Buddha Bhagavan
-
ఇప్పటికైనా బౌద్ధాన్ని అర్థం చేసుకున్నామా?
‘నా దృక్పథం రాజకీయాల నుంచి కాక మత సంస్కృతి నుంచి అలవడింది.’’ – డా‘‘ బీఆర్ అంబేడ్కర్ హేతువుకు ప్రాధాన్య మిచ్చి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలను ముందుకు తీసుకొచ్చిన బౌద్ధం ప్రాచీన భారతదేశంలోనే కాకుండా ఆధునిక కాలంలో కూడా ఎంతో ప్రాసంగి కతను కలిగివుంది. గౌతమబుద్ధుడు భారతదేశపు మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు. ఆయన తన కాలం నాటికి అమలులో ఉన్న సాంఘిక దుర్నీతినీ; మతం పేరున జరుగుతున్న హింసాకాండ, అమాన వీయతనూ ప్రశ్నించాడు. హేతువు పునాదిగా ప్రజా స్వామిక సంస్కృతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేశాడు. బుద్ధుడు క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దికి చెందిన వాడైనప్పటికీ ఆయన బోధించిన సమానత్వ భావన, హేతువాద దృక్పథం, ప్రజాస్వామికతత్త్వం ఈనాటికీ ఎంతో ప్రాసంగికతను సంతరించుకున్నాయి. ఆయన ముందుకు తీసుకువచ్చిన ‘అనాత్మవాదం’, ‘అని త్యత’, ‘ప్రతీత్య సముత్పాద’ వంటి భావనలు బౌద్ధాన్ని ఇతర మతాల కంటే భిన్నంగా నిలబెట్టా యనవచ్చు. ఈ భావనలు బౌద్ధాన్ని ఒక మతం అనే స్థాయి నుంచి గొప్ప ప్రాపంచిక దృక్పథాన్నిచ్చే తాత్విక స్థాయికి తీసుకెళ్ళాయనవచ్చు. బుద్ధుడి బోధనలలో ముఖ్యమైన ‘అష్టాంగ మార్గం’ మనుషుల వ్యక్తిత్వ వికాసానికి దోహదంజేసే అత్యున్నత మార్గం. సమత, కరుణ, ప్రజ్ఞ, మైత్రి, శీలం అనేవి బుద్ధుని తాత్వికత లోని ప్రధాన అంశాలు. అలాగే బుద్ధుడు వైదిక మతంలో భాగం అని వాదించడం బుద్ధుణ్ణి బ్రాహ్మణ వాదంలో జీర్ణం చేసుకోవాలనే ప్రయత్నం చెయ్య డమే! అటువంటి ఆకాంక్షల ఫలితమే పురాణాల కాలానికి బుద్ధుడిని విష్ణుమూర్తి దశావతారాలలో ఒక అవతారంగా మార్చడమని తెలుస్తోంది. విద్య, విజ్ఞానం, ఆధునిక భావాల పరంగా ఎంతో ముందంజ వేశామని భావిస్తున్న ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా మతమౌఢ్యం పెచ్చరిల్లిపోతోంది. బౌద్ధం రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాల పరంగా విస్తృతమైన పరిధి కలిగిన తత్త్వం కాబట్టి సమకాలీన సామాజిక, సాంస్కృతిక వైరుద్ధ్యా లకు బౌద్ధంలో పరిష్కారమార్గాలు వెదకవచ్చు.పండిత అయోతీదాస్, ప్రొఫెసర్ లక్ష్మీ నరసు, డా‘‘ అంబేడ్కర్ బౌద్ధాన్ని సామాజిక విముక్తి సిద్ధాంతంగా ప్రతిపాదించారు. అంబేడ్కర్ బౌద్ధాన్ని స్వీకరించడాన్ని హిందూమతంలో అంటరానివారనే దళితుల సామా జిక స్థాయిని తిరస్కరించడంగా భావించాడు. ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా లౌకికవాదులు, హేతువాదులు, శాస్త్రవేత్తలు అయిన మేధావులు తాము బౌద్ధాభిమానులమని చెప్పుకోవడానికి గర్వి స్తున్నారు. ఎడ్విన్ ఆర్నాల్డ్ అన్నట్లు బుద్ధుడు ‘ఆసియా జ్యోతి’ మాత్రమే కాదు ఆయన బోధనల ప్రాసంగికత పెరిగేకొద్దీ బుద్ధుడు ‘ప్రపంచ జ్యోతి’గా పరిణామం చెందుతున్నాడు. అయితే బుద్ధుడిని సమాజం కేవలం అహింసా మూర్తిగా, చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకున్న సన్యాసిగా, లేకపోతే శాకాహారిగా మాత్రమే అర్థం చేసుకున్నట్లు అనిపిస్తుంది. బుద్ధుడు అహింసావాది అన్నమాట నిజమే... కానీ శాంతిని, న్యాయాన్ని స్థాపించడం కోసం యుద్ధం చెయ్యడంలో తప్పు లేదంటాడు. ఆయన కేవలం ధ్యానం మాత్రమే చెయ్యక ప్రాపంచిక విషయాలపై వివిధ వ్యక్తులతో చర్చించి సత్యాన్ని నిర్ధారించుకున్నాడు. చాలామంది భావించి నట్లు బుద్ధుడు శాకాహారి కాడు. అలాగే ఆయన శాకాహారాన్ని కీర్తించలేదు. క్రతువులలో జంతు వధను ఖండించి, పండితుల భాషగా ఉన్న సంస్కృతం స్థానంలో ప్రజల భాష అయిన ‘పాళీ’ని ప్రతిపాదించి వైదిక సంస్కృతికి ప్రత్యామ్నాయ సంస్కృతిని ప్రవేశ పెట్టాడు. నిజానికి బౌద్ధం సంధించిన విమర్శల ఫలితంగానే తర్వాత కాలంలో హిందూమతం తనను తాను సంస్కరించుకుని అహింసనూ, శాకాహారాన్నీ ఆదర్శాలుగా స్వీకరించింది. బౌద్ధ భిక్షువులు సామా జిక కార్యకర్తల వలే బహుజన హితం, బహుజన సుఖం కోసం పనిచెయ్యాలని బుద్ధుడు సూచించాడు. బౌద్ధసంఘంలో రాజుల నుంచి, బానిసల వరకు అందరికీ సమాన హోదాను కల్పించాడు. బౌద్ధసంఘంలో ‘ఉపాలి’ అనే మంగలి కులస్థుడు, ‘జీవకుడు’ అనే వేశ్యాపుత్రుడు, ‘ఆమ్రపాలి’ అనే వేశ్య, రాజవంశీకులైన ‘ప్రసేనజిత్’, రాకుమార్తె ‘విశాఖ’; భర్త, బిడ్డల చేత, సమాజం చేత నిర్లక్ష్యానికి గురైన స్త్రీలు... సమానమైన గుర్తింపును పొందారు. భిన్న సామాజిక వర్గాల మధ్య బుద్ధుడు సామరస్యాన్ని కుదిర్చాడు. ‘విధికుడు’ అనే చర్మకారుడు అమరావతి క్షేత్రానికి కానుకగా ఇచ్చిన పూర్ణకుంభం బౌద్ధంలోని సమతకు చిహ్నంగా మిగిలింది. బౌద్ధంలో దేవుడి స్థానాన్ని నైతికత ఆక్రమిస్తుంది. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త గెయిల్ ఆంవెత్ బౌద్ధం అధికారిక మతంగా ఉన్న ప్రాచీన భారత సంస్కృతిని ‘బుద్ధిస్ట్ సివిలైజేషన్’గా పేర్కొన్నారు. ‘భారతీయ ఆత్మను కలిగి ఉన్న బౌద్ధాన్ని దేశం నుంచి వెళ్లగొట్టి భారతదేశం ఆత్మహత్య చేసుకుంద’ని గురజాడ అనడంలో అతిశయోక్తి లేదు. బౌద్ధం అనే గొడుగు కింద ప్రజల్లో సమైక్య భావన ఏర్పడే అవకాశం ఉంది. ప్రొ‘‘ చల్లపల్లి స్వరూపరాణి వ్యాసకర్త ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బుద్ధిస్ట్ స్టడీస్ శాఖలో సీనియర్ ప్రొఫెసర్ (నేడు బుద్ధ పూర్ణిమ) -
బౌద్ధవిహారం: బిహార్‌కి ఆ పేరు ఎలా వచ్చిందంటే..?
