వైట్‌ కాలర్‌ ఉగ్రవాదం... ఓ వాస్తవం | Sakshi Guest Column On Delhi blast, Terrorism | Sakshi
Sakshi News home page

వైట్‌ కాలర్‌ ఉగ్రవాదం... ఓ వాస్తవం

Nov 15 2025 12:53 AM | Updated on Nov 15 2025 12:53 AM

Sakshi Guest Column On Delhi blast, Terrorism

సందర్భం

నవంబర్‌ 10 సాయంత్రం జరిగిన కారు బాంబు పేలుడుతో న్యూఢిల్లీ గతుక్కుమంది. భద్రతా సంస్థలు ఒక ప్రధాన నిందితుడిని గుర్తించగలిగాయి. కశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన ఈ డాక్టర్‌ అధునాతన టెర్రర్‌ మాడ్యూల్‌లో భాగమని భావిస్తున్నారు. ఈ వైట్‌–కాలర్‌ టెర్రర్‌ మాడ్యూల్‌కు పాకిస్తాన్‌లో పేరుమోసిన జైషే మహమ్మద్‌ సంస్థతో సంబంధం ఉన్నట్లు వెలుగు చూస్తున్న సాక్ష్యాధారాలు వెల్లడిస్తున్నాయి. ఉగ్రవాద సంస్థలు తాము నేరుగా ప్రమేయం పెట్టుకోకుండా, విద్యావంతులైన స్థానిక రిక్రూట్లతో దుశ్చర్యలకు పాల్పడే ధోరణి పెరుగుతోంది. 

విద్యావంతుల దుశ్చర్య
‘ఆపరేషన్‌ సిందూర్‌’ తర్వాత కూడా, ఉగ్రవాద ప్రయత్నాలలో ఎక్కడా విరామం కనిపించడం లేదు. భద్రతా దళాలు మే నెల నుంచి, కొన్ని డజన్ల ప్రయత్నాలను భగ్నం చేసినట్లు నిపుణుల అంచనా. స్థానిక మాడ్యూళ్ళ  ప్రమేయమే చాలా వాటిలో ఉంది. కారు పేలుడుకు ముందు, వివిధ చట్ట సంస్థల అధికారులు రెండు గణనీయమైన డంపులను బట్టబయలు చేయగలిగారు. పోలీసులు నవంబర్‌ 9న వసతి భవనాల నుంచి 350 కిలోల అమోనియం నైట్రేట్‌తో సహా దాదాపు 3,000 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి కశ్మీర్‌ నుంచి పనిచేస్తున్న ఒక ఉగ్ర ముఠాకు చెందినవి. స్వాధీనపరచుకున్న వాటిలో అసాల్ట్‌ రైఫిళ్ళు, పిస్తోళ్ళు, బాంబుల తయారీకి ఉపయోగపడే టైమర్లు, రిమోట్‌ డిటొనేషన్‌ సాధనాలు కూడా ఉన్నాయి. 

గుజరాత్‌ ఉగ్ర నిరోధక స్క్వాడ్‌ (ఏటీఎస్‌) అదే రోజున ముగ్గురు అనుమానితులను అరెస్టు చేసింది. వారి నుంచి బిరెట్టా పిస్తోళ్ళు, తూటాలు స్వాధీనపరచుకున్నారు. ఈ రెండు కేసుల్లోనూ డాక్టర్లు, విశ్వవిద్యాలయ ఉద్యో గులు నిందితులుగా ఉన్నారు. వైట్‌–కాలర్‌ ఉగ్రవాదం పెరుగుతున్న ధోరణికి ఇవి మరిన్ని ఆధారాలను సమకూర్చాయి. 

భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌ సాగి స్తున్న సీమాంతర ఉగ్రవాదంలో మారిన వ్యూహానికి ఢిల్లీ ఘటన అద్దం పడుతోంది. అది ఇక ఎంతమాత్రం విదేశీ ముష్కరులపై ఆధార పడటం లేదు. సరిహద్దుల నుంచి నేరుగా చొర బడేటట్లు చేయడం లేదు. భారతదేశం లోపల వృత్తి నిపుణులను మతోన్మాదులుగా తయారు చేసి వారిని దాడులకు ఉపయోగించుకునే పనికి పాకిస్తాన్‌ నిగూఢ వ్యవస్థ పాల్పడుతోంది. ఇది తమకేం సంబంధం లేదని చెప్పుకొనేందుకు పాక్‌ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నం. దీనివల్ల ఉగ్రవాద చర్యలను పాకిస్తాన్‌తో, దాని లోని సంస్థలతో నేరుగా ముడిపెట్టడం కుదరదు.

మారిన పాక్‌ వ్యూహం
పాక్‌ ఇలా వ్యూహం మార్చుకోవడం వెనుక దేశీయ, అంతర్జాతీయ అంశాలు చాలా ఉన్నాయి. ఉగ్ర సంఘటనల్లో పాత్రకుగానూ అంతర్జాతీ యంగా ఎదురయ్యే విఘాతాలను తప్పించుకోవా లని పాక్‌ యోచిస్తోంది. ‘ఫైనాన్సియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌’ ఈ మధ్య అంటే అక్టోబర్‌ నెలలో పాకిక్‌కు తాజాగా హెచ్చరిక జారీ చేసింది. నిషే ధిత జాబితా నుంచి 2022లో బయటపడినందుకు సంబరపడిపోవద్దనీ, అది గుప్త ధనాన్ని మార్చడం, ఉగ్రవాదులకు నగదు చేకూర్చడానికి సంబంధించి అంతర్జాతీయ పర్యవేక్షణ నుంచి తప్పించుకున్నట్లు కాదనీ స్పష్టం చేసింది. 

పాకిస్తాన్‌ లోపల కూడా పరిస్థితులు సవ్యంగా లేవు.‘తెహ్రీక్‌–ఏ–తాలిబాన్‌ పాకిస్తాన్‌’ మళ్ళీ విజృంభిస్తోంది. అఫ్గానిస్తాన్‌తో ఘర్షణ కొనసాగుతోంది. ఫలితంగా, పాక్‌ సైన్యం ఆంతరంగిక భద్రతా విధుల పైనా, డ్యూరాండ్‌  రేఖ పైనా ఎక్కువ దృష్టి పెట్టవలసి వస్తోంది. ప్రాంతీయ ఘర్ష ణల్లో వ్యూహాత్మక లివరేజీని నిలబెట్టుకుంటూనే అంతర్జాతీయంగా తనకున్న చెడ్డ పేరును చెరిపేసు కుని, కొత్త అవతారం దాల్చినట్లుగా కనిపించవలసిన అవసరాన్ని అది గుర్తించింది. 

భారతదేశపు భద్రతా సంస్థలు కనివిని ఎరుగని సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి. విదేశీ చొర బాటుదారులకు, దేశీయ కుట్రదారులకు మధ్యనున్న రేఖలు చెరిగిపోతున్నాయి. టెర్రర్‌ మాడ్యూళ్ళు వృత్తి నిపుణుల ముసుగును కూడా వేసుకుంటున్నాయి. వివిధ ప్రాంతాల్లో దొరికిన ఆయుధాలు, పేలుడు పదార్థాలు, అవి ఏవో చెదురుమదురు దాడులకు ఉద్దేశించినవి కావనీ, సరిహద్దుకు ఆవల నున్న సూత్రధారుల ఆదేశాల మేరకు విస్తృత దాడులకు పథకాలు రచించుకున్నాయనీ తేలుతోంది. 

భద్రతా సంస్థలు ఎప్పటికప్పుడు చురుకుగా వ్యవహరిస్తూ నూతన రిక్రూట్‌మెంట్‌ మార్గాల రూపు రేఖలను కనిపెట్టవలసి ఉంది. వృత్తి విద్యా సంస్థల్లో రాడికలైజేషన్‌పై మానవ ఇంటెలిజెన్స్‌ పెంచు కోవాల్సి ఉంది. ఎవరెవరు చేతులు కలుపుతున్నారో గ్రహించేందుకు ఫోరెన్సిక్‌ డేటాను, డిజిటల్‌ నిఘాను వినియోగించుకోవాలి. సంస్థలు కూడా ఉద్యోగాలిచ్చే ముందు క్షుణ్ణంగా నేపథ్యాలు తెలుసు కోవాలి. 

యూనివర్సిటీలు, వృత్తి విద్యా సంస్థల లోపల కౌంటర్‌–రాడికలైజేషన్‌ ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాలి. ఫ్రాన్స్‌ 2018లో చేపట్టిన ‘కాపాడుకునేందుకు నివారణ’ మార్గాన్నే మనమూ అనుసరించవచ్చు. సామాజిక, విద్యా, భద్రతా, జైలు వ్యవస్థలను కూడగట్టుకుని ప్రభుత్వం సమ  న్వయ కార్యాచరణ ద్వారా ఎవరూ ఉగ్రవాదం వైపు మళ్ళకుండా నివారించడంపై దృష్టి పెట్టాలి.

లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ ఎస్‌.కె. సైనీ (రిటైర్డ్‌)
వ్యాసకర్త సైనిక దళ మాజీ వైస్‌ చీఫ్‌ (‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)


విశ్లేషణ
ఎర్ర కోట వద్ద జరిగిన కారు పేలుడు ఘటనను ఉగ్ర దాడిగా ముద్ర వేయడంపై ప్రభుత్వం అభినందనీయమైన రీతిలో ఆచితూచి వ్యవహరించింది. దర్యాప్తు మొదలైన రెండు రోజుల తర్వాతే, దాన్ని ధ్రువపరచింది. కొన్ని ప్రాథమిక వాస్తవాలు తేటతెల్లమయ్యాయి. ఒక మాడ్యూల్‌ కశ్మీర్‌లో పనిచేస్తోంది. పెద్ద యెత్తున పేలుడు పదార్థాలు సహారన్‌పుర్, ఫరీదాబాద్‌ మీదుగా దేశ రాజధానికి చేరుకున్నాయి. ఆ రెండూ పరస్పర సంబంధం కలిగినవనీ, పాలుపంచుకున్నది ఒకే మాడ్యూలేననీ కొత్త డేటా తెలుపుతోంది. కానీ ఎవరి ప్రేరణతో జరిగిందనేది స్పష్టం కాలేదు. దీన్ని మరింత ప్రమాదకరమైనదిగా భావించవలసి వస్తోంది. ఇది అజ్ఞాతంగా పాకుతూ పోయే వైరస్‌ లాంటిది. 

డాక్టర్‌ టెర్రర్‌
పోలీసులకు సహకరించవద్దని ఉద్భోదిస్తూ జైషే–మహమ్మద్‌ పోస్టర్లు నౌగామ్, శ్రీనగర్‌లలో అక్టోబర్‌లో దర్శనమిచ్చాయి. అప్రమత్తంగా ఉన్న పోలీస్‌ సూపరింటెండెంట్‌ వాటికి కారకుడైన వ్యక్తిని గుర్తించారు. అతను అదీల్‌ అహ్మద్‌ రాథెర్‌ అనే డాక్టర్‌. అనంతనాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశా లలో సీనియర్‌ రెసిడెంట్‌గా పనిచేశాడు. జమ్ము–కశ్మీర్‌ పోలీసులు ఆ వైద్య కళాశాలలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కనుగొన్నారు. 

వాళ్ళు ఉత్తర ప్రదేశ్‌ పోలీసులను అప్రమత్తం చేయడంతో, అది నవంబర్‌ మొదటి వారంలో సహారన్‌పుర్‌కు మకాం మార్చిన రాథెర్‌ అరెస్టుకు దారి తీసింది. అక్కడ తీగ లాగితే ఫరీదాబాద్‌లో డొంక కది లింది. ముజమ్మీల్‌ గనాయీ అరెస్టయ్యాడు. పుల్వామాకు చెందిన అతడు ఫరీదాబాద్‌లోని అల్‌–ఫలా ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తు న్నాడు. ఇవి నవంబర్‌ మొదట్లో జరిగిన సంఘ టనలు. ఫలితంగా, ఫరీదాబాద్‌లో అమో నియం నైట్రేట్‌తో సహా సుమారు 2,900 కిలోల పేలుడు పదార్థాలు దొరికాయి. 

మరింత మంది ఉగ్రవాదులను పసిగట్టే పనిని పోలీసులు నవంబర్‌ 10న  ప్రారంభించి నప్పటికీ, ఆ సాయంత్రం ఎర్ర కోట వద్ద కారు బాంబు పేలింది. సీసీటీవీ ఫుటేజీలో ఉమర్‌ ఉన్‌–నబీ అనే మరో డాక్టర్‌ పైకి తేలాడు. కారు నడిపింది అతడేనని ఫోరెన్సిక్‌ ఆధారాలు వెల్ల డించాయి. అతనూ ఫరీదాబాద్‌లోని అదే ఆస్ప త్రికి చెందినవాడు. షోపియాన్‌లో ఒక రాడికల్‌ ఇమామ్‌ను, అల్‌–ఫలాకు చెందిన మహిళా డాక్టర్‌ను లక్నోలో అదుపులోకి తీసుకున్నారు. మరింత మంది పట్టుబడవచ్చు. 

అసలు కారు బాంబును ఉద్దేశపూర్వకంగానే పేల్చారా అనేది సందేహంగా మారింది. అక్కడికి కొద్ది వందల గజాల దూరంలో  శ్రీ గౌరీ శంకర్‌ ఆలయం ఉంది. అక్కడ కారు బాంబును పేల్చి ఉంటే మరింత మంది చని పోయి ఉండేవారు. ఉగ్ర వాదులు సాధారణంగా కోరుకునే మతపరమైన కల్లోలాలను రేకెత్తించి ఉండేది. ముఠాలోని ఇతర సభ్యులు పట్టుబడటంతో, అతను భయోత్పాతానికి లోనై పేల్చేసుకున్నాడన్నది ఒక భావన. ఏ విధంగా చూసినా, ఇది రెండేళ్ళుగా సాగుతున్న పథకంగా కనిపిస్తోంది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు ముందే ఈ సెల్‌ క్రియాశీలంగా ఉంది కనుక, జైష్, లష్కర్‌ల పురిటి గడ్డపై వైమానికి దాడులకు ప్రతీకారంగా ఇది జరిగి ఉండవచ్చునుకోవడానికి లేదు. 

కాచుకుని ఉన్న శత్రువులు
ఇది సడీచప్పుడు లేకుండా పనిచేస్తూ వచ్చిన, విస్తృతమైన స్లీపర్‌ సెల్‌. అనుమానించడానికి ఏమాత్రం అవకాశం లేని వ్యక్తులు దీనిలో ఉన్నారు. వారందరూ కశ్మీర్‌కు చెందినవారు కాదు. ఈ ధోరణిని అర్థం చేసుకునేందుకు స్పెయిన్, ఇటాలియన్‌ పోలీసుల చర్యలోకి వెళ్ళాలి. వారు అక్కడ ఒక పెద్ద పాకిస్తానీ సెల్‌ను కనుగొన్నారు. అది జనాన్ని ఉగ్రవాదం వైపు నడిపిస్తోందని తేలింది. దాని ఆనుపానులు కనుగొనేందుకు పోలీసులకు రెండేళ్ళు పట్టింది. ఈ ఏడాది మార్చిలో మాత్రమే వారు కొందరిని అరెస్టు చేయగలిగారు. ఒక కీలక వాస్తవాన్ని గుర్తించి తీరాలి. ఉగ్రవాదాన్ని సరికొత్తగా సృష్టించలేం. ప్రస్తుతమున్న వేర్పాటువాద పరిస్థితిని ఆధారం చేసుకునే అది పైకి లేస్తుంది. వీటిలో రెండవ దానికి పాకిస్తానే చక్కని ఉదాహరణ. 

ఢిల్లీ ఇంతవరకు ఉపేక్షించిన ఒక అంశానికి వ్యతిరేకంగా కార్యాచరణకు దిగాలి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మత విద్వేషం సెగలు గక్కుతోంది. రెండు వర్గాలకు చెందిన మనుషులు చనిపోయిన అంశాన్ని మీడియా ప్రముఖంగా పేర్కొనవలసిన అవసరం ఉంది. ఇది దేశాల సరిహద్దులను దాటిన అంతర్జాతీయంగా కనిపిస్తున్న ధోరణి. కీలక ఉగ్రవాద నాయకులు తుర్కియేలోని ‘సూత్రధారుల’తో సమావేశమైనట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో, అంకారాను హెచ్చరించడం కూడా సమయోచితం అనిపించుకుంటుంది. భారతదేశాన్ని ఎలాగైనా ముక్కచెక్కలు చేయాలని చాలా మంది శత్రువులు కాచుకుని కూర్చున్నారు. భారత్‌–పాక్‌ యుద్ధానికి దిగాలని చూస్తున్నారు. భారత్‌ ఆర్థికంగా స్థిరంగా వృద్ధి చెందుతూండటం అనేక రాజధానులలో గణనీయమైన ఆందోళన రేకెత్తిస్తోంది. 

తారా కార్థా 
వ్యాసకర్త నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సెక్రటేరియట్‌ మాజీ డైరెక్టర్‌
(‘ద హిందూస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement