
పత్రికా స్వేచ్ఛను హరించొద్దు
సీఎం చంద్రబాబుకు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఘాటు లేఖ
కేవలం ‘సాక్షి’నే లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టడంపై తీవ్ర ఆందోళన
ఇది అధికార దుర్వినియోగమేనని స్పష్టీకరణ
విలేకరుల సమావేశాన్ని ప్రచురించినందుకు వేధించడం దారుణం
పత్రికల గొంతు నొక్కే చర్యలను తక్షణమే ఆపాలని డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడి, ప్రత్యేకించి ‘సాక్షి’ మీడియా సంస్థను లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులపై జాతీయ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏపీలో ‘సాక్షి’ మీడియా సంస్థతోపాటు జర్నలిస్టుల పట్ల పోలీసుల వ్యవహారశైలిపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (ఈజీఐ) తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది.
ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శుక్రవారం ఎడిటర్స్ గిల్డ్ ఒక ఘాటు లేఖ రాసింది. ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలను తక్షణమే నిలిపివేయాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడు అనంత్ నాథ్, ప్రధాన కార్యదర్శి రూబెన్ బెనర్జీ, కోశాధికారి కె.వి. ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఒక్క పత్రికపైనే ఎందుకు?
ఒక రాజకీయ నాయకుడు నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని ప్రచురించినందుకు ఇతర మీడియా సంస్థలను వదిలిపెట్టి, కేవలం ‘సాక్షి’పై మాత్రమే క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని ఎడిటర్స్ గిల్డ్ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది పక్షపాత వైఖరికి నిదర్శనమని, నేర చట్టాలను ఎంపిక చేసుకుని ప్రయోగించడం పోలీసుల అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని పేర్కొంది. ఇది సాధారణ జర్నలిజంలో భాగమే అయినప్పటికీ, ‘సాక్షి’ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం వెనుక ప్రభుత్వ కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని అభిప్రాయపడింది.
వేధింపులు ఆపండి
పత్రికలను అనవసరమైన, కక్ష సాధింపు ఫిర్యాదులతో వేధించకూడదని ఎడిటర్స్ గిల్డ్ హితవు పలికింది. పోలీసుల ప్రవర్తన నిష్పక్షపాతంగా, వృత్తిపరంగా ఉండాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే సంస్థలను భయపెట్టేలా ఉండకూడదని స్పష్టంచేసింది. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్న జర్నలిస్టులను అణచివేయడానికి, భయపెట్టడానికి క్రిమినల్ చట్టాలను ఆయుధాలుగా వాడటం రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. తక్షణమే ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుని, రాష్ట్రంలో పత్రికలు నిర్భయంగా విధులను నిర్వర్తించే వాతావరణాన్ని కల్పించాలని ఎడిటర్స్ గిల్డ్ డిమాండ్ చేసింది.
సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై అక్రమ కేసులు పత్రికా స్వేచ్చపై దాడే: ఐజేయూ
‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం పత్రికా స్వేచ్ఛపై దాడే అని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయూ) తీవ్రంగా విమర్శించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులతోనే సాక్షి దినపత్రిక, పాత్రికేయులను వేధిస్తోందని ఐజేయూ ప్రధాన కార్యదర్శి బల్విందర్‌సింగ్ జమ్ము శుక్రవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు.
సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి నివాసంలో పోలీసులు ఇటీవల తనిఖీలు చేయడం, ఆయనకు నోటీసులు జారీ చేయడం పత్రికా స్వేచ్ఛపై ముప్పేట దాడి చేయడమేనని ఆయన దుయ్యబట్టారు. సాక్షి ఎడిటర్, పాత్రికేయులను భయపెట్టేందుకే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
పత్రికలను నియంత్రించాలని ఏ ప్రభుత్వం భావించకూడదన్నారు. పత్రికల్లో ప్రచురితమైన వార్తలు, కథనాలపై అభ్యంతరం ఉంటే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని బల్విందర్‌సింగ్ స్పష్టంచేశారు. కానీ, పత్రికలపై అక్రమ కేసులు నమోదు చేయడం పత్రికా స్వేచ్చను హరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి చర్యలను ఐజేయూ ఏమాత్రం ఆమోదించదని స్పష్టంచేశారు.