
సాక్షి ఎడిటర్, పాత్రికేయులకు వెల్లువెత్తుతున్న సంఘీభావం
పోలీసుల కేసులపై ముక్తకంఠంతో ఖండన
సాక్షి, హైదరాబాద్: పత్రికాస్వేచ్ఛను హరించేలా ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరును ఏపీ, తెలంగాణకు చెందిన పలు రాజకీయ పార్టీల నేతలు, జర్నలిస్టు సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ తీరు పత్రికల గొంతునొక్కడమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, బ్యూరో ఇన్‌చార్జి, రిపోర్టర్లపై ఏపీ ప్రభుత్వ ప్రోద్బలంతో పోలీసులు కేసులు పెట్టి ఆఫీస్‌కు వచ్చి మరీ నోటీసులు అందజేయడంపై వారు మండిపడ్డారు.
‘సాక్షి’ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్‌లో ప్రచురితమైన వార్తపై చద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కేసు పెట్టి నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. వార్తాపత్రికలో వచ్చిన ఏదైనా వార్తపై అభ్యంతరాలుంటే ఖండించడం, వివరణ ఇవ్వడం సంప్రదాయం కాగా.. ఏకంగా కేసులు పెట్టి సాక్షి జర్నలిస్టులకు నోటీసులు ఇవ్వడాన్ని ఖండించారు. పత్రికాస్వేచ్ఛకు విఘాతం, భంగం కలిగేలా, ప్రజాస్వామ్య విలువలకు భంగం వాటిల్లేలా ఏపీ ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు వ్యవహరించడాన్ని నిరసించారు. పలు పార్టీల నాయకులు, జర్నలిస్టు సంఘాల నేతల అభిప్రాయాలు.. వారి మాటల్లోనే..
కక్షపూరితం.. అత్యంత దుర్మార్గం
ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛ పట్ల రాజకీయ పార్టీలకు గౌరవం ఉండాలి. అది లేనప్పుడు ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. పత్రికా స్వేచ్ఛ అనేది భావ ప్రకటన స్వేచ్ఛ అని ప్రభుత్వంలో ఉన్న వారికి తెలియంది కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)ఏ ఈ హక్కును ప్రసాదించింది. దీనిని ఉల్లంఘించి ఇష్టానుసారం పాలన సాగిస్తామంటే కుదరదు. రాజకీయ నేతలు మాట్లాడిన మాటలను ప్రజల వద్దకు తీసుకెళ్లే మాధ్యమం మీడియా.
ఈ క్రమంలో వారికి ఇష్టం లేని మాటలు మాట్లాడారని ప్రజల గొంతుక అయిన పత్రిక పట్ల, పత్రిక ఎడిటర్ పట్ల కక్ష పూరితంగా వ్యవహరించడం అత్యంత దుర్మార్గం. ప్రజాస్వామ్యానికి ఏమాత్రం ఇది మంచిది కాదు. రాత్రి తర్వాత కచ్చితంగా పగలు అనేది వస్తుందని పాలకులు గుర్తుంచుకోవాలి. సాక్షి ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి, ఇతర పాత్రికేయులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. – బొత్స సత్యనారాయణ, శాసన మండలి విపక్ష నేత
భయపెట్టి దారికి తెచ్చుకోవాలనే కుతంత్రం
రాష్ట్ర ప్రభుత్వ పనితీరు గురించి వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడిన మాటలను ప్రచురించినందుకుగాను ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయడం ఎంత మాత్రం సరికాదు. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపే. సాక్షి దినపత్రిక వాస్తవాలను వెలికి తెస్తోందని, ప్రభుత్వ పెద్దల నిర్వాకాలను బట్టబయలు చేస్తోందని ఇలా దుర్మార్గంగా కేసులు పెట్టడం ఎంత మాత్రం భావ్యం కాదు.
పత్రికలో వచ్చిన వార్త లేదా కథనంలో ఏవైనా అభ్యంతరాలుంటే ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసుకోవచ్చు. లేదా రిజాయిండర్ ఇవ్వొచ్చు. దానికి స్పందించకపోతే పరువునష్టం దావా వేసుకోవచ్చు. భయపెట్టి, తన దారిలోకి తెచ్చుకోవాలనే కుతంత్రంతో తప్పుడు కేసులు పెట్టడాన్ని సమాజం హర్షించదు. వెంటనే సాక్షి ఎడిటర్‌పై కేసులను ఎత్తివేయాలి. – భూమన కరుణాకర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత
కేసులు పెట్టడం పద్ధతి కాదు
వార్తాపత్రికల్లో వచ్చే ప్రతి విమర్శపై కేసులు పెట్టడం పద్ధతి కాదు. ఎవరి మీద అయినా కేసు పెట్టడానికి ముందు, నోటీసులు ఇవ్వడానికి ముందే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. ఆధారాలు లేకుండా కేసులు పెట్టడం చట్టవిరుద్ధం. ప్రచురితమైన వార్తలపై అభ్యంతరాలుంటే వివరణ లేదా రిజాయిండర్ ఇవ్వాలి. దానిని ఆ పత్రిక ప్రచురించకపోతే తదుపరి చర్యలు తీసుకునే వీలుంటుంది. – ఎన్.రామచందర్‌రావు, సీనియర్ న్యాయవాది, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు
పత్రికాస్వేచ్ఛపై దాడే
సాక్షి ఎడిటర్‌పై అక్రమ కేసును తీవ్రంగా ఖండస్తున్నాం. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడిగానే పరిగణిస్తున్నాం. ఏపీలో అదిరించి, బెదిరించి మీడియాను, రిపోర్టర్లను లొంగదీసుకోవాలని కూటమి కుట్రపన్నతోంది. రిపోర్టర్ ఉద్యోగమే.. ఎవరు ఏ అంశాలు మాట్లాడితే వాటిని యథాతథంగా ప్రచురించడం. ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీ విధానం మేరకు మాట్లాడితే దాన్ని ప్రచురించడాన్ని ఏపీ ప్రభుత్వం తప్పుగా చిత్రీకరించడం, తప్పుడు కేసులు నమోదు చేయడం తప్పు. – దాసోజు శ్రావణ్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ
సమంజసం కాదు
ఒక రాజకీయ నాయకుడు పెట్టిన ప్రెస్‌మీట్ వార్తను ప్రచురించినందుకు సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై కేసు పెట్టడం సమంజసం కాదు. అది పత్రికాస్వేచ్ఛను హరించడమే. కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నాం. ఆధారాల్లేని కేసులు చట్టప్రకారమే కాదు.. ప్రజల ముందు కూడా నిలబడవు. – జూలకంటి రంగారెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే