విశ్లేషణ
పాకిస్తాన్ పార్లమెంట్ ప్రస్తుతం ప్రతిపాదిత 27వ రాజ్యాంగ సవరణపై చర్చిస్తోంది. ఈ సవరణ 243వ అధికరణాన్ని పూర్తిగా మార్చేసి దేశ సాయుధ దళాలపై నియంత్రణ, ఆధిపత్యానికి సంబంధించి మౌలికంగా కొత్త రూపు నివ్వనుంది. దేశ రాజకీయ రంగస్థలంపై సైన్యానికున్న పట్టును దృష్టిలో పెట్టుకుని చూసినపుడు, ఆ చర్చ చాలావరకు నిరుపయోగమైనదే అవుతుంది. ఎందుకంటే ఈ ఏడాది మొదట్లో భారత్–పాకిస్తాన్ మధ్య ప్రతిష్టంభన తర్వాత, పాకిస్తాన్ సైనిక ప్రధానాధికారి అసీమ్ మునీర్‌కు ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి కల్పించారు. అమెరికా అధ్యక్షుడి నుంచి లభిస్తున్న వ్యక్తిగత మద్దతు ధీమాతో ఆయన సాయుధ దళాలపై తన అధికారాన్ని మరింత పటిష్ఠపరచుకుంటున్నారు. పౌర ప్రభుత్వ–సైనిక సంబంధాలలో ఇప్పటికే మొగ్గు సైన్యం వైపు ఎక్కువగా ఉంది. తక్కెడలో సైన్యం వైపు బరువు మరింత పెరిగేటట్లు మునీర్ చూసుకుంటున్నారు.
పదాతి దళానికే పెద్ద పీట
ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ పౌర–సైనిక సంబంధాలలో, సైన్యం పాత్రలో గణనీయమైన మార్పులను ప్రవేశపెట్టే లక్ష్యాలతో ఉంది. త్రివిధ దళాలపైన పెత్తనం వహించేటట్లుగా రక్షణ దళాల ప్రధానాధికారి (సీడీఎఫ్) పదవిని సృష్టించాలని ప్రతిపాదిస్తోంది. సీడీఎఫ్‌గా ఎప్పుడూ పదాతి దళాల ప్రధానాధికారే ఉండాలని పేర్కొంటోంది. ఆయన పదవీ కాలాన్ని ఐదేళ్ళకు పెంచుతోంది. సీడీఎఫ్‌కు వీలు కల్పించేందుకు, చిరకాలంగా ఉన్న త్రివిధ దళాల సంయుక్త కమిటీ చైర్మన్ (సి.జె.సి.ఎస్.సి.) పదవిని త్వరలో రద్దు చేయనున్నారు.
సంయుక్త కమిటీకి ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా రిటైరవడం, ఆ పదవి రద్దవడం ఒకేసారి జరగనున్నాయి. ఐదు నక్షత్రాల ర్యాంకులు పొందిన సైనిక అధికారులకు ఫీల్డ్ మార్షల్, మార్షల్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్, అడ్మిరల్ ఆఫ్ ద ఫ్లీట్ వంటి సైనిక బిరుదులను ప్రదానం చేయడం అసాధా రణం ఏమీ కాదుకానీ, అటువంటివారిని అభిశంసన ద్వారా తప్ప వేరే విధంగా తొలగించడానికి వీలు లేకపోవడం పాక్‌లో కనిపించే విచిత్రమైన అంశం.
అన్ని అణు, వ్యూహాత్మక సంపత్తులను పర్యవేక్షించే విధంగా జాతీయ వ్యూహాత్మక దళ కమాండర్ (సి.ఎన్.ఎస్.సి.)గా ఒకరిని నియమించాలని కూడా ఆ సవరణ ప్రతిపాదిస్తోంది. ఆర్మీ చీఫ్ సిఫార్సు మేరకు, సైన్యం నుంచే ఒకరిని ఆ పదవిలో ప్రధాన మంత్రి నియమిస్తారు. సూటిగా చెప్పాలంటే, దానిపై నియంత్రణ పౌర ప్రభుత్వం నుంచి చేజారిపోతోంది. వీసమెత్తు ప్రతిఘటన లేకుండా, పాక్‌లో బాహాటంగా, ఇలా అధికారం కేంద్రీకృతం కావడం, పర్వేజ్ ముషారఫ్ హయాంతో సహా, ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఈ పరిణామాలు పాక్, భారత్ రెండింటిపైనా గణనీయమైన ప్రభా వాన్ని చూపనున్నాయి.
అనూహ్యంగా ఎదిగిన మునీర్
పాక్‌ను 1977 నుంచి 1988 వరకు పాలించిన సైనిక పాలకుడు జియా–ఉల్–హక్ తర్వాత, తిరిగి అంత ప్రాభవాన్ని అనుభవిస్తున్న వ్యక్తి మునీర్ కానున్నారు. జియా కంటే కూడా మునీరే నాలుగు ఆకులు ఎక్కువ చదివాడనుకోవాలి. సైనిక తిరుగుబాటు మాట లేకుండానే ఆయన మొత్తం అధికారాన్ని తన గుప్పిట్లోకి తెచ్చు కున్నారు. అసీమ్ అధికారాన్ని పటిష్ఠపరచుకున్న తీరు ఆసక్తి కలిగిస్తుంది. ఆయన 2022 నవంబర్‌లో ఆర్మీ చీఫ్ అయ్యారు.
