నకిలీ మద్యం దందా వత్తాసుకే.. ‘సాక్షి’కి వేధింపులు | Chandrababu Govt Conspiracies Police raids at Sakshi office for fifth day | Sakshi
Sakshi News home page

నకిలీ మద్యం దందా వత్తాసుకే.. ‘సాక్షి’కి వేధింపులు

Oct 17 2025 5:37 AM | Updated on Oct 17 2025 7:15 AM

Chandrababu Govt Conspiracies Police raids at Sakshi office for fifth day

గురువారం హైదరాబాద్‌లోని సాక్షి కార్యాలయంలో ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డిని ప్రశ్నిస్తున్న పోలీసులు

వరుసగా ఐదోరోజు ‘సాక్షి’ కార్యాలయాల్లో పోలీసుల హల్‌చల్‌

వరుసగా మూడో రోజు ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డికి నోటీసులు.. 

12 గంటల వ్యవధిలోనే కొనసాగిన కక్షసాధింపు 

పదేపదే విచారణ పేరుతో వేధింపులు 

ఎప్పటికప్పుడు సహకరిస్తున్నా కొనసాగుతున్న కూటమి సర్కార్‌ దాష్టీకం

నిబంధనలకు విరుద్ధంగా బాధితులు, సోర్స్‌ వివరాలు వెల్లడించాలని ఒత్తిడి 

నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించకుండా నిరోధించే కుట్ర.. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే పోలీసుల జులుం 

కూటమి సర్కారు తీరుపై మండిపడుతున్న ప్రజాస్వామికవాదులు, పాత్రికేయ సమాజం  

సాక్షి, అమరావతి: ప్రజల గొంతుకగా నిలుస్తున్న ‘సాక్షి’ మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం మరింతగా కక్ష సాధింపు చర్యలకు బరితెగిస్తోంది. రాజ్యాంగ హక్కులు, పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ కుట్రలకు పదును పెడుతోంది. వరుసగా ఐదో రోజు ‘సాక్షి’ కార్యాలయాల్లో పోలీసులు వేధింపులకు దిగడం విభ్రాంతి కలిగిస్తోంది. వరుసగా మూడో రోజు ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డికి నోటీసుల పేరుతో వేధింపులు కొనసాగిస్తున్నారు. 

నోటీసులు తీసుకుంటున్నా.. పోలీసులకు ఎప్పటికప్పుడు సహకరిస్తున్నా వేధింపులు మాత్రం ఆగడం లేదు. తద్వారా కూటమి సర్కారు  ప్రజావ్యతిరేక విధానాలను వెలుగులోకి తేకుండా, నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించకుండా ‘సాక్షి’ పత్రికను నిరోధించాలన్నదే ప్రభుత్వ పెద్దల పన్నాగమన్నది స్పష్టమవుతోంది. అందుకోసం ఏకంగా సుప్రీంకోర్టు తీర్పులను కాలరాస్తూ పోలీసు జులుంతో విరుచుకుపడుతుండటం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.  

నకిలీ మద్యం దందా వత్తాసుకే...  
ఏపీలో వెలుగు చూసిన నకిలీ మద్యం మాఫియా దందా యావత్‌ దేశాన్ని కుదిపివేసింది. అనకాపల్లి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, అన్నమయ్య జిల్లాల్లో బయటపడిన నకిలీ మద్యం రాకెట్‌ సంచలనం రేకెత్తించింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మద్యం తాగిన కొందరు సందేహాస్పద రీతిలో మరణించడం కలకలం రేపింది. బాధ్యతాయుతమైన మీడియా సంస్థగా ప్రజలను చైతన్యం చేస్తూ సాక్షి దినపత్రిక ఈ నకిలీ మద్యం వ్యవహారంలో వాస్తవాలను ప్రచురించింది. నకిలీ మద్యం బారిన పడకుండా అమాయకులను కాపాడాలన్న సదుద్దేశంతో వ్యవహరించింది. 

మరోవైపు నకిలీ మద్యం దందాపై కఠిన చర్యలు తీసుకునేలా అధికార యంత్రాంగానికి ప్రేరణ కల్పించాలని భావించింది. కానీ ‘సాక్షి’  ప్రచురించిన వాస్తవాలు ప్రభుత్వ పెద్దలకు కంటగింపుగా మారాయి. తమ దోపిడీ వ్యవహారం బట్టబయలు కావడంతో వారు బెంబేలెత్తారు. దాంతో నకిలీ మద్యం దందాపై కథనాలు ప్రచురించకుండా ‘సాక్షి’ మీడియాను నిరోధించాలని ఎత్తుగడ వేశారు. అందుకే ‘సాక్షి’పై అక్రమ కేసులు నమోదు చేశారు. అనంతరం పోలీసులు నోటీసులు, విచారణ పేరుతో వేధింపులు తీవ్రతరం చేశారు.  

