
సాక్షి, హైదరాబాద్: బుద్ధా భవన్ హైడ్రా కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైడ్రా, డీఆర్‌ఎఫ్ సిబ్బంది నిరసనలకు దిగారు. తమ జీతం కట్ చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీతం తగ్గించిన కారణంగా ఈరోజు నుండి విధులకు వెళ్లకుండా నిరసనలు వ్యక్తం చేస్తామని సిబ్బంది హెచ్చరించారు.
వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని బుద్ధా భవన్ వద్ద డీఆర్‌ఎఫ్, హైడ్రా సిబ్బంది ఆందోళనలకు దిగారు. రాత్రి, పగలు తమతో పనులు చేయించుకుని.. జీతంలో ఐదు వేలు కట్ చేశారని నిరసన చేపట్టారు. అయితే, గతంలో జీహెచ్‌ఎంసీ అండర్‌లోని ఈవీడీఎంలో పనిచేసిన 1100 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది.. ప్రస్తుతం హైడ్రాలోని డీఆర్‌ఎఫ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అందరికీ ఒకేలా జీతాలు అందేలా జీవో తెచ్చింది.

ప్రభుత్వం తెచ్చిన జీవో ప్రకారం.. అందరికీ ఒకేలా జీతాలు అందాల్సి ఉన్నప్పటికీ తమకు మాత్రం 5000 కట్ చేసినట్టు సిబ్బంది చెబుతున్నారు. మొత్తం సిబ్బందిలో దాదాపు సగం మందికి జీతం కట్ అయినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు జీతంలో కోత విధించారో చెప్పాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. తమకు రావాల్సిన జీతం ఇచ్చే వరకు ఈరోజు నుండి విధులకు వెళ్లకుండా నిరసనల్లో పాల్గొంటామన్నారు.