21వ తేదీన అసెంబ్లీ కమిటీ హాల్‌లో హాజరు కావాలని సమాచారం
కొనసాగుతున్న చంద్రబాబు సర్కారు కక్షసాధింపు
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోందని సాక్షిపై కత్తిగట్టిన వైనం
జర్నలిస్టు, ప్రజా సంఘాల నుంచి నిరసన వెల్లువెత్తుతున్నా ఆగని వేధింపులు
సాక్షి, అమరావతి: ‘సాక్షి’పై చంద్రబాబు సర్కారు కత్తిగట్టింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోందని కక్షసాధిస్తోంది. కేసులు, నోటీసుల పరంపరను కొనసాగిస్తోంది. ఎలాగైనా సాక్షి గొంతు నొక్కాలని శతవిధాలా యత్నిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శిక్షణ సదస్సు రద్దు, దానికి సంబంధించిన లోటుపాట్లపై గతంలో సాక్షి పత్రిక రాసిన కథనంపై ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, చీఫ్ రిపోర్టర్‌కి శాసనసభ వ్యవహారాల కార్యదర్శి సభా ఉల్లంఘన నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సాక్షి ఎడిటర్ హైకోర్టును ఆశ్రయించిన విషయమూ తెలిసిందే. హైకోర్టు ఆదేశాల తర్వాతా కూటమి సర్కారు వేధింపులు ఆపలేదు.
తాజాగా ఎడిటర్ ధనంజయరెడ్డి, చీఫ్ రిపోర్టర్‌కు శాసనసభ వ్యవహారాల కార్యదర్శి ద్వారా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21వ తేదీ ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని అసెంబ్లీ కమిటీ హాలులో ప్రివిలైజ్ కమిటీ ముందు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. పత్రికలో రాసిన పలు కథనాలకు సంబంధించి గతంలో ఎప్పుడూ లేని విధంగా నేరుగా కేసులు నమోదు చేయడం, విచారణ పేరుతో సాక్షి కార్యాలయాలకు తరచూ పోలీసులను పంపి ఇబ్బందులకు గురి చేయడం ద్వారా ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోంది.
ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చేలా ఎడిటర్ ధనంజయరెడ్డి, రిపోర్టర్లపై కేసులు నమోదు చేయడం, విచారణ పేరుతో సాక్షి కార్యాలయాలకు వచ్చి బెదిరింపులకు పాల్పడడంపై జర్నలిస్టు, ప్రజా సంఘాల నుంచి ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తుతున్నా.. చంద్రబాబు సర్కారు క్షక్షసాధింపు పంథాను వీడడం లేదు. దీనిలోభాగంగానే తాజాగా మళ్లీ ప్రివిలైజ్ నోటీసులు జారీ చేయించింది.


