
విజయవాడలోని కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్న జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు
రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కిన జర్నలిస్టులు
‘సాక్షి’పై కక్ష సాధింపు తగదని నినాదాలు
అక్రమ కేసులు బనాయించడంపై ప్లకార్డులతో ర్యాలీలు.. భావ ప్రకటన స్వేచ్ఛను హరించొద్దని హితవు
ఎడిటర్, జర్నలిస్టులపై పెట్టిన కేసులు ఎత్తేయాలని డిమాండ్
జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు
మద్దతు పలికిన ప్రజా సంఘాల నేతలు
సాక్షి నెట్‌వర్క్: ప్రభుత్వ వైఫల్యాలు, నకిలీ మద్యం రాకెట్‌పై వరుస కథనాలు రాస్తుండటాన్ని తట్టుకోలేక సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి.. వేధించడాన్ని నిరసిస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు కదం తొక్కారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇది ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడే అని దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు.
వాస్తవాలు రాస్తున్న ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలంటూ ప్ల కార్డులు పట్టుకుని ర్యాలీలు నిర్వహించారు. భావ ప్రకటన హక్కుకు విఘాతం కల్పించవద్దని, ప్రజలంతా రాష్ట్రంలో ఏం జరుగుతుందో గమనిస్తున్నారని.. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.

సాక్షి హైదరాబాద్ కార్యాలయంలో ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిని విచారణ పేరుతో రోజుల తరబడి వేధించడం ఎంత మాత్రం భావ్యం కాదని నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యానికి సంకెళ్లా.. సాక్షి ఎడిటర్‌పై కేసు సిగ్గు సిగ్గు.. నియంత ప్రభుత్వం సిగ్గు సిగ్గు.. జర్నలిస్టుల గొంతునొక్కే దౌర్జన్య పాలన నశించాలి.. అంటూ నినాదాలు చేశారు. జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశారు.

భావ ప్రకటన స్వేచ్ఛకు తూట్లు
రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసులు భావ ప్రకటన స్వేచ్ఛకు తూట్లు పొడుస్తున్నారు. వారి అక్రమాలు వెలుగులోకి తెస్తుంటే సహంచలేని స్థితిలో వ్యవహరిస్తున్నారు. ఇటీవల సాక్షి ఎడిటర్ ఇంటికి వెళ్లి తనిఖీలు చేసిన పోలీసులు, ఇప్పుడు నకిలీ మద్యం వ్యవహారంలో హైదరాబాద్ కార్యాలయానికి వెళ్లి వేధించడం చాలా దారుణం. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా వార్తలో తప్పు ఉంటే ఖండన ఇవ్వాలి. లేదంటే లీగల్ నోటీసు ఇవ్వాలి. కానీ, పోలీసు కేసులు నమోదు చేయడం ఎక్కడా లేదు. ఇది సరైన విధానం కాదు.– సీహెచ్ రమణారెడ్డి, సామ్నా రాష్ట్ర
ప్రధాన కార్యదర్శిబెదిరింపు ధోరణి మానుకోవాలి
జర్నలిస్టులపై కేసులు పెట్టి, కార్యాలయాలకు పోలీసులు వెళ్లి బెదిరింపులకు పాల్పడే ధోరణి మానుకోవాలి. ఇది రాజ్యాంగానికి విరుద్ధం. రాజ్యాంగం మనకు కల్పించిన పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తోంది. భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం.
రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ బట్టబయలైన నేపథ్యంలో వార్తలు రాస్తే కేసులు పెట్టడం దుర్మార్గ చర్య. సమాజం మేలు కోసమే జర్నలిస్టులు పని చేస్తుంటారు. అలాంటి జర్నలిస్టులపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. – ఎం.రామకృష్ణ, ఇప్టూ రాష్ట్ర కార్యదర్శి
‘సాక్షి’ని వేధించేందుకే తప్పుడు కేసులు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సాక్షిని లక్ష్యంగా చేసుకుని కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తప్పుడు కేసులు నమోదు చేస్తోంది. ‘సాక్షి’ మీడియా గ్రూప్ మీద ఒత్తిడి పెంచేందుకు, వాస్తవాలు రాయకుండా, ప్రసారం చేయకుండా కట్టడి చేసేందుకు కేసులు బనాయించడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు నకిలీ మద్యం అంశంపై ప్రచురితమైన కథనాలకు సంబంధించి సోర్స్ వెల్లడించాలని ఒత్తిడి చేయడం ఉన్నత న్యాయస్థానాల తీర్పులకు వ్యతిరేకమే తప్ప మరొకటి కాదు. – వర్దెళ్లి మురళి, సీనియర్ సంపాదకులు
రాజకీయ కక్షసాధింపు చర్యలు ఆపాలి
ఏపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సాక్షి మీడియాపైన రాజకీయ కక్షసాధింపునకు పాల్పడుతోంది. ఇది పత్రికా స్వేచ్ఛపైన జరుగుతున్న దాడి. సమాజంలో జరుగుతున్న విషయాలను మీడియా నిర్భయంగా ప్రజలకు చేరవేస్తుంది. ప్రసారం చేసిన వాటిపై అభ్యంతరముంటే ప్రభుత్వం వివరణ ఇవ్వడమో, ఖండించడమో చేయాలి. అలాకాకుండా పోలీసులను ఉసిగొల్పి నోటీసులు జారీ చేస్తూ మానసికంగా ఇబ్బందిపెట్టే ప్రయత్నాలు సరికావు.
ఇలాంటి రాజకీయ కక్షసాధింపు చర్యలను ఏపీ ప్రభుత్వం వెంటనే ఆపేయాలి. కొంతకాలంగా ప్రభుత్వాలు మీడియాను నియంత్రించాలనే ఆలోచనలతో వ్యవహరిస్తున్నాయి. ప్రతిపక్షాన్ని నిలువరింపలేక వారికి అండగా ఉన్న మీడియాను ఈ విధంగా ఇబ్బందిపెట్టే ప్రయత్నాలు సరికాదు. మీడియా ఎంత వ్యతిరేక వార్తలు రాస్తే ప్రభుత్వానికి అంత మంచిది. తప్పులు, పొరపాట్లను సరిచేసుకునే అవకాశం ఉంటుంది.. – ప్రొఫెసర్ హరగోపాల్, పౌరహక్కుల నేత
పత్రికా స్వేచ్ఛపైన దాడి పరాకాష్టకు చేరింది
సాక్షి మీడియాపైన ఏపీ ప్రభుత్వం చేస్తోన్న దాడి పరాకాష్టకు చేరింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాక్షి మీడియాపైన పదేపదే ఉద్దేశపూర్వకంగా పోలీసులు ఏదో ఒక అంశాన్ని ఆసరా చేసుకుని దాడులు చేస్తున్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఏపీ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టినప్పటికీ... వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా ఈ విధంగా కక్షసాధింపులకు పాల్పడడం ఆక్షేపణీయం.
ఏపీ ప్రభుత్వం, పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అత్యంత కీలకమైంది. అలాంటి మీడియా హక్కులకు విఘాతం కలిగించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. – అల్లం నారాయణ, సీనియర్ సంపాదకులు, తెలంగాణ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్