
నెల్లూరు రూరల్, కలిగిరి పీఎస్‌లలో ఎక్సైజ్ అధికారుల ఫిర్యాదు
ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, రిపోర్టర్లపై అక్రమ కేసులు
కలిగిరి రిపోర్టర్ ఇంట్లో ఎక్సైజ్ సిబ్బంది తనిఖీలు
అనధికారికంగా మద్యం విక్రయిస్తున్నారంటూ హడావుడి
ఏమీ దొరక్కపోయినా ఓవర్ యాక్షన్
భయాందోళనలకు గురైన కుటుంబ సభ్యులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ పత్రికపై కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే ‘సాక్షి’ యాజమాన్యంతోపాటు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, రిపోర్టర్లపై అనేక అక్రమ కేసులు పెట్టించింది. విచారణ పేరుతో పోలీస్ స్టేషన్లకు పిలిచి వేధిస్తోంది. ఇప్పుడు నకిలీ మద్యం వ్యవహారంపై ఎల్లో మీడియా సైతం కథనాలు రాస్తున్నా దాన్ని ఏమీ చేయలేని కూటమి సర్కారు ‘సాక్షి’పై మాత్రం కక్ష సాధిస్తోంది.
నకిలీ మద్యం అంశంపై ఎలా వ్యవహరించాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్న ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ‘సాక్షి’ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ ఎక్సైజ్ అధికారుల ఫిర్యాదుల మేరకు ‘సాక్షి’ యాజమాన్యంతోపాటు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, రిపోర్టర్లపై నెల్లూరు రూరల్, కలిగిరి పోలీసుస్టేషన్లలో రెండు అక్రమ కేసులు నమోదు చేయించింది.
నకిలీ మద్యంపై ‘సాక్షి’ రాసిన కథనాలు తమ శాఖ పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ కలిగిరి ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ షేక్ అబ్దుల్ జలీల్, నెల్లూరు–1 ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ పి.రమేష్ బాబు శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదులు చేశారు. వెంటనే పోలీసు అధికారులు ‘సాక్షి’ పత్రిక యాజమాన్యంతోపాటు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, జిల్లా బ్యూరో ఇన్‌చార్జి, రిపోర్టర్లపై 353(2), 356(3) ఆర్/డబ్ల్యూ 3(5)బీఎన్‌ఎస్ కింద అక్రమ కేసులు నమోదు చేశారు.
రిపోర్టర్ ఇంట్లో ‘ఎక్సైజ్’ సోదాలు
అంతేకాకుండా కలిగిరి ‘సాక్షి’ రిపోర్టర్ ఆర్.రాజగోపాల్‌రెడ్డి ఇంటిపై దాడి చేశారు. శనివారం ఉదయం సుమారు 10.30 గంటలకు ఎక్సైజ్ ఎస్‌ఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి విలేకరి ఇంటికి వెళ్లారు. ‘రాజా అంటే నువ్వేనా? అనధికారికంగా మద్యం విక్రయిస్తున్నారని నీపై ఫిర్యాదులు అందాయి. మీ ఇంట్లో తనిఖీలు చేయాలి’ అని చెప్పారు. ఇంట్లోకి ప్రవేశించి ఇల్లంతా సోదాలు చేశారు. ఎక్కడా మద్యం దొరక్కపోవడంతో వెనుదిరిగారు. ఎక్సైజ్ సిబ్బంది ఓవర్ యాక్షన్‌తో రాజగోపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కాగా.. ఈ కేసులకు సంబంధించి విచారణకు హాజరు కావాలని శనివారం నెల్లూరు ‘సాక్షి’ బ్యూరో ఇన్‌చార్జికి నెల్లూరు రూరల్ పోలీసులు బీఎన్‌ఎస్ 179(1) నోటీసు అందజేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇదే కేసులో ‘సాక్షి’
ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డికి కూడా నోటీసులు అందజేసేందుకు పోలీసులు హైదరాబాద్‌కు వెళ్తున్నట్టు సమాచారం.