బిహార్‌కు ఆ పేరు ఎలా వచ్చింది? చారిత్రక– పౌరాణిక సాహిత్యంలో ఈ ప్రదేశం ఉంది. కానీ...అప్పట్లో ఈ ప్రదేశం పేరు బిహార మాత్రం కాదు. చాణుక్యుడు పుట్టాడు... కానీ అతడి పేరు రాలేదు. ఆర్యభట్ట పుట్టాడు... అతడి పేరూ రాలేదు. అశోకుడు పాలించాడు... ఆ చక్రవర్తి పేరూ రాలేదు. బుద్ధుడు విహరించిన ఈ ప్రదేశం బుద్ధవిహారగా పేరు తెచ్చుకుంది.. బౌద్ధ విహారాలు... చైత్యాల నిలయం బౌద్ధవిహారగా స్థిరపడింది. స్థానిక భాషల్లో విహార... బిహారగా వాడుకలోకి వచ్చింది. నాడు బుద్ధుడు విహరించిన బుద్ధవిహారయే నేటి మన బిహార్. గంగా తీరాన నడక... నదిలో డాల్ఫిన్ వీక్షణం ఈ టూర్లో బోనస్.నలంద విద్యాలయంనలంద విశ్వవిద్యాలయం మనదేశంలోనే కాదు ప్రపంచంలోని ్ర΄ాచీన విశ్వవిద్యాలయాల్లో ఒకటి, తొలి రెసిడెన్సియల్ యూనివర్సిటీ ఇదే. ఈ బౌద్ధ మహావిహారకు విద్యాభ్యాసం కోసం క్రీ.శ ఐదవ శతాబ్దం నుంచి పన్నెండవ శతాబ్దం వరకు దేశవిదేశాల నుంచి విద్యార్థులు వచ్చేవారు. వారు నివసించడానికి ఒక్కొక్కరికి ఒక్కో గది, ఆ గదిలో గోడలకు ఒక వైపు పుస్తకాల అర, మరొక గోడకు దుస్తులు పెట్టుకునే వెసులుబాటు ఉండేవి. ప్రతి గది బయట నీరు వెలుపలకు వెళ్లడానికి నిర్మాణంలోనే పైపుల ఏర్పాటు ఉండేది. పౌర్ణమి రోజు చంద్రుడి వెలుతురు పడి ప్రకాశించే చంద్రశిలలను చూడవచ్చు. క్లాసు రూముల ఏర్పాటు చాలా సమగ్రంగా ఉంటుంది. అందరూ నేల మీదనే కూర్చోవాలి. అయితే ఆచార్యులు కూర్చునే పీఠం వంటి స్థానం, విద్యార్థులు ఒకరికొకరు మూడడుగుల దూరంలో కూర్చునే విధంగా ఉంది నిర్మాణం. భక్తియార్ ఖిల్జీ హయాంలో ఇక్కడ తాళపత్ర గ్రంథాలను రాశి΄ోసి తగుల పెట్టిన చోట ఇటుకలు కూడా నల్లగా మాడి΄ోయి ఉన్న గోడలను చూపిస్తారు గైడ్లు. ఇక్కడ దుకాణాల్లో పెన్నులు నలంద, రాజ్‌గిర్ వంటి బౌద్ధ క్షేత్రాల పేర్లతో ఉంటాయి. టూర్‌కి గుర్తుగా తెచ్చుకోవచ్చు, స్నేహితులుగా బహుమతులుగా ఇవ్వవచ్చు. ఇది పట్నాకు 70 కిలోమీటర్ల దూరాన ఉంది. పట్నా నుంచి బయలుదేరిన తర్వాత నలంద పర్యటన పూర్తి చేసుకుని రాజ్‌గిర్‌కు వెళ్లాలి. నలంద మహావిహారను చూసిన తర్వాత సూర్యమందిర్, చైనా యాత్రికుడు హ్యూయాన్ త్సాంగ్ మందిరాన్ని కూడా చూడాలి. ఈ ఆలయం ఒక చరిత్ర పుస్తకానికి దృశ్యరూపం. వీటి తర్వాత చూడాల్సిన ప్రదేశం ఆర్కియలాజికల్ మ్యూజియం.మహాబోధిగయ బోద్‌గయకు ఆ పేరు రావడానికి కారణం మహాబోధి వృక్షమే. సిద్ధార్థ గౌతముడు ఈ బోధి చెట్టు కింద ధ్యానం చేశాడు. అతడికి జ్ఞానోదయమై బుద్ధుడిగా మారిన ప్రదేశం ఇది. యునెస్కో ఈ ప్రదేశాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. ఈ బోధి వృక్షాన్ని చూస్తే ఆశ్చర్యంతోపాటు క్రీస్తు పూర్వం ఐదు వందల ఏళ్ల నాటి వృక్షమా అనే సందేహం కలుగుతుంది. ఆ సందేహంలో