ప్రకటించిన బీఎస్‌ఎఫ్, మేఘాలయ పోలీసులు
షిల్లాంగ్: ఇంక్విలాబ్ మంచ్ నేత షరీఫ్ ఒస్మాన్ హదీ హంతకులు భారత్‌లోకి ప్రవేశించారంటూ బంగ్లాదేశ్ పోలీసులు చేసిన ఆరోపణలను బీఎస్‌ఎఫ్ తీవ్రంగా ఖండించింది. బంగ్లాదేశ్ చేస్తున్నవి నిరాధార, తప్పుదోవ పట్టించే ప్రకటనలని మేఘాలయలో బీఎస్‌ఎఫ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఓపీ ఉపాధ్యాయ్ స్పష్టం చేశారు.
హదీ హత్య కేసులో ఫైసల్ కరీం మసూద్, ఆలంగిర్ షేక్ అనే కీలక అనుమానితులిద్దరు హలువాఘాట్ బోర్డర్ పాయింట్ మీదుగా స్థానికుల సాయంతో భారత్‌లోకి ప్రవేశించినట్లు బంగ్లాదేశ్‌లోని ఢాకా మెట్రోపాలిటన్ అదనపు పోలీస్ కమిషనర్ ఇస్లాం ఆదివారం ఆరోపించారు. ‘భారత్‌లోకి పారిపోయాక ఒకరు వీళ్లను మేఘాలయలోని తురా నగరానికి తీసుకెళ్లాడు’అని ఇస్లాం చెప్పారు. ‘అనంతరం వీళ్లను భారత అధికారులు నిర్బంధించారు.
ఈ విషయమై అనధికారిక వర్గాల ద్వారా భారత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. నిందితులను వెనక్కి తీసుకొస్తాం’ అని అన్నారు. ఆ ఇద్దరు నిందితులు భారత్‌లోకి ఎప్పుడు ప్రవేశించారనే విషయం ఆయన వెల్లడించలేదు. బంగ్లా పోలీస్ అధికారి ప్రకటనపై ఉపాధ్యాయ్ స్పందిస్తూ..‘హలువాఘాట్ సెక్టార్ మీదుగా ఎవరూ మేఘాలయలోకి ప్రవేశించినట్లు ఎలాంటి ఆధారాలూ లేవు’అని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించిన వార్తలన్నీ అసత్యాలని తెలిపారు.
గారో హిల్స్ ప్రాంతంలోని హలువాఘాట్ ద్వారా కొందరు వ్యక్తులు మన భూభాగంలోకి ప్రవేశించినట్లు తమకు ఎటువంటి నిఘా సమాచారం అందలేదని మేఘాయ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. వివిధ నిఘా, భద్రతా సంస్థలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి మోహరించిన జవాన్లు అత్యంత అప్రమత్తతతో ఉన్నారని బీఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు. దొంగచాటుగా ఎవరైనా ప్రవేశించిన పక్షంలో వారిని గుర్తించి, పట్టుకుని తగు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.