హిందువులు, ముస్లింలు కలసి ఎన్నడూ సహజీవనం సాగించలేరంటూ వ్యాఖ్యానించి, హిందూ వ్యతిరేక ధోరణితో ఈ ఏడాది మొదట్లో వార్తల కెక్కారు. ఘోరమైన పహల్‌గామ్ దాడికి సరిగ్గా ఒక నెల ముందు ఆయన నోటి నుంచి ఆ ప్రేలాపనలు వెలువడ్డాయి.
పాక్‌లో అడుగుజాడలున్న ఉగ్రవాదులు పహల్‌గామ్‌లో పౌరులను పొట్టనబెట్టుకోవడంతో, పాక్‌పై భారత్ దాడులను నిర్వ హించింది. ఆ స్వల్పకాలిక సమరంలో, తాను 1971 మాదిరి విజ యాన్ని సాధించినట్లుగా పాక్ నిస్సిగ్గుగా ఒక ప్రాపగాండా ప్రారంభించింది. దాన్ని ఊతంగా చేసుకునే మునీర్ దేశంలో తన స్థితిని పటిష్ఠపరచుకుని, ఫీల్డ్ మార్షల్‌గా ప్రమోషన్ గడించారు. పాక్‌ను ట్రంప్‌కు చేరువ చేసే పనిని యుక్తితో నిర్వహించారు. సౌదీ అరేబి యాతో రక్షణ ఒప్పందాన్ని ఆధికారికం చేసుకోవడంతో సహా పశ్చి మాసియాకు స్నేహహస్తాన్ని చాచే వ్యూహాత్మక ప్రణాళికను రచించడంలో కృతకృత్యులయ్యారు.
ప్రతిపాదిత రాజ్యాంగ సవరణతో, మునీర్ పదవీ కాలాన్ని ఐదేళ్ళకు పొడిగించినట్లవుతుంది. త్రివిధ దళాలు ఆయన కనుసన్న ల్లోనే మెలుగుతాయి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పరమ అధ్వాన్నంగా తయారైన పరిస్థితుల్లో, తెలివిగా పావులు కదుపుతూ, కేవలం ఎనిమిది నెలల్లో ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు. కార్యనిర్వాహక అధికారాన్ని హస్తగతం చేసుకోకపోయినా నేడు పాక్‌లో ఆయనకు ఎదురు చెప్పగలవారు లేరు.
ప్రస్తుత సవరణ, వైమానిక, నౌకా దళాలను కూడా ఆర్మీ చీఫ్ పరిధిలోకి తీసుకొస్తుంది. ఇది ఆ రెండు దళాలకు రుచించకపోవచ్చు. సైనిక ప్రధానాధికారే ఎల్లప్పుడూ సి.ఎన్.ఎస్.సి.గా ఉంటాడని నిర్దేశించడాన్ని అవి వ్యతిరేకించవచ్చు. క్షిపణులు సాధారణంగా నౌకాదళం వద్ద ఉంటాయి.
ఇపుడీ సవరణతో మొత్తం పాక్ అణ్వాయుధాలన్నీ పూర్తిగా సైన్యం నియంత్రణలోకి వస్తాయి. సైన్యానికి ప్రస్తుతం ఉన్న పైచేయిని ధ్రువపరచే ప్రయత్నం మాత్రమే మునీర్ చేస్తూ ఉండవచ్చు. కానీ, ఇది కార్యనిర్వాహక వ్యవస్థ ఆదేశంగా కాకుండా, రాజ్యాంగ సవరణ రూపం పొందుతోంది. కనుక, భవిష్యత్ నాయకులకు, దీన్ని తిరగదిప్పడం అసాధ్యంగా పరిణమించవచ్చు.
భారత్ ద్వేషమే ఆయుధం
భారత్ పట్ల మునీర్ విద్వేష వైఖరి సుస్పష్టం. ఇపుడు మరిన్ని అధికారాలున్న మునీర్ కింద పనిచేసే సైన్యం, భారత్‌కు గణనీ యమైన సవాల్‌గా పరిణమిస్తుందనడంలో సందేహం లేదు. చిర కాలంగా, పాక్ సైన్యం దృష్టంతా భారతదేశంపైనే ఉంటూ వస్తోంది. అది ఇపుడు మరింత కేంద్రీకృతమవుతుంది. సాధారణ ప్రజానీకం, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు, పాకిస్తానీ పౌర సమాజం ఈ మార్పులను ప్రతిఘటించే అవకాశం ఉంది.
అటువంటి పరిస్థితి తలెత్తడం సైన్యానికే వాటంగా ఉంటుంది. ప్రజల దృష్టిని మళ్ళించే అత్యంత ప్రభావయుక్తమైన వ్యూహంగా, అది భారతదేశంపై యుద్ధానికి, లేదా ఘర్షణకు దిగవచ్చు. భారత్‌కు వ్యతిరేకంగా సైన్యం చెప్పే కాకమ్మ కథలను నమ్మడానికే సహజంగా జనం మొగ్గు చూపు తారు. అది వారిని ఏకం చేసే ఆయుధంగానూ పనికొస్తుంది. కనుక, మునీర్ ఎత్తుగడలను భారత్ తప్పనిసరిగా ఒక కంట కనిపెడుతూ ఉండాలి.
హ్యాపీమ్యాన్ జాకబ్
వ్యాసకర్త ‘కౌన్సిల్ ఫర్ స్ట్రాటెజిక్ అండ్ డిఫెన్స్ రిసెర్చ్’ ఫౌండర్–డైరెక్టర్ (‘ద హిందూస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)


