సాక్షి, తాడేపల్లి: పవన్ కల్యాణ్ తన పార్టీ కార్యకర్తలను టీడీపీకి బానిసలుగా మార్చారంటూ వైఎస్సార్‌సీపీ నేత వరికూటి అశోక్‌బాబు అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ చర్యలను సొంత సామాజిక వర్గమే అంగీకరించటం లేదని.. డైవర్షన్ రాజకీయాల కోసమే ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అప్రజాస్వామికమన్నారు.
‘‘తనను ఎవరూ పట్టించుకోవటం లేదనే అక్కసుతో ఏదేదో మాట్లాడుతున్నారు. తన గ్రాఫ్ పడిపోయిందని చంద్రబాబే స్వయంగా ఒప్పుకున్నారు. దీన్ని డైవర్ట్ చేసేందుకు పవన్ కష్ట పడుతున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదు?. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక జరిగిన అక్రమాలపై విచారణ చేయిస్తానని జగన్ అంటే పవన్‌కు కోపం ఎందుకు?’’ అంటూ అశోక్‌బాబు నిలదీశారు.
‘‘ప్రభుత్వ స్కూళ్లను కూడా చంద్రబాబు ప్రైవేట్ పరం చేయబోతున్నారు. దీనిపై కూడా పవన్ ఎందుకు మాట్లాడటం లేదు?. అదేమంటే దాడులు చేస్తామంటున్నారు. చెప్పులు చూపిస్తూ పవన్ పచ్చి బూతులు మాట్లాడారు. పోలీసు వ్యవస్థను తమ దుర్మార్గాలకు వాడుకుంటున్నారు. జగన్ హయాంలో దౌర్జన్యం, దుర్మార్గాలు జరగలేదు. కూటమి పాలనలోనే సోషల్ మీడియా యాక్టివిస్టులను సైతం అక్రమంగా అరెస్టు చేసి జైలు పాల్జేశారు.
..సినిమా పోస్టర్లు ప్రదర్శించినా జైల్లో పెట్టారు. దుర్మార్గపు పాలన అంటే ఇదీ. పవన్ చర్యలను చూసి సొంత సామాజిక వర్గమే మదన పడుతోంది. టీడీపీ వారికి బానిసత్వం చేయించటాన్ని వారు సహించలేక పోతున్నారు. ఇకనైనా పవన్ కళ్యాణ్ పద్దతిగా మాట్లాడితే మంచిది’’ అని అశోక్‌బాబు హితవు పలికారు.