అర్థం ఉంది. బుద్ధుని కాలం నాటి మహాబోధి వృక్షం మతహింసలో భాగంగా అగ్నికి ఆహుతై΄ోయింది. ఆ స్థానంలో శ్రీలంక నుంచి తెచ్చి నాటిన మొక్క ఇప్పుడు మహావృక్షమైంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే... శ్రీలంకలోని అనూరాధపురను ΄ాలిస్తున్న రాజు దేవానాం ప్రియ తిస్స బౌద్ధం పట్ల ఆకర్షితుడయ్యాడు. బౌద్ధ పట్ల అవగాహన కోసం అశోక చక్రవర్తిని కోరాడు. అశోకుడు బౌద్ధ ప్రచారంలో భాగంగా తన కూతురు సంఘమిత్ర, కొడుకు మహేంద్రను శ్రీలంకకు పంపించాడు. శ్రీలంకకు వెళ్లేటప్పుడు సంఘమిత్ర ఈ మహాబోధి నుంచి సేకరించిన మొక్కను తీసుకెళ్లి దేవానాం ప్రియ తిస్సకు బహూకరించింది. ఆ మొక్కను అనూరాధ పురలో నాటారు. బోధగయలోని మూలవృక్షం స్థానంలో శ్రీలంక బోధి వృక్షం నుంచి మొక్కను తెచ్చి నాటారు. అదే ఇప్పుడు మనం చూస్తున్న బోధి వృక్షం. ఈ వృక్షం పక్కనే మహాబోధి ఆలయం ఉంది. బౌద్ధం పరిఢవిల్లుతున్న భూటాన్, థాయ్‌లాండ్ వంటి అనేక దేశాల మోనాస్ట్రీలు కూడా బోద్‌గయలో ఉన్నాయి. వీటిలో వ్యక్తమయ్యే సంపన్నతను చూసినప్పుడు బుద్ధుడు చెప్పిన నిరాడంబరత కోసం బౌద్ధంలో ఆశించకూడదనిపిస్తుంది. ఈ ప్రదేశం బిహార్ రాజధాని నగరం పట్నా నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. గయకు 15 కిలోమీటర్ల దూరం. ఈ టూర్లో చూడాల్సిన మరో ప్రదేశం నిరంజన నది. బుద్ధుడు ధ్యానంలో ఉన్న కాలంలో తరచూ ఈ నదికి వెళ్లేవాడు. స్థానికులు ఫాల్గు నదిగా పిలుస్తారు. వైశాలి గత వైభవంబుద్ధుడు తన జీవితకాలంలో ఎక్కువ కాలం ( మూడు దఫాలు) వైశాలిలో జీవించాడు. తన చివరి బోధనను వెలువరించాడు. బుద్ధుడి అవశిష్టంతో ఇక్కడ ఒక స్థూపాన్ని నిర్మించారు. ఈ ప్రదేశంలో అశోకుడు ఏకసింహం స్థూపాన్ని నిర్మించాడు. మ్యూజియం కూడా ఉంది. ఈ ప్రదేశం ఒకప్పుడు లిచ్ఛవుల రాజధాని. ఆసియా ఖండంలో తొలి రిపబ్లిక్ స్టేట్ కూడా ఇదే. వైశాలి గత వైభవం విశాలమైనదే కానీ ఇప్పుడిక్క బౌద్ధ విశిష్ఠతలు మినహా మరే ప్రత్యేకతలూ కనిపించవు. జైన తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు పుట్టిన ప్రదేశం కూడా ఇదే. చిన్న జైన మందిరం కూడా ఉంది.విక్రమశిల మహావిహారఇది కూడా భక్తియార్ ఖిల్జీ చేతిలో ధ్వంసమైన ప్రాచీన విశ్వవిద్యాలయం. మనదేశంలో ఉన్న ప్రధానమైన బౌద్ధ మహావిహారల్లో మూడు బీహార్లోనే ఉన్నాయి. విక్రమశిల... వందకు పైగా గురువులు, వెయ్యికి పైగా విద్యార్థులతో విలసిల్లిన విద్యాలయం. తత్వం, వ్యాకరణం, ఆధిభౌతికం, తర్కశాస్త్రాలను బోధించేవారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఆసియా ఖండంలో బౌద్ధాన్ని విస్తరించారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ యూనివర్సిటీ శిథిలాలను భద్రపరిచి పునరుద్ధరించే పనిలో ఉంది. చారిత్రక జ్ఞాపకాల గౌరవార్థం ప్రభుత్వం నలంద, విక్రమశిల పేర్లతో కొత్త యూనివర్సిటీలను ఏర్పాటు చేసింది. లోకల్ ఆటో రిక్షా, కార్ ట్యాక్సీల వాళ్లతో మాట్లాడేటప్పుడు స్పష్టంగా చెప్పాలి.