సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా క్రైమ్‌రేట్ పెరిగిపోయిందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం(డిసెంబర్ 20) ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహిళల భద్రతను కూటమి ప్రభుత్వం గాలి గాలికొదిలేసిందన్నారు. సీఎం చంద్రబాబు నివాసం ఉన్న పరిసరాల్లోనే మహిళలపై నేరాలు 11 శాతం పెరిగాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
హోంమంత్రి అనితా నివాసం ఉంటున్న విజయనగరం జిల్లాలో గతంతో పోలిస్తే 19 శాతం నేరాలు మహిళలపై పెరిగాయన్నారు. ఏదైనా ప్రమాదం జరిగి పోలీసులకు ఫోన్ చేస్తే 26 నిమిషాల వరకూ ప్రమాద స్థలానికి చేరుకోవడం లేదని.. అదే వైఎస్ జగన్ హయాంలో రెండు మూడు నిమిషాల్లో మహిళల దగ్గరికి పోలీసులు చేరుకునేవారని తెలిపారు. మహిళలపై హత్యలు, లైంగిక దాడులు అధికంగా జరిగే ప్రాంతాలు అనే అంశంలో చంద్రబాబుకు ప్రపంచంలోని నెంబర్ 1 అవార్డు ఇవ్వాలని కళ్యాణి తెలిపారు.
రాష్ట్రంలో యువత మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారని తెలిపారు. అధికారిక లెక్కల ప్రకారం 16 జిల్లాల్లో గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలు వినియోగం విపరీతంగా పెరిగిందన్నారు. మెుత్తంగా గతంతో పోలిస్తే ప్రస్తుతం క్రైమ్‌రేట్ 18శాతం పెరిగిందని రాష్ట్రంలో నేరాలు పెరిగాయి అనే దానికి దానికి అసలైన నిదర్శనం హోంమంత్రి అమిత్ షాకు, చంద్రబాబు రాసిన లేఖనే అని వరుదు కళ్యాణి పేర్కొన్నారు.


