సాక్షి, తాడేపల్లి: తన ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజలకు ఎంత మేలు చేయాలో అంతా చేశారని.. మళ్ళీ అధికారంలోకి రాగానే చేయాల్సిన కార్యక్రమాలకు కూడా ప్లానింగ్ చేసుకున్నారని వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం తాడేపల్లి కుంచనపల్లిలో జరిగిన వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న సజ్జల.. భారీ కేక్ కట్ చేసి మీడియాతో మాట్లాడారు.
‘‘అధికారంలో ఉన్నా లేకపోయినా జనం జగన్ వెంటే. ప్రజలకు మేలు చేసేది జగన్ ఒక్కడే. కోట్లాది మంది జగన్‌పై ఆ నమ్మకం పెట్టుకున్నారు. అందుకే తన ఐదేళ్ల పాలనలో అందరికీ మేలు చేశారు. ఎంతవరకు మేలు చేయాలో అంతవరకు చేశారు. రాజకీయాల్లో ఐదేళ్లు అనేది ఎక్కువేం కాదు.
.. ఏదో ఆశించి జగన్ సహాయం చేయరు. తన వలన ఎంత మేరకు మేలు చేయాలా అనే నిత్యం ఆలోచిస్తూ ఉంటారు. ఓదార్పు యాత్ర సమయంలో కూడా ఆయన ఎంతో సహాయం చేశారు. తన తండ్రి కోసం ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సహాయం చేయాలనే లక్ష్యంతో ఆయన యాత్ర చేశారు.
.. చాలా గొప్పగా సహాయం చేసినా ఆ విషయం బయటకు చెప్పుకోలేదు. అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి జగన్. కరోనా సమయంలో కూడా క్వారంటైన్ సెంటర్ లో మంచి భోజనం పెట్టాలనీ, మంచి వైద్యం చేయించాలని తపన పడ్డారు. ప్రతి ఒక్కరినీ జగన్ తన కుటుంబ సభ్యులుగానే భావిస్తారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి కాలనీలే సృష్టించారు. 17 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, పోర్టులు, హార్బర్ లు ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టినా పబ్లిసిటీ చేసుకోలేదు..
.. చంద్రబాబు 18 నెలల్లోనే రూ.2.70 లక్షల కోట్లు అప్పు చేశారు. కానీ జనాలకు చంద్రబాబు చేసిన మేలు ఏదీ లేదు. జగన్ మాత్రం తన ఐదేళ్ల పాలనలోనే ఆర్ధికవేత్తలు సైతం ఆశ్చర్యపోయేలా పాలన చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేయాలనేది కూడా ఆయన ఈపాటికే ప్లానింగ్ వేసుకున్నారు’’ అని సజ్జల అన్నారు.