బుధవారం వెళ్లిపోయి.. గురువారం మళ్లీ వచ్చి 
సాక్షి దినపత్రిక ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డి, ఎస్సీఎస్‌ఆర్‌ నెల్లూరు బ్యూరో ఇన్‌చార్జ్‌ మస్తాన్‌రెడ్డిలకు పోలీసులు నోటీసుల మీద నోటీసులు ఇచ్చి వేధిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 11 నుంచి వరుసగా విజయవాడ ఆటోనగర్, నెల్లూరులలోని సాక్షి కార్యాలయాలతోపాటు హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయాలకు పోలీసులు చేరుకుని రాద్ధాంతం చేస్తూనే ఉన్నారు. నోటీసులు, విచారణ పేరుతో పదే పదే వేధిస్తున్నారు. వార్తకు సంబంధించిన సోర్స్, బాధితుల వివరాలు వెల్లడించాలని అడగటం, పత్రికలో ఉద్యోగుల వివరాలు వెల్లడించాలనడం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధం. 

కానీ ప్రభుత్వ పెద్దల కుట్రకు వత్తాసు పలకడమే ఏకైక కర్తవ్యంగా వ్యవహరిస్తున్న  పోలీసులు దీన్ని లెక్క చేయడం లేదు. ఈ క్రమంలో బుధవారం హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డికి నోటీసులంటూ నెల్లూరు రూరల్, కలిగిరి పోలీసులు దాదాపు 10 గంటలకుపైగా వేధించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సాక్షి ప్రధాన కార్యాలయంలో పోలీసులు హల్‌చల్‌ చేశారు. 

పత్రికలో ప్రచురించిన కథనాలకు సంబంధించి ఆధారాలు (సోర్స్‌) చూపించాలంటూ ఒత్తిడి చేశారు. ఓపికగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ పూర్తి సహకారం అందించినప్పటికీ మరుసటి రోజే పోలీసు స్టేషన్‌లో ఆయన తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందేనని చెప్పారు. దీంతో ఎడిటర్‌ తనకు ఈ నెల 29 వరకు గడువు కావాలని కోరారు. అందుకు సమ్మతించిన పోలీసులు సాక్షి ప్రధాన కార్యాలయం నుంచి బుధవారం రాత్రి 7 గంటలకు వెళ్లిపోయారు. 


ఒక్క రోజులోనే మాట మార్చి.. 
కానీ పోలీసులు ఒక్క రోజులోనే మాట మార్చారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఈ నెల 29 వరకు గడువు ఇచ్చిన పోలీసులు.. గురువారం మళ్లీ హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్ష మయ్యారు. అన్ని రోజులు గడువు ఇవ్వలేమన్నారు. తమ ప్రశ్నావళికి శుక్రవారమే సమాధానాలు చెప్పాలని నోటీసులు ఇచ్చారు. అంటే అమరావతి నుంచి ప్రభుత్వ పెద్దలు, ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడితోనే పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారన్నది స్పష్టమవుతోంది. 

హైదరాబాద్‌ కార్యాలయంలో మూడు రోజులుగా పోలీసుల హల్‌చల్‌ 
ఏపీలో నకిలీ మద్యం ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సీబీఐ విచారణకు పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. అయితే అధికార పారీ్టకి చెందిన వ్యక్తులు, సన్నిహితులు కీలక నిందితులుగా ఉండటంతో కూటమి ప్రభుత్వం కేసును నీరుగార్చేందుకు ‘సిట్‌’ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో నకిలీ మద్యం కుంభకోణంలో వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తుండటంతో ‘సాక్షి’ని అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నింది. శనివారం నెల్లూరు రూరల్, కలిగిరి పోలీసు స్టేషన్‌లో అక్రమ కేసులు నమోదు చేయించింది. 

