది అనుమానమే. ట్రంప్ ఎక్కడా క్వాడ్ ఊసెత్తలేదు. భాగస్వామ్య దేశాలైన ఆస్ట్రేలియా, జపాన్ సైతం ప్రస్తావించక పోవడం గమ నార్హం. అవి ట్రంప్ మనసెరిగి మసలుకున్నట్లుంది.
ఒకవేళ ఆస్ట్రేలియా, జపాన్‌లతో ఇండియా తన సహకారాన్ని ముమ్మరం చేసుకుని ఒక త్రైపాక్షిక కూటమి (ట్రయడ్) ఏర్పాటు కోసం ప్రయత్నిస్తోంది అనుకుంటే, దాని ప్రయోజనాలు ఎలా ఉంటాయన్నది మరో ప్రశ్న.
ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇండియాకు ఉన్న ఇతర అవకా శాలను చూద్దాం. యూరప్‌తో సన్నిహిత సమగ్ర భాగస్వామ్య ఒప్పందం వీటిలో ఒకటి. యూరప్ రక్షణ పరిశ్రమ భారీ విస్తరణ కోసం నమ్మకమైన విపణి, అగ్రశ్రేణి మానవ వనరులు అవసరం.
ఇండియా వీటిని సమకూర్చగలదు. యూరప్, ఇండియాల మధ్య దృఢ మైన రక్షణ భాగస్వామ్యం ఉన్నట్లయితే, నిలకడ లేని అమెరికా విధానా లకు విరుగుడుగా అది ఉభయ పక్షాలకూ ఉపయోగపడుతుంది.
ఇండియా బలాలు
అరిగిపోయిన రికార్డులా నేను మళ్లీ చెబుతున్నా. ఉపఖండ సరిహద్దుల భద్రత మన తక్షణ ఆవశ్యకత. పొరుగు దేశాలతో ద్వైపా క్షిక సంబంధాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారానే ఇది సాధ్యపడు తుంది. మనం దక్షిణాసియా వృద్ధికి ఒక కేంద్రకంగా, భద్రత కల్పించే శక్తిగా మారడం ముఖ్యం. అనూహ్యంగా అనిపించినా కాలక్రమంలో పాకిస్తాన్ కూడా ఈ పరిధిలోకి వచ్చి తీరాలి. మన ప్రాంతానికి వాతావరణ మార్పు అతిపెద్ద సవాలు కాబోతోంది.
ఈ సంక్షోభాన్ని అధిగమించడం ప్రాంతీయ దేశాల నడుమ సహకారంతోనే సాధ్యమవుతుంది. ఈ విపత్తుపై ఉమ్మడి పోరాటానికి సారథ్యం వహించే శక్తి ఇండియాకు మాత్రమే ఉంది. తూర్పు ఆసియా, ఆగ్నేయ ఆసియా ప్రాంతాల్లోనూ ఇండియా ప్రముఖ పాత్ర వహించాలి. ఇందుకు వీలుగా ఆర్‌సీఈపీ, సీపీటీపీపీ స్వేచ్ఛా వాణిజ్య కూటముల్లో సభ్యత్వం కోసం ప్రయత్నించాలి.
శాస్త్ర సాంకేతిక మానవ వనరులతో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, సంక్షుభిత సమకాలీన ప్రపంచంలో చెక్కు చెదరని రాజకీయ సుస్థిరత... ఈ రెండూ ఇండియా సొంతం. వివేకంతో వినియోగించుకోగలిగితే దేశాన్ని ఇవి వ్యూహాత్మకంగానూ ముందంజ వేయిస్తాయి. చైనాతో సంబంధాలను మెరుగుపరచడంలో వీటి పాత్ర ఉంది. ఏమైనప్పటికీ, విదేశీ విధానంలో, రక్షణ వ్యవహారాల్లో బయటి శక్తుల ప్రమేయం లేకుండా స్వేచ్ఛగా నిర్ణ యాలు తీసుకోగల ‘వ్యూహాత్మక స్వతంత్రత’ సాధించడానికి... సామర్థ్యం కంటే సంకల్పం ముఖ్యం.
శ్యామ్ శరణ్
వ్యాసకర్త కేంద్ర విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)