ఓదంతపురి చదువుల క్షేత్రంమనదేశంలో ప్రసిద్ధమైన బౌద్ధ మహావిహారలు మూడు. నలంద, విక్రమశిల, ఓదంతపురి విహారలు. నలంద తర్వాత రెండవ విశ్వవిద్యాలయం ఓదంతపురి. ఇది బీహార్ షారిఫ్లో ఉంది. పట్నా– రాజ్‌గిర్ రైల్వేలైన్‌లో వస్తుంది. ఈ మహావిహార కూడా టర్కీ నుంచి వచ్చి భారత్ మీద దాడి చేసిన ఖిల్జీ చేతిలో ధ్వంసమైనదే. ఇక్కడ బౌద్ధ క్షేత్రానికి సంబంధించిన ప్రాధాన్యత తప్ప మరే ప్రత్యేకతలూ లేక΄ోవడంతో పర్యాటకపరంగా సౌకర్యాలు తక్కువ.సారనాథ్ రాజముద్ర బుద్ధుడు తొలి ప్రవచనాన్ని వెలువరించిన ప్రదేశం సారనాథ్. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహణలో ఉంది. ఇక్కడి స్థూపం పరిరక్షణ పనులు పూర్తి చేసి పర్యాటకులకు ప్రవేశం కల్పించారు. మనం అధికారిక ముద్రగా స్వీకరించిన నాలుగు సింహాల పిల్లర్ ఇక్కడిదే. అయితే అసలు పిల్లర్‌ని మ్యూజియానికి తరలించారు. నమూనాలు ఈ ప్రాంగణంలో ఉన్నాయి. ఈ టూర్‌కి ఐఆర్సీటీసీ ప్యాకేజ్ సౌకర్యంగా ఉంటుంది. ఈ ప్యాకేజ్‌లో సారనాథ్(ఉత్తరప్రదేశ్), బుద్ధుడు పుట్టిన లుంబిని (నేపాల్), మహాపరినిర్వాణం పొందిన కుశినగర (ఉత్తరప్రదేశ్) కూడా కవర్ అవుతాయి.రాజ్‌గిర్ విశ్వశాంతి కిరణంఇది మహాభారత కాలం నుంచి ప్రాముఖ్యత సంతరించుకున్న ప్రదేశం. జరాసంధుని రాజ్యం గిరివ్రజ. పాండవ మధ్యముడు భీముడితో జరాసంధుడు యుద్ధం చేసిన ప్రదేశంగా చెబుతారు. జైనులకు కూడా ఇది ప్రముఖ ప్రదేశమే. 24వ తీర్థంకరుడు మహావీరుడు (ముని సువ్రత) పద్నాలుగేళ్లు నలంద, రాజ్గిర్లలో జీవించాడు. మగధ రాజ్యానికి తొలినాళ్లలో రాజధాని ఇదే. రాజగృహ అని పిలిచేవాళ్లు. ఇక్కడ అనేక రాజ్యాల రాజుల సమావేశంలో బుద్ధుడు బౌద్ధాన్ని బోధించాడు. రాజ్‌గిర్ విశ్వశాంతి స్తూపం నుంచి కనిపించే గ్రద్ధకూట పర్వతం మీద బుద్ధుడు కొంతకాలం ధ్యానం చేసుకున్నాడు. సప్తపర్ణి గుహలో బౌద్ధ సమావేశాలు జరిగేవి. సమీపంలోని వేణుబన్ (వెదురు వనం)లో సాంత్వన దేవాడు. శిష్యులు, సామాన్యులతోపాటు మగధ రాజు బింబిసారుడికి కూడా ఇక్కడే బోధనలు చేశాడు. విశ్వశాంతిని కోరుతూ బుద్ధుడు చేసిన బోధనలకు ప్రతీకగా ఆ ప్రదేశంలో తెల్లటి అందమైన శాంతిస్థూపాన్ని నిర్మించారు. ఈ కొండ మీదకు వెళ్లడానికి రోప్‌వే ఉంటుంది. ఈ రోప్‌వే బకెట్ ఒక్కరు మాత్రమే కూర్చునేటట్లు ఉంటుంది. కొండ మీదకు వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తాయి. (చదవండి: వన్ లెగ్డ్ జీన్స్..! ఇదేం ఫ్యాషన్ ట్రెండ్..) -
‘మహాబోధి’ మహోత్సవానికి భారీగా బౌద్ధ అనుచరుల రాక!
