
అరాచక పాలన, ఏపీ ప్రభుత్వ దమనకాండకు ఇది నిదర్శనం
అక్రమ కేసులతో జర్నలిస్టుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు
సాక్షి ప్రధాన కార్యాలయంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన
తప్పుడు కేసులను తక్షణమే ఎత్తివేయాలని జర్నలిస్టుల డిమాండ్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘సమాధానం ఇచ్చినా.. పదేపదే నోటీసులు ఇవ్వడం అంటే మీడియా గొంతు నొక్కడమే’అని సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి విమర్శించారు. ఏపీ ప్రభుత్వ అరాచకపాలన, దమనకాండకు ఇదే నిదర్శనమన్నారు. నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించిన సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను నిరసిస్తూ గురువారం రాత్రి హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో జర్నలిస్టులు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ‘మీడియాపై కేసులా? సిగ్గు..సిగ్గు, రెడ్‌బుక్ పాలన మాకొద్దు.. చంద్రబాబు నిరంకుశ విధానం నశించాలి’అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఎడిటర్ ధనంజయరెడ్డి మాట్లాడుతూ పత్రికాస్వేచ్ఛపై దాడి.. రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనేనని స్పష్టం చేశారు. అక్రమ కేసులు, పదే పదే నోటీసుల జారీతో జర్నలిస్టుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన హెచ్చరించారు. ఐదు రోజుల నుంచి కేవలం ఒక్క కేసులోనే నాలుగైదు నోటీసులు జారీ చేయడం ప్రజాస్వామ్య దేశాల్లో ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యక్తి∙స్వేచ్ఛ అన్నా, పత్రికా స్వేచ్ఛ అన్నా, జర్నలిస్టుల హక్కులన్నా గౌరవం లేదని విమర్శించారు.

16 నెలలుగా కూటమి ప్రభుత్వం సాక్షి మీడియాపై తీవ్రమైన దమనకాండను కొనసాగిస్తోందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆయన చెప్పారు. నకిలీ మద్యంపై రాసిన కథనాలకు ఆధారాలు చూపాలంటూ, సమాచారం ఇచ్చిన సోర్స్ సహా రాసిన విలేకరుల పేర్లు చెప్పాలని తీసుకొస్తున్న ఒత్తిళ్లకు సాక్షి మీడియా భయపడబోదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ కుట్రలను న్యాయస్థానాల ద్వారా తిప్పి కొట్టనున్నట్టు తెలిపారు. ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న దమనకాండను ఎదుర్కొనేందుకు ప్రజా సంఘాలు, జర్నలిస్టులంతా ఏకం కావాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. సాక్షి మీడియాపై పెట్టిన తప్పుడు కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
