
జనం పక్షాన నిలిచిన కలంపై ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కత్తిగట్టింది. గత పదిహేను నెలల పాలనలో వరస కుంభకోణాలూ, వంచనలూ తప్ప చేసిందేమీ లేదని బట్టబయలవుతున్నకొద్దీ దిక్కుతోచక ‘సాక్షి’పైనా, ఎడిటర్ ఆర్. ధనంజయరెడ్డిపైనా అక్రమ కేసులతో రెచ్చిపోతోంది. రాజ్యాంగానికి లోబడి ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాల్సిన బాధ్యతను పక్కనబెట్టి రాష్ట్రాన్ని పోలీసు రాజ్యంగా మారుస్తోంది. పత్రికలపై కక్షగట్టడంలో ప్రభుత్వ నైచ్యం హద్దులు దాటింది. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వస్తే వెనువెంటనే కేసులు రిజిస్టర్ చేయాలంటూ కూటమి సర్కారు మౌఖిక ఆదేశాలిచ్చిందంటున్నారు.
అందులో భాగంగానే సోమవారం ఏపీ పోలీసులు హైదరాబాద్‌లోని ‘సాక్షి’ కార్యాలయానికొచ్చి ఎడిటర్ ధనంజయరెడ్డికి నోటీసులు అందజేశారు. గత మే నెలలోనే కూటమి ప్రభుత్వం ఈ అరాచకానికి నాంది పలికింది. విజయవాడలో ధనంజయరెడ్డి ఇంట్లోకి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తప్పుడు సాకులతో అక్రమంగా చొరబడి,‘మద్యం కేసు నిందితులు మీ ఇంట్లో ఉన్నారేమో తెలుసుకోవటానికి వచ్చామంటూ మూడు గంటలపాటు హడావుడి సృష్టించింది. తలుపులు మూసి, సోదాలు చేసి, దౌర్జన్యంతో ఫోన్ లాక్కొనే ప్రయత్నం చేసింది.
ఈ ప్రభుత్వం వాస్తవాలను ఏ మాత్రం సహించే స్థితిలో లేదు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆఖరుకు వార్తలను, వ్యాఖ్యలను కవర్ చేసినా కూడా ఎడిటర్, రిపోర్టర్లపై కేసులు పెడుతోంది. విద్య, వైద్యం, వ్యవసాయం సహా అన్ని రంగాల్లోని వైఫల్యాలపై ప్రశ్నిస్తున్నందుకే ఇలా కక్షగట్టింది. అసలే స్కాంలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎక్కడిదాకో ఎందుకు... 2015 మొదలుకొని 2019 వరకూ అధికారం వెలగబెట్టినప్పుడు ఏటా రూ. 1,300 కోట్ల చొప్పున అయిదేళ్లలో ఖజానాకు వేల కోట్ల రూపాయల మేర గండికొట్టిన ఘనుడాయన.
ఇది ఎవరో చేసిన ఆరోపణ కాదు. కాగ్ ఆధ్వర్యంలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ నిశితంగా గమనించి బట్ట బయలు చేసిన చేదు నిజం. దీన్నంతటిని వెలుగులోకి తెస్తున్నందునే ‘సాక్షి’పై సర్కారు వారి అక్కసు. ఇదొక్కటే కాదు... అక్రమ మార్గాల్లో అధికారాన్ని చెరబట్టింది మొదలు కూటమి పెద్దలు చేయని అరాచకం లేదు. ఇసుక దోపిడీ, భూకబ్జాలు, పేరూ ఊరూ లేని సంస్థలకు విలువైన భూముల్ని కారు చౌకగా కట్టబెట్టడాలూ, మహిళలపై అఘాయిత్యాలూ.... ఒకటేమిటి, కూటమి సర్కారు చేస్తున్న సమస్త అరాచకాలనూ ‘సాక్షి’ బయట పెడుతోంది. అందుకే తప్పుడు కేసులు బనాయించి నోరుమూయించాలని చూస్తోంది.
మనది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశం. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ నిత్యం రాజకీయ చైతన్యంతో తొణికిసలాడే ప్రాంతం. ఇలాంటిచోట ఎంతకైనా బరితెగించి పాలిద్దామని, నిజాలు బయటపెడుతున్నవారి నోరు నొక్కుదామని చూడటం తెలివితక్కువతనం. దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా మీడియా పైనా, ఎడిటర్లపైనా ఈ స్థాయిలో కక్ష తీర్చుకున్న దాఖలాలు లేవు. గతంలో ‘సాక్షి’ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ మూకలు దాడులు చేశాయి.
ఈమధ్య పోలీసులే ఆ బాధ్యత తీసుకుంటున్నారు. ఇటీవల విజయవాడలోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలోకి అర్ధరాత్రి చొరబడి అరాచకం సృష్టించారు. ఇప్పుడిక వార్త ప్రచురించటాన్ని కూడా నేరంగా పరిగణించి నోటీసులు జారీ చేయటం, అక్రమ కేసులు బనాయించటం మొదలైందన్నమాట! ఒక పార్టీ నాయకుడు నిర్వహించిన మీడియా సమావేశం వివరాలు ప్రచురించటం నేరమెలా అవుతుందో సర్కారు చెప్పగలదా?
మన రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్లో పత్రికా స్వేచ్ఛ అంతర్భాగం. పత్రికా స్వేచ్ఛ అంటే సమాచారాన్ని తెలుసుకోవటానికి ప్రజలకుండే హక్కు.
దీన్ని కాలరాయాలని చూస్తే ప్రజాస్వామ్య శక్తులు సహించవు. ‘సాక్షి’ గొంతు నొక్కితే తమ అరాచకాలను ప్రశ్నించేవారుండరని కూటమి ప్రభుత్వం కలలుగంటోంది.
అందుకే నోటీసులతో, తప్పుడు కేసులతో బెదిరిస్తోంది. పాలకుల అక్రమాలనూ, అన్యాయాలనూ, అరాచకాలనూ బట్టబయలు చేయటం, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయటం ‘సాక్షి’ కర్తవ్యం. పాలకుల చవకబారు ఎత్తుగడలకు భయపడి దీన్నుంచి వైదొలగే ప్రశ్నే లేదు.