ప్రపంచ పర్యాటక కేంద్రమైన సాంచి(మధ్యప్రదేశ్)లో 71వ మహాబోధి మహోత్సవం ఈరోజు (శనివారం) ప్రారంభమైంది. రెండు రోజుల ఈ ఉత్సవంలో భగవాన్ గౌతమ బుద్ధుని సన్నిహిత శిష్యుల అస్థికలను అనుచరుల దర్శనం కోసం అందుబాటులో ఉంచారు. శనివారం ఉదయం 7 గంటలకు అస్థికల కలశ యాత్రను మహాబోధి సొసైటీ కార్యాలయం నుంచి చెతీస్గిరి వరకూ నిర్వహించారు. అనంతరం అనుచరుల దర్శనార్థం ఆ కలశాన్ని అందుబాటులో ఉంచారు. శ్రీలంక, వియత్నాం, థాయ్‌లాండ్, జపాన్‌తో సహా పలు దేశాల బౌద్ధ అనుచరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. శ్రీలంక మహాబోధి సొసైటీ చీఫ్ వంగల్ ఉపాథిస్ నాయక్ థెరో ఈ వేడుకల్లో పాల్గొనేందుకు శ్రీలంక నుంచి సాంచి చేరుకున్నారు. ఊరేగింపు సందర్భంగా సాంచిలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. తెల్లవారుజామున కళాకారులు ఢోలక్, వేణువుల శ్రావ్యమైన రాగాలకు సాంప్రదాయ నృత్యాలు చేస్తూ సాంచి వీధుల్లో నడిచారు. ఈ ఊరేగింపు సాంచి స్థూపం వద్దనున్న చెటియగిరి విహార్‌కు చేరుకుంది. అక్కడ బుద్ధ భగవానుని శిష్యులైన అర్హంత్ సారిపుత్ర, అర్హంత్ మహామొగ్గలన్ల అస్థికలను నేలమాళిగలో నుండి బయటకు తీసి పూజలు నిర్వహించారు. అనంతరం అనుచరుల దర్శనార్థం వాటిని ప్రత్యేక స్థలంలో ఉంచారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు, అనుచరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: ‘26/11’ తరువాత కూడా నిర్లక్ష్యం వీడని ముంబై పోలీసులు.. -
మార్గమే నాది.. నడవాల్సింది మీరే!
