
సాక్షి ఎడిటర్, రిపోర్టర్లను వేధించడం సబబు కాదన్న కన్నడిగులు
కేసులు పెట్టడం, నోటీసులివ్వడం సరికాదు
ప్రతిపక్షాల గొంతును వినిపిస్తున్న మీడియాపైనా కక్షసాధింపు ధోరణి
సాక్షి పాత్రికేయులపై ఉన్న కేసులను వెంటనే ఎత్తివేయాలి
సాక్షి బెంగళూరు: పత్రికా స్వేచ్ఛను హరించేలా ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరును కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక కర్ణాటకలో కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ తీరు పత్రికల గొంతు నొక్కడమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య రక్షణకు పెను ప్రమాదమన్నారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్. ధనంజయరెడ్డి, ఇతర పాత్రికేయులపై ఏపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి వేధించడాన్ని ఇక్కడి జర్నలిస్టు సంఘాల నేతలు, న్యాయవాదులు, రైతు సంఘం నాయకులు, తెలుగు సంఘాల ప్రతినిధులు తప్పుపడుతున్నారు.
ఏ వార్తా పత్రికలో ప్రచురితమైన వార్తపైనా అభ్యంతరాలుంటే దాన్ని ఖండించడం లేదా వివరణ ఇవ్వడం పరిపాటి అని.. కానీ, ఇలా విలేకరులపై కేసులు పెట్టడం, నోటీసులివ్వడం సరికాదని హితవు పలికారు. పత్రికా స్వేచ్ఛకు విఘాతం, భంగం కలిగేలా.. ప్రజాస్వామ్య విలువలకు భంగం వాటిల్లేలా ఏపీ ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు వ్యవహరించడాన్ని వారు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పలు పార్టీల నాయకులు, జర్నలిస్టు సంఘాల నాయకులు, మేధావుల అభిప్రాయాలు వారి మాటల్లోనే..
కేసులు పెట్టి వేధించడం సబబు కాదు..
పత్రికల్లో వచ్చే ప్రతి విమర్శపై కేసులు పెట్టడం పద్ధతికాదు. ఎవరి మీదైనా కేసులు పెట్టే ముందు, నోటీసులిచ్చే ముందు ఆ కేసులో ప్రాథమిక ఆధారాలున్నాయా లేదా అని పరిశీలించాలి. ఆధారాల్లేకుండా కేసులు పెట్టడం చట్టవిరుద్ధం. ప్రచురితమైన వార్తలపై అభ్యంతరాలుంటే వివరణ లేదా రిజాయిండర్ డిమాండ్ చేయాలి. అప్పుడు కూడా పత్రిక ప్రచురించకపోతే తదుపరి చర్యలకు పూనుకోవాలి. అంతేగానీ, ఉద్దేశపూర్వకంగా ఇలా కేసులు పెట్టి వేధించడం సబబు కాదు. – పునీత్, సీనియర్ న్యాయవాది, బెంగళూరు
ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే..
వార్తను ప్రచురించినందుకు సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఇతర పాత్రికేయులపై కేసులు పెట్టడం సమంజసం కాదు. కచ్చితంగా ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది. ఆధారాల్లేని కేసులు చట్టం ముందు నిలబడవు.. ప్రజల కోసం ఎప్పుడూ ప్రతిపక్ష పాత్ర పోషించే పత్రికలపై ఇలా వేధింపులు స్వాగతించదగ్గ పరిణామం కాదు. – గుళ్య హనుమన్న, దళిత ఉద్యమ నాయకుడు, బెంగళూరు
సాక్షి ఎడిటర్‌పై కేసులు ఎత్తేయాలి..
సాక్షి పత్రిక ఎడిటర్, రిపోర్టర్లపై అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పత్రిక స్వేచ్ఛపై దాడిగానే పరిగణిస్తున్నాం. ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా, ఎన్నికల హామీలను తుంగలో తొక్కుతుంటే సాక్షి దినపత్రిక దాన్ని ఎత్తిచూపుతోందని, అంతమాత్రానా అదిరించి బెదిరించి రిపోర్టర్లను లొంగదీసుకోవాలని చూడడం సరికాదు. వెంటనే పత్రికా స్వేచ్ఛను కాపాడుతూ సాక్షి దినపత్రిక ఎడిటర్‌పై కేసులను ఎత్తివేయాలి. – నకిరెకంటి స్వామి, రాష్ట్ర కార్యదర్శి, కర్ణాటక జర్నలిస్టు యూనియన్
తప్పుడు కేసులు సబబు కాదు..
వార్తలో ఏమైనా అభ్యంతరాలుంటే ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసుకోవచ్చు లేదా రిజాయిండర్ ఇవ్వొచ్చు. దానికి కూడా స్పందించపోతే కేసులు పెట్టుకోవచ్చు. అంతేగానీ, ప్రభుత్వం భయపెట్టి తన దారిలోకి తెచ్చుకోవాలన్న కుతంత్రంతో తప్పుడు కేసులు పెట్టడం సబబుకాదు. వెంటనే సాక్షి పాత్రికేయులపై ఉన్న కేసులను ఎత్తివేయాలి.
– రెవరెండ్ డాక్టర్ బిషప్ ఎం. బెంజమిన్, అధ్యక్షుడు, కర్ణాటక తెలుగు క్రిస్టియన్ మినిస్ట్రీస్ ఫెలోషిప్
ఇది ప్రజాస్వామ్య రక్షణకు పెను ప్రమాదం..
ఏపీలో ప్రతిపక్షం గొంతునొక్కే ఘటనలు తరచూ గమనిస్తున్నాం. ప్రతిపక్షాల గొంతును వినిపిస్తున్న మీడియాపై కూడా కక్షసాధింపు ధోరణి కనిపిస్తోంది. కేసులతో సాక్షిని అణచివేయాలని చూడడం దారుణం. సాక్షి ఎడిటర్, రిపోర్టర్లపై కేసులు పెట్టి నోటీసులివ్వడం వారి స్వేచ్ఛను హరించడమే అవుతుంది. ఇది ప్రజాస్వామ్య రక్షణకు పెనుప్రమాదం. – సిద్ధం నారయ్య, అధ్యక్షుడు, బెంగళూరు తెలుగు సమాఖ్య
మీడియా స్వేచ్ఛను గౌరవించే పరిస్థితిలో ప్రభుత్వాలు లేవు
మీడియాను సహించే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉండడం లేదని ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై ఏపీ పోలీసులు కేసులు నమోదు చేయడంపై స్పందిస్తూ.. ‘మీడియాకు, జర్నలిస్టులకు ఒక హక్కు, స్వేచ్ఛ ఉంటాయన్న విషయాన్ని గౌరవించే పరిస్థితుల్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వాలైనా లేవు. జర్నలిస్టులను గౌరవించాలన్న విషయాన్ని వదిలేస్తున్నాయి. అందుకే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి’ అని వ్యాఖ్యానించారు. – ప్రొఫెసర్ హరగోపాల్
కేసులతో భయపెట్టే ప్రయత్నమే ఇది
సమాజ శ్రేయస్సుకు ప్రజాస్వామిక విలువలు, వాక్ స్వాతంత్య్రం, పత్రికా స్వాతంత్య్రం, స్వతంత్ర ఎన్నికల వ్యవస్థ ఎంతో అవసరమని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ‘పత్రికా స్వేచ్ఛ వాక్ స్వాతంత్య్రంలో ఒక భాగం. మీడియా అనేది ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య కళ్ల మాదిరిగా పనిచేస్తుంది. ఎక్కడో జరిగే అక్రమాలు, అన్యాయాలను మీడియా బట్టబయలు చేస్తుంది. దానివల్ల ప్రభుత్వాలకు, అధికారులకు తాము చేస్తున్న పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం కలుగుతుంది.
కానీ, ప్రభుత్వానికి ఇష్టంలేని, నాయకులకు ఇష్టంలేని వార్తలు వచ్చినప్పుడు విలేకరులపై, ఎడిటర్లపై కేసులు పెట్టడం అంటే పత్రికా స్వేచ్ఛపై దెబ్బకొట్టడమే. విలేకరులపై, ఎడిటర్లపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తే ఇలాంటి వార్తలు రాకుండా చేయవచ్చన్నది వాళ్ల ప్రయత్నం. కానీ, అది అప్రజాస్వామికం. ఈ చర్యలు వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