ఆ మరుక్షణం పోలీసు యంత్రాంగాన్ని సాక్షిపై దాడులకు ఉసిగొల్పింది. శనివారం ఇంటికి వెళ్లి మరీ నెల్లూరు జిల్లా బ్యూరో ఇన్‌చార్జీకి నోటీసులు జారీ చేసిన పోలీసులు ఆ మరుసటి రోజు ఆదివారం తెల్లవారు జామున సోదాల పేరుతో వీరంగం వేశారు. విచారణకు రావాలని ఒత్తిడి చేశారు. మళ్లీ ఆదివారం అర్ధరాత్రి మరోసారి నెల్లూరు రూరల్, కలిగిరి పోలీసులు నోటీసుల పేరుతో వేధింపులకు పాల్పడ్డారు. ఇదే రీతిన ఆదివారం తెల్లవారక ముందే కనీసం కార్యాలయం తాళాలు తెరవక ముందే విజయవాడ ఆటోనగర్‌లోని సాక్షి కార్యాలయంపైకి దండెత్తారు. 

ఎడిటర్‌కు నోటీసులు ఇవ్వాలంటూ సిబ్బందిని, జర్నలిస్టులను వేధించారు. ఎడిటర్‌ హైదరాబాద్‌లోని కార్యాలయం నుంచి విధులు నిర్వహిస్తున్నారని చెప్పినప్పటికీ వరుసగా సోమవారం, మంగళవారం కూడా విజయవాడ సాక్షి కార్యాలయంపై పోలీసుల దండయాత్రలు ఆగలేదు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం పలు కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉన్నందున వారం తరువాత విచారణకు వస్తానని ఎడిటర్‌ సోమవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే మంగళవారం సాయంత్రం వాట్సాప్‌ ద్వారా ఎడిటర్‌కు నోటీసులు పంపించిన పోలీసులు.. బుధవారం హైదరాబాద్‌లోని కార్యాలయంలో అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. 

వాస్తవానికి ఇది సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధమైనప్పటికీ, పోలీసులు టీడీపీ పెద్దలకు జీహుజూర్‌ అంటూ చట్టాలను తుంగలో తొక్కేశారు. అయితే ప్రజాస్వామ్య విలువలు, చట్టాలను  గౌరవిస్తూ పోలీసులు సూచించినట్లుగా సాక్షి ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డి కార్యాలయంలో బుధవారం అందుబాటులో ఉండగా ఏకంగా 10 గంటల పాటు విచారించారు. ఇక గురువారం కూడా అదే రీతిన పోలీసులు అసంబద్ధ ప్రశ్నలు అడుగుతూ వేధింపులకు దిగారు. ఈ స్థాయిలో మీడియాపై చంద్రబాబు సర్కారు అణచివేత చర్యలను ప్రజా సంఘాలతో పాటు జర్నలిస్టు యూనియన్లు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి.

‘సాక్షి’ ఒక్కటే కూటమి టార్గెట్‌..
రాజ్యాంగం ప్రసాదించిన ఆర్టికల్‌ 19(1)(ఏ) ప్రకారం పౌరులకు దక్కిన భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే కాకుండా పత్రికా స్వేచ్ఛపై కూటమి ప్రభుత్వం యథేచ్ఛగా దాడి చేస్తోంది. అక్రమ కేసులపై పోలీసులను న్యాయస్థానాలు పదేపదే హెచ్చరిస్తూ తప్పుబడుతున్నా వారి వైఖరిలో మార్పు రావడం లేదు. పత్రికలు, మీడియా, సోషల్‌ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో అందే ఫిర్యాదులపై కేసుల నమోదు విషయంలో పాటించాల్సిన ప్రమాణాలపై పోలీసు శాఖతోపాటు జిల్లా మేజిస్ట్రేట్లకు హైకోర్టు ఇటీవల స్పష్టమైన మార్గదర్శకాలు నిర్దేశించింది. అయితే రాజ్యాంగానికి కట్టుబడి పని చేయాల్సిన పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తూ వ్యవస్థల ప్రతిష్టను దిగజారుస్తున్నారు.  ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే పాపమన్నట్లు చంద్రబాబు సర్కారు అక్రమ కేసులతో విరుచుకుపడుతోంది.

