
బ్రిటిష్ పాలనను గుర్తు చేస్తున్న కూటమి సర్కారు
నచ్చని పత్రికలను అణగదొక్కడం చంద్రబాబుతోనే మొదలైంది
‘సామ్నా’ రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు
శ్రీకాకుళం: బ్రిటిష్ పాలనను కూటమి ప్రభుత్వం గుర్తుకు తెస్తోందని ‘సామ్నా’ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్టు నల్లి ధర్మారావు అన్నారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి నివాసంలో పోలీసులు సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీలు చేయడాన్ని ఆయన ఖండించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా పోలీసు బలగంతో సోదాలు చేయించడం కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానానికి పరాకాష్టగా అభివరి్ణంచారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఏమన్నారంటే...
ఇలాంటి ఘటనలు లేవు
పత్రికా సంపాదకులపై దాడులకు శ్రీకారం చుట్టింది బ్రిటిష్ ప్రభుత్వంలోనే. మన దేశంలో ఒక సంపాదకీయం రాసినందుకు గాడిచర్ల హరిసర్వోత్తమరావుపై రాజద్రోహం నేరాన్ని ఆపాదించి జైలు శిక్ష విధించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు మళ్లీ జరగలేదు. 1975లో ఎమర్జెన్సీ సమయంలో ఆ నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ నిర్బంధాన్ని అమలు చేశారు. అయితే పత్రికల కార్యాలయాలు, సంపాదకుల ఇళ్లపై మాత్రం దాడులు జరిగిన దాఖలాలు లేవు.
నచ్చకపోతే అణగదొక్కుతారా?
నచ్చిన పత్రికలను ప్రోత్సహించడం, నచ్చని పత్రికలను అణగదొక్కడం చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే మొదలైంది. పత్రికా రంగాన్ని గుప్పెట్లో ఉంచుకోవడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోగలమనే భావన సరైనది కాదని వైఎస్ రాజశేఖరరెడ్డి ఘన విజయంతో రుజువైంది. చంద్రబాబు పాలనలో భావప్రకటన స్వేచ్ఛపై మునుపెన్నడూ లేని విధంగా అణచివేతకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అధికార బలంతో వేధింపులు
దేశానికి ఒకటే పవిత్ర గ్రంథం. అది రాజ్యాంగం. వ్యవస్థలన్నీ దీనికి లోబడే పనిచేయాలి. కూటమి ప్రభుత్వం అలా పనిచేయడం లేదని ఏపీ హైకోర్టు అనేక కేసుల విచారణ సమయంలో మందలిస్తూ కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అయినా కూటమి ప్రభుత్వం వాటిని గౌరవిస్తున్నట్టు కనిపించడం లేదు. మీడియాలో వచ్చిన వార్త, కథనంపై లీగల్‌గా చర్యలు తీసుకోవడానికి చట్టం కొన్ని అవకాశాలు కల్పించింది. వాటిని విస్మరించి నేరుగా అధికార బలంతో క్రిమినల్ కేసులు బనాయించి, వేధించడం ఈ ప్రభుత్వమే ప్రారంభించింది. ఒక ఎడిటర్ ఇంట్లో ముందస్తు సమాచారం ఇవ్వకుండా సోదాలు చేయించడం కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానానికి పరాకాష్ట.
ఏముంటాయి అక్షరాలు తప్ప
ఎడిటర్ ఇంట్లో ఏముంటాయి. అక్షరాలే తప్ప ఆయుధాలు కాదు కదా. అక్షరాలను కూడా ఆయుధాలుగా భావించిన ఒకనాటి బ్రిటిష్ వైఖరి బయట పెట్టుకోవడం తప్ప సాధించిందేమీ లేదు. అణచివేతలతో చరిత్రహీనులుగా మిగిలిపోవడం తప్ప ఏమీ చేయలేరు. మన ప్రజాస్వామ్యం గొప్పది. ప్రజలు సరైన సమయంలో తమ చైతన్యాన్ని ప్రకటిస్తారు. ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే, సామ్నా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు, ఫొటో జర్నలిస్టు సంఘాలు కలిసి ‘సాక్షి’ పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ ధోరణిలకు వ్యతిరేకంగా గళం వినిపిస్తూనే ఉంటాయి.