breaking news
defence cooperation
-
భారత్-రష్యా బంధంపై అమెరికా మరోసారి కీలక వ్యాఖ్యలు
భారత్-రష్యా బంధంపై అమెరికా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ రక్షణ అవసరాలకు సంబంధించి రష్యాపై ఆధారపడటాన్ని ఏమాత్రం తాము ప్రోత్సహించడంలేదని యూఎస్ రక్షణ కార్యాలయం పెంటగాన్ అభిప్రాయపడింది. భారత్ రక్షణ అవసరాల విషయంలో రష్యాలపై అధికారపడటం మానుకోవాలని పేర్కొంది. భారత్‌తో పాటు ఇతర దేశాలు కూడా రక్షణ అవసరాల కోసం రష్యాపై ఆధారపడడం ఆపేయాలని భావిస్తున్నామని వెల్లడించింది. ఈ విషయంలో తమకు ఎటువంటి ఉద్దేశంలేదని తెలుపుతునే.. ఆ అంశాన్నిఎట్టిపరిస్థితుల్లో ప్రోత్సహించమని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ తెలిపారు. భారత్‌తో ఉన్న రక్షణ బంధానికి తాము విలువ ఇస్తామని అదేవిధంగా అమెరికా-ఇండియా మధ్య ఉన్న బంధం మరింత బలోపేతం కావడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఉపఖండంలో భద్రతను కల్పించేది భారత్ అని ఆ విషయాన్ని తాము ఎల్లప్పుడు గుర్తిస్తామని తెలిపారు. 2018లో ట్రంప్ ప్రభుత్వం నిరాకరించినా భారత్ మాత్రం రష్యా నుంచి ఎస్-400 ట్రియంప్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైళ్లను కొనుగులుకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎస్-400 మిస్సైళ్లు కొనుగోలు చేసిన టర్కీపైన అమెరికా నిషేధం విధించిన విషయం విదితమే. -
ఇండియన్ నేవీలోకి రోమియోలొచ్చేశాయ్, ప్రత్యేకతలివే!
వాషింగ్టన్/న్యూఢిల్లీ: సరిహద్దుల్లో నిత్య ఘర్షణలతో దేశ భద్రత సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో మన రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమైంది. అమెరికా నుంచి కొనుగోలు చేసిన బహుళ ప్రయోజనాలు కలిగే ఎంహెచ్–60ఆర్ రోమియో హెలికాప్టర్లు 24లో రెండు భారత్‌కి అందించింది. దీంతో దేశ నావికా చరిత్రలో ఒక కొత్త శకం మొదలైంది. అగ్రరాజ్యంలో శుక్రవారం శాన్‌డియోగోలో నేవల్ ఎయిర్ స్టేషన్లో జరిగిన ఒక కార్యక్రమంలో అమెరికా రెండింటిని భారత్‌కు లాంఛనంగా అప్పగించింది. ఈ కార్యక్రమంలో అమెరికాలో భారత రాయబారి తారాంజిత్ సింగ్ సాంధు, అమెరికా నేవల్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ కెన్నెత్ వైట్సెల్, భారత్ కమాండర్ రవ్నీత్ సింగ్, హెలికాఫ్టర్లు తయారు చేసిన లాక్‌హీడ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. వీటి చేరికతో అమెరికా, భారత్ మధ్య రక్షణ బంధం మరింత బలోపేతమైందని సాంధు అన్నారు. ఆకాశమే హద్దుగా అమెరికా, భారత్ స్నేహబంధం సాగిపోతోందని ఆయన ట్వీట్ చేశారు. గత నెలరోజులుగా హెలికాఫ్టర్ల వాడకంపై భారత్‌కు చెందిన 20 మంది అ«ధికారులు, సాంకేతిక నిపుణులకు అమెరికాలో శిక్షణా కార్యక్రమం జరుగుతోంది భారత్ రక్షణ వ్యవస్థ పటిష్టం 2020 ఫిబ్రవరిలో అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు ముందు హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కుదిరింది. అమెరికా విదేశాంగ శాఖ నిర్వహించిన సేల్స్‌లో భాగంగా 24 హెలికాప్టర్లని 240 కోట్ల డాలర్లు (ఇంచుమించుగా 18 వేల కోట్లు ) భారత్ కొనుగోలు చేసింది. హిందూ మహాసముద్రంలో చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. భారత్ చుట్టూ జలాంతర్గాముల్ని మోహరించింది. దీంతో ఇలాంటి అత్యాధునికమైన హెలికాప్టర్లు మన దగ్గర ఉండే అవసరం ఉందని భారత్ గుర్తించింది. కాలం చెల్లిన బ్రిటీష్ కాలం నాటి సీ కింగ్ హెలికాఫ్టర్లు మన దగ్గర ఉన్నాయి. అవి కదన రంగంలో మనకి ఉపయోగపడడం లేదు. దీంతో వాటిని కేవలం రవాణా అవసరాల కోసమే వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఈ హెలికాప్టర్ల రాకతో మన త్రివిధ బలగాలు మరింత బలోపేతం కానున్నాయి. హెలికాప్టర్ ప్రత్యేకతలు ► ఈ హెలికాప్ట్టర్ల పూర్తి పేరు ఎంహెచ్రోమియో సీహాక్ ► ప్రముఖ రక్షణ ఉత్పత్తుల కంపెనీ లాక్‌హీడ్ మార్టిన్ తయారు చేసిన ఈ హెలికాఫ్టర్లకు ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనవని పేరుంది ► వీటిని యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్, యాంటీ సర్ఫేస్ ఆయుధంగా కూడా వాడవచ్చు. అంటే త్రివిధ బలగాల్లోనూ వీటిని వినియోగించుకోవచ్చు ► హెల్ఫైర్ క్షిపణులు, ఎంకే 54 టార్పెడోస్లను మోసుకుపోగలిగే సామర్థ్యం దీని సొంతం ► ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అయినా ప్రయాణించడానికి అత్యాధునిక సెన్సార్లు, రాడార్లు వాడారు. ► సముద్ర జలాల్లో శత్రు దేశాల నౌకల కదలికల్ని పసిగట్టి దాడులు చేయగలదు ► జలాంతర్గాముల్ని కూడా వెంటాడి ధ్వంసం చేసేలా డిజైన్ని రూపొందించారు ► గంటకి 267కి.మీ. వేగంతో దూసుకుపోతుందిప్రకృతి విపత్తుల సమయాల్లో ఈ హెలికాప్టర్లను సహాయ కార్యక్రమాలకు కూడా వినియోగించుకోవచ్చు ► సైనికులకు అవసరమయ్యే సామగ్రినిసరిహద్దులకి తరలించవచ్చు ► ప్రస్తుతం ఈ హెలికాప్టర్లను అమెరికా,ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు మాత్రమే వినియోగిస్తున్నాయి. -
12 ఒప్పందాలపై భారత్-వియత్నాం సంతకాలు
వియత్నాం పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం వియత్నాం ప్రధాని గుయెన్ జువాన్ ఫుక్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దక్షిణ చైనా తదితర కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. భేటీ అనంతరం ఇరువురు నేతలు 12 ఒప్పందాలపై సంతకాలు చేశారు. రక్షణ రంగాన్ని మెరుగుపర్చుకునేందుకు వియత్నాంకు భారత్ రూ. 50వేల కోట్ల డాలర్ల ఆర్ధికసాయం చేయనున్నట్లు మోదీ ప్రకటించారు. వియత్నాంలోని భారతీయ ప్రాజెక్టులపై ఆరా తీసిన మోదీ.. 2020 కల్లా భారత్-వియత్నాంల మధ్య 15 బిలియన్ డాలర్ల వ్యాపారమే లక్ష్యమని చెప్పారు. 50లక్షల డాలర్లతో వియత్నాంలో సాఫ్ట్ వేర్ పార్కును నిర్మిస్తామని తెలిపారు. భారత్-వియత్నాంల మధ్య జరిగిన ఒప్పందాలు దేశాల మధ్య సంబంధాలను కొత్త అధ్యాయానికి తెరతీస్తాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ చెప్పారు. శుక్రవారం వియత్నాం రాజధాని హనోయ్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఘనస్వాగతం లభించింది. వియత్నాం అధ్యక్షుడు ట్రాన్ డయ్ క్వాంట్ మోదీ ఆహ్వానించారు. మోదీకి వియత్నాం ఆర్మీ గౌరవ వందనం చేసింది. కాగా మోదీ క్యున్ సూ పగోడాను కూడా సందర్శించారు. ఇక వియత్నాం పర్యటన ముగించుకుని మోదీ చైనా బయల్దేరి వెళ్లారు.