‘సాక్షి’పై తప్పుడు కేసులు పరిపాటయ్యాయి 
ఏపీలో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం విషయంలో సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన కొద్ది గంటల్లోనే సాక్షి దినపత్రిక సంపాదకులు ధనంజయరెడ్డికి ‘సిట్‌’ పోలీసులు ఎనభై ప్రశ్నలతో ప్రశ్నావళిని అందజేసి అప్పటికప్పుడు సమాధానం కావాలని ఒత్తిడి చేయడం ఎక్కడా జరిగి ఉండదు. 2024లో కూటమి అధికారంలో వచ్చిన దగ్గర నుండి సాక్షి మీడియా గ్రూప్‌ను కట్టడి చేసేందుకు తప్పుడు కేసులు బనాయించడం పరిపాటిగా మారింది. తాజాగా.. నకిలీ మద్యం కథనాలపై సంపాదకుడిని, రిపోర్టర్లను వేధించడం పత్రికా స్వేచ్ఛకు కచ్చితంగా భంగం కలిగించినట్లే. ఈ ప్రయత్నాల్ని విరమించుకోవాలని పోలీసులను, ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం. అలాగే, పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి.  
– దేవులపల్లి అమర్, ఐజేయూ స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు 

అరాచక పాలనకు బాబు మూల్యం చెల్లించుకుంటారు.. 
చంద్రబాబుది ప్రజాస్వామ్య వ్యతిరేక స్వభావం. ఇప్పటికే పలు సందర్భాల్లో ఆ విషయం బయటపడింది. ఇప్పుడు ఏపీలో ఆయన పాలన తీరు, ప్రతిపక్ష పారీ్టపట్ల ఆయన వైఖరి, మీడియాపట్ల వ్యవహరిస్తున్న తీరును చూస్తే మళ్లీ ఆయన స్వభావం స్పష్టమవుతోంది. ఈ బలం శాశ్వతమని చంద్రబాబు విర్రవీగుతున్నారు. నేను చాలామంది ఏపీ ప్రజలతో మాట్లాడితే కూటమి ప్రభుత్వంపట్ల వ్యతిరేకత స్పష్టంగా చెబుతున్నారు. ఇప్పుడు ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్న మీడియాను అణిచివేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. సాక్షిపట్ల వరుసగా చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి అరాచక పాలనకు బాబు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. 
– టంకశాల అశోక్, సీనియర్‌ సంపాదకులు 
 
పత్రికా స్వేచ్ఛను హరించడం తగదు  
హైదరాబాద్‌లోని సాక్షి కార్యాలయంలో నెల్లూరు పోలీసులు సోదాలు నిర్వహించడం తగదు. నోటీసు ఇచ్చేందుకని వచ్చి అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని భయపెట్టేలా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు. ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే. పోలీసులు ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలి కానీ భయపెట్టేలా ప్రవర్తించడం దారుణం.  
– గోరంట్లప్ప, ఏపీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు 

పత్రికా స్వేచ్ఛపై దాడి హేయం 
ప్రభుత్వాలు ప్రతికా స్వేచ్ఛపై దాడి చేయడం దారుణం. సాక్షి పత్రిక ఎడిటర్‌పై కక్ష సాధింపు చర్యలు విడనాడాలి. విచారణ పేరుతో హైదరాబాద్‌లోని కార్యాలయంలో గంటల తరబడి విచారించి 
పోలీసలు హల్‌చల్‌ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు.  
– కల్లుపల్లి సురేందర్‌రెడ్డి, ఏపీ మీడియా ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి

నోటీసుల్లో అసమంజస డిమాండ్లు
వార్తకు సంబంధించి ఎడిటోరియల్‌ ఫైల్‌.. ఒరిజనల్‌ డ్రాఫ్ట్‌ కాపీ (ప్రింట్‌ అండ్‌ డిజిటల్‌) అందించాలి 
⇒ వార్త కథనానికి సంబంధించి ప్రిపరేషన్, ఎడిటింగ్, పబ్లికేషన్‌లతో సంబంధమున్న రిపోర్టర్‌లు, కరస్పాండెంట్లు, ఎడిటోరియల్‌ సిబ్బంది పేర్లు, హోదాలు, ఫోన్‌ నంబర్‌లు ఇవ్వాలి
⇒ వార్త కథనానికి ఆధారాలకు సంబంధించిన మెటీరియల్, నోట్స్, ఫొటోలు, వీడియో ఫుటేజ్, స్టేట్‌మెంట్లు, ఈమెయిల్, మెసేజ్‌లు వంటి ఇతర ఆధారాలు ఏమున్నా సమర్పించాలి 
⇒ పబ్లికేషన్‌ ఆథరైజేషన్‌ ఆమోదాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందించాలి 
⇒ వీటికి సమాధానం ఇవ్వాలని నిర్దేశిస్తూ  కేవలం 12 గంటల సమయం ఇచ్చారు.  

అడుగడుగునా ఉల్లంఘనలే
⇒ బీఎన్‌ఎస్‌ఎస్‌ 179(1), 94 సెక్షన్ల కింద జారీ చేసిన నోటీసులు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(ఏ) ప్రకారం కల్పించిన పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకం కాదా? 
⇒ జర్నలిస్టు లేదా ఎడిటర్‌ను వార్త సోర్స్‌ (సమాచార మూలం) వెల్లడించాలని బలవంతం చేయడం,  భావప్రకటన స్వేచ్ఛా హక్కును ఉల్లంఘించడం కాదా? 

⇒ ప్రజా ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా వార్త సోర్స్‌ గోప్యతను కాపాడే సుప్రీం కోర్టు తీర్పులు... ఆర్నాబ్‌ రంజన్‌ గోస్వామి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (2020).. రోమేశ్‌ థాపర్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మద్రాస్‌ (1950).. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ న్యూస్‌పేపర్స్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (1985)..లను పట్టించుకోకుండా పోలీసులు జరిపిన చర్యలు చట్టపరంగా తప్పు,  రాజ్యాంగ విరుద్ధం కాదా? 

⇒ వార్త ప్రిపరేషన్, ఎడిటింగ్, పబ్లికేషన్‌కు సంబంధించిన ఫైళ్లను, రిపోర్టర్ల పేర్లు, ఫోన్‌ నంబర్లు, ఈమెయిల్‌లు ఇవ్వమని డిమాండ్‌ చేయడం వంటి పోలీసుల చర్యలు మీడియా స్వతంత్రతను దెబ్బతీసే ప్రయత్నం కాదా? 
⇒ ఈ విధమైన డిమాండ్లు రాజ్యాంగపరంగా,  చట్టపరంగా సమంజసమేనా? 
⇒ నోటీసులకు స్పందించేందుకు కేవలం 12 గంటల గడువు మాత్రమే ఇవ్వడం సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడం కాదా? 

⇒ ఎడిటర్‌ సమయం కావాలని లిఖితపూర్వకంగా అభ్యర్థించినా పోలీసులు స్పందించకుండా వెళ్లిపోవడం దురుద్దేశపూరిత చర్య కాదా? 
⇒ ఒకే అంశంపై వరుసగా నోటీసులు ఇవ్వడం, పోలీసులు మళ్లీ మళ్లీ పత్రికా కార్యాలయానికి రావడం ద్వారా ఎడిటర్‌ను భయపెట్టి లొంగదీసుకోవాలనుకోవడం ప్రభుత్వ వ్యూహం కాదా?  

⇒ ఈ చర్యలు అధికార దుర్వినియోగం పరిధిలోకి రావా? 
⇒ ప్రభుత్వ లేదా పోలీసు యంత్రాంగం మీడియా స్వేచ్ఛను అణచివేసేందుకు ప్రయత్నించడం ప్రజాస్వామ్య విధానానికి  వ్యతిరేకం కాదా? 
⇒ ‘‘సాక్షి’’ వంటి పత్రికలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ‘నాణానికి మరొకవైపు ఉన్న అంశాలు’  ప్రజలకు తెలియనీయకుండా, వారికి నిజమైన సమాచారం అందనీయకుండా నిలువరించడం కాదా? 

⇒ వార్తా కథనానికి సంబంధించి రెండు వేర్వేరు పోలీస్‌ స్టేషన్లు (నెల్లూరు రూరల్, కలిగిరి) ఒకే రోజున వేర్వేరు నోటీసులు జారీ చేయడం ద్వంద్వ విచారణ  లేదా అధికార దుర్వినియోగం కిందకు రాదా? 
⇒ సాక్షి పత్రికలో ప్రచురితమైన వార్త ప్రజా ప్రయోజనాలతో ముడిపడి, ప్రజా అవగాహన కోసం ప్రచురితమైనది కా­బట్టి, దానిని ఆధారంగా తీసుకుని కేసులు నమోదు చేయ­డం ప్రజా ప్రయోజన జర్నలిజాన్ని అణిచివేయడం కదా? 
⇒ ఈ చర్య మొత్తం జర్నలిస్టుల స్వేచ్ఛను 
భయపెట్టి, లొంగదీసుకునే  చర్యగా ఎందుకు పరిగణించకూడదు? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement