సామాన్యులకు వర్తించే చట్టమే మీకూ వర్తిస్తుంది
చట్టం చేశాం కాబట్టి వాటి అమలు నుంచి మినహాయింపు కోరలేరు
ఏం చేసినా కూడా రాజ్యాంగం, చట్టానికి లోబడే చేయాలి
అందుకు అనుగుణంగానే సభా హక్కుల తీర్మానాలు, నిర్ణయాలు ఉండాలి
సభాహక్కుల తీర్మానంపై తుది నిర్ణయం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది
హక్కుల ఉల్లంఘన జరిగిందని నిరూపించాల్సిన బాధ్యత వారిదే
ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది.. పౌరుల హక్కులను ప్రభావితం చేస్తుంటే ఆ నిర్ణయాలపై న్యాయ సమీక్ష చేయవచ్చు
చట్టపరమైన పరిమితులను గుర్తెరిగి నిర్ణయాలు తీసుకోవాలి
‘సాక్షి’ వివరణ, ఇతర ఆధారాలను చూసి సభ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలి.. ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డికి సభా హక్కుల కమిటీ నోటీసుపై హైకోర్టు తీర్పు
సాక్షి, అమరావతి: శాసనసభ హక్కులు రాజ్యాంగంలో నిర్దేశించిన సూత్రాలకు లోబడే ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. సామాన్యులకు ఏ చట్టాలైతే వర్తిస్తాయో, అవే చట్టాలకు అనుగుణంగా సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాలు, సభ నిర్ణయాలు కూడా ఉంటాయని తేల్చిచెప్పింది. సభా హక్కుల పేరుతో ఎలాపడితే అలా వ్యవహరించడానికి వీల్లేదని పేర్కొంది. పార్లమెంట్ లేదా శాసనసభలు, వాటికి సంబంధించిన కమిటీలు కూడా సాధారణ చట్టాలకు లోబడే ఉంటాయంది. అవేమీ చట్టాలకు అతీతం కాదని స్పష్టం చేసింది. చట్టం చేసేవారు కూడా అదే చట్టానికి లోబడి ఉండాలని, అంతే తప్ప ప్రజల కోసం రూపొందించే చట్టాల అమలు నుంచి వారు మినహాయింపు పొందలేరని తెలిపింది.
‘‘ఎంతటి భారీ మెజార్టీ ఉన్నప్పటికీ ప్రతి శాసనసభకు చట్టాలు సమానంగా వర్తిస్తాయి. కాబట్టి సభా హక్కుల తీర్మానంపై తీసుకునే తుది నిర్ణయం న్యాయ సమీక్షకు లోబడే ఉంటుంది. కోర్టు న్యాయ సమీక్ష చేసే సమయంలో సభా హక్కుల ఉల్లంఘన జరిగిందని నిరూపించాల్సిన బాధ్యత హక్కులకు భంగం కలిగిందన్న సభ, వ్యక్తిదే. ఈ విషయాన్ని సీతాసోరెన్ కేసులో సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. శాసనసభ, సభా హక్కుల కమిటీ రాజ్యాంగ సూత్రాలను, చట్టపరమైన పరిమితులను గుర్తెరిగి సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది’’ అని పేర్కొంది.
సభా హక్కుల కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, చీఫ్ రిపోర్టర్ బి.ఫణికుమార్ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఇచ్చింది కేవలం షోకాజ్ నోటీసు మాత్రమేనని, అనంతరం చాలా దశలు ఉంటాయని, అందువల్ల ఈ వ్యాజ్యాలు అపరిపక్వమైనవి వ్యాఖ్యానించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ మంగళవారం తీర్పు వెలువరించారు.