కపిలవస్తు నగరాన్ని రాజధానిగా చేసుకుని శాక్యగణాన్ని పాలించే రాజు శుద్ధోధనుడు. ఇతని అర్ధాంగి మహామాయ లేదా మాయాదేవి. చాలాకాలం పాటు వీళ్ళకు సంతు లేదు. చివరికి మాయాదేవి గర్భం దాల్చింది. ఆమెకు నెలలు నిండాయి. పురిటికి పుట్టింటికి బయలుదేరింది. కానీ దారిలోనే లుంబినీ వనంలో ఆమె ప్రసవించింది. ఆ రోజు వైశాఖ పున్నమి. మిట్ట మధ్యాహ్నం సిద్ధార్థుడు జన్మించాడు. అయితే సిద్ధార్థునిగా భౌతిక జననమే గానీ బుద్ధునిగా జన్మదినం కాదు. సిద్ధార్థుడు ఒక వ్యక్తి. రాకుమారుడు. ఆయనకు నా అనే వాళ్లు ఉంటారు. ‘నావి’ అనేవి ఉంటాయి. నా భార్య నా బిడ్డ, నా తల్లి, నా తండ్రి నా సోదరుడు, నా బంధువులు, నా మిత్రుడు, నా రాజ్యం నా సంపద... ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది ఉన్నంత వరకూ సిద్ధార్థుడు ఒక వ్యక్తే. ఒక రాకుమారుడో, రాజో, ఒక బిడ్డ, ఒక తండ్రి, ఒక భర్త. సంసార బంధాల మధ్యే ఉంటాడు. కాబట్టి అతని పనులన్నీ ఆ బంధాల చుట్టూనే ఉంటాయి. కానీ ఈ బంధనాల నుండి బైటకు వచ్చేశాడు సిద్ధార్థుడు. తన 29వ ఏట అన్నింటినీ త్యజించి బైటకు వచ్చాడు. ఇక ఆ రోజు నుండి ధర్మం కోసం అన్వేషణ మొదలు పెట్టాడు. బుద్ధత్వం పొందాలనుకున్నాడు. ఆ అన్వేషణ సాధన ఆరేళ్లు సాగింది. ఆరేళ్ళ తర్వాత బుద్ధగయలో నిరంజనా నదీ తీరంలో బోధివృక్షం రావిచెట్టు క్రింద ధ్యాన సాధన చేశాడు. భవచక్రాన్నుండి బైట పడ్డాడు. పరిపూర్ణ ప్రజ్ఞ సాధించాడు. దుఃఖానికి కారణమైన ఈ భవ చక్రాన్నుండి బయటపడే మార్గాన్ని కనుగొన్నాడు. అదే జ్ఞానోదయం బుద్ధత్వం, బుద్ధునిగా జననం ఇది సిద్ధార్ధుడు బుద్ధునిగా మారిన (పుట్టినరోజు) ఆరోజు కూడా విశాఖ పున్నమే! అలా సిద్ధార్థుడు బుద్ధునిగా జన్మించడానికి ఆరేళ్ళు ధర్మగర్భంలో ఉన్నాడు. భౌతికంగా శారీరకంగా .... బుద్ధునిగా తొలి ఏడు. ఇలా... సిద్ధార్థుడు పుట్టిందీ, బుద్ధత్వం పొంది సంబుద్ధుడయ్యిందీ వైశాఖ పున్నమి రోజే. బుద్ధత్వం పొందాక అతనికి ఎలాంటి భవ బంధాలు ఉండవు. తల్లీ, తండ్రీ, భార్య, బిడ్డలు, బంధువులు, మిత్రులు అనేవారు ఉండరు. ‘నా’ అనేది పూర్తిగా నశిస్తుంది. ‘నాది’ ‘నా వారు’ అనే బంధాలు నశిస్తాయి. జనాలందరూ బుద్ధునికి సమానులే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఉండదు. వ్యక్తి నశించి వ్యక్తిత్వం మాత్రమే మిగిలి ఉంటుంది. కాబట్టి స్వార్థం, ద్వేషం, ఈర్ష్య, మోహం అనేవి బుద్ధత్వంలో అదృశ్యమైపోతాయి. ఆ సంబుద్ధుడు జ్ఞాననేత్రం అవుతాడు. ధర్మనేత్రం అవుతాడు. అందరిలో తనుండడు. తనలోనే అందర్నీ ఇముడ్చుకుంటాడు. తన దుఃఖాన్ని అందరికీ పంచడు. అందరి దుఃఖాన్ని తన దుఃఖంగా భావిస్తాడు. దాన్ని తొలగించడానికే ప్రయత్నిస్తాడు. అదే బుద్ధత్వం అంటే. తన దుఃఖాన్ని తాను తీర్చుకోవడం కాదు. అందరి దుఃఖాన్ని తీర్చడం. అంటే అందరికీ దుఃఖ నివారణ చెప్పడం. ఆ మార్గంలో ఎదుటివారు తమ దుఃఖాన్ని తామే తీర్చుకోవాలి. బుద్ధుడు అలా మార్గదాత మాత్రమే! బుద్ధుని జీవితంలో మరో విశేషం ఏమంటే... బుద్ధుడు తన 80వ ఏట కుసీనగర్లో మహాపరి నిర్వాణం పొందింది కూడా వైశాఖ పున్నమి రోజునే! ఆయన నోటి నుండి వెలువడిన ఆఖరి మాటలు– ‘‘మీకు మీరే దీపం కండి. మార్గమే నాది. ఆ మార్గంలో నడవాల్సింది మీరే’’ అనేది బుద్ధుని అంతిమ సందేశం. ఇలా పుట్టుక, బుద్ధత్వం పొందడం, మహాపరి నిర్వాణం... ఈ మూడూ వైశాఖ పున్నమి రోజే. కాబట్టి బౌద్ధులు ఈ పున్నమి రోజును ‘బుద్ధ జయంతి’ అని అనకుండా ‘బుద్ధ పున్నమి’ గానే పిలుచుకుంటారు. జరుపుకుంటారు. – బొర్రా గోవర్ధన్ -
రూపకాయంగా కాదు...ధర్మకాయంగా చూడాలి!
బౌద్ధకేంద్రమైన శ్రావస్తిలో పుట్టి పెరిగిన సుభద్రకు పెళ్లయింది. అత్తవారిల్లయిన రమణక నగరానికి ఆమె తొలిసారి వచ్చింది. అది బుద్ధభగవానుల గురించి ఏమాత్రం తెలియని ఊరని కొద్దిరోజుల్లోనే ఆమె గ్రహించింది. శ్రావస్తిలో తరచు బుద్ధుని దర్శిస్తూ ఆయన బోధనలు వినడానికి అలవాటు పడిన సుభద్రకు అక్కడ ఉండటం కష్టమనిపించింది. ఒకరోజు ఆమె మిద్దెమీదికెళ్లి, శ్రావస్తి దిక్కుగా చూస్తూ, ‘‘భగవాన్! ఇక్కడ మీ గొంతు వినపడటం లేదు. మీరు కనపడటం లేదు. మీకు, మీ భిక్షుక సంఘానికి ఏ లోటూ రాకుండా నేను చూసుకుంటాను. నా గోడు విని సత్వరం మీరు రమణక నగరం రావాలి. ప్రాణం పోయినా సరే, మీకు ఆతిథ్యం ఇచ్చికానీ నేను భుజించను’’అని ప్రార్థించింది. విచిత్రంగా బుద్ధుడు భిక్షుక సంఘంతో ఆ నగరంలోకి ప్రవేశించి, నేరుగా ఆమె ఇంటికే భిక్షకు వచ్చాడు. మహదానందంతో వారికి ఆతిథ్యమిచ్చి, తన మనసులోని బాధను ఆయనకు చెప్పుకుంది సుభద్ర. అప్పుడు బుద్ధుడు ‘‘అమ్మా! సుభద్రా! నన్ను రూపకాయంగా చూడటం కాదు, ధర్మకాయంగా చూడు. రూపకాయం కొన్నాళ్లకు శిథిలమై అంతరించిపోతుంది. ధర్మకాయం శాశ్వతంగా ఉంటుంది.. ఈ సత్యాన్ని సదా గుర్తుంచుకో! నిజానికి మనం ఎక్కడున్నా సర్దుకుపోవడం నేర్చుకోవాలిన. భూమాతనే చూడు! ఒకచోట సమతలంగా; వేరొక చోట ఎత్తుపల్లాలుగా, ఇంకొక చోట కంటకమయంగా ఉంటుంది. భూమి ఎలా ఉన్నా, జత చెప్పులుంటే చక్కగా నడిచి పోవచ్చు. అలాగే జీవితంలో ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా అధిగమించడానికి కుశల చిత్తం ముఖ్యం! చింతను దూరం చేసేది కుశల చిత్తమే! నీవు ఎల్లప్పుడూ కుశల చిత్తంతో ఉంటే శ్రావస్తి అయినా రమణక నగరమైనా ఒకేలా కనిపిస్తాయి’’అన్నాడు సుభద్రను వాత్సల్యదృష్టితో చూస్తూ! బుద్ధభగవానుల అమృతవాక్కులతో సుభద్ర మనసులోని బాధ తొలగిపోయింది. – చోడిశెట్టి శ్రీనివాసరావు