‘సాక్షి’పై కక్షసాధింపు చర్యలు... షోకాజ్ నోటీసు జారీ
ఎమ్మెల్యేలకు రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించాలని శాసనసభ వర్గాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయించాయి. ఎమ్మెల్యేలు, అతిథులకు హోటళ్లు, భోజనాలు, బహుమతులు తదితరాల కోసం భారీగా ఖర్చు చేశారు. అయితే, లోక్‌సభ స్పీకర్ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో ఆ ఖర్చంతా వృథా అయింది. దీనిపై ‘సాక్షి’ ఫిబ్రవరి 22న ‘రూ.కోట్లు ఖర్చు... శిక్షణ తుస్సు’ శీర్షికన కథనం ప్రచురించింది. కంగుతిన్న అధికార పార్టీ నేతలు ‘సాక్షి’పై కక్షసాధింపు చర్యలు చేపట్టారు. పత్రిక కథనం సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని, దానిని తాను సభలో ప్రస్తావించేందుకు అనుమతించాలని టీడీపీ ఎమ్మెల్యే జయసూర్య ఫిబ్రవరి 25న అసెంబ్లీ స్పీకర్‌ను కోరుతూ నోటీసు ఇచ్చారు. స్పీకర్ ఈ వ్యవహారాన్ని సభా హక్కుల కమిటీకి నివేదించారు. దాని ఆదేశాల మేరకు ‘సాక్షి’కి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ షోకాజ్ నోటీసులు జారీచేశారు.
పాలనాపరమైన అంశాలపైనే కథనం
ఎమ్మెల్యే ఇచ్చిన నోటీసుతో పాటు, సెక్రటరీ జనరల్ ఇచ్చిన షోకాజ్ నోటీసును సవాల్ చేస్తూ ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డి, చీఫ్ రిపోర్టర్ ఫణికుమార్ జూన్‌లో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్, వి.మహేశ్వర్‌రెడ్డి, అనూప్ కౌషిక్ వాదిస్తూ... సభలో జరిగిన విషయాలపై ‘సాక్షి’ కథనం రాయలేదని, పాలనాపరమైన అంశంపైనే ప్రచురించిందని, దాని కారణంగా ఎవరి హక్కులకూ భంగం వాటిల్లలేదని, ఆ కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందకు రాదని వివరించారు.
శాసన వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పిటిషనర్లకు ఇచ్చింది కేవలం షోకాజ్ నోటీసు మాత్రమేనన్నారు. వారి వివరణ తీసుకున్న తరువాత పలు దశలు ఉంటాయని, వివరణతో సభా హక్కుల కమిటీ సంతృప్తి చెందితే తదుపరి చర్యల ఉపసంహరణకు సిఫారసు చేయవచ్చన్నారు. ‘సాక్షి’ కథనం «ధిక్కారం కిందకే వస్తుందని కమిటీ భావించినా అంతిమంగా నిర్ణయం శాసన సభనే తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. షోకాజ్ నోటీసుల దశలో కోర్టుల జోక్యం తగదని, ఈ వ్యాజ్యాలను తోసిపుచ్చాలని కోరారు.
పౌరులను కాపాడే రక్షణ కవచమే రాజ్యాంగం
‘‘పౌరుల హక్కులను ప్రభావితం చేసేలా రాజ్యాంగ వ్యవస్థలు ఏకపక్ష, అన్యాయ నిర్ణయాలు తీసుకుంటే, వాటి నుంచి కాపాడే రక్షణ కవచమే రాజ్యాంగం. అధికరణ 194 కింద... రాష్ట్ర అసెంబ్లీలు తీసుకునే నిర్ణయాలు పౌరుల హక్కులను ప్రభావితం చేస్తుంటే, అవి కచ్చితంగా న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయి. సభా హక్కుల ఉల్లంఘనకు సంబంధించి జారీచేసే షోకాజ్ నోటీసులు పలు దశల్లో చట్టపరమైన పరిశీలనకు లోబడి ఉంటాయి.
సభా హక్కుల కమిటీ మొదట పిటిషనర్ల వివరణను పరిగణనలోకి తీసుకుని, తదుపరి చర్యలను ఉపసంహరించాలని శాసనసభకు సిఫారసు చేయవచ్చు. అలాకాకుండా పిటిషనర్ల వంటి పౌరులకు వ్యతిరేకంగా కమిటీ సిఫారసు చేసినప్పటికీ, శాసనసభ పిటిషనర్లు సమర్పించిన వివరణను, ఆధారాలను పరిగణనలోకి తీసుకుని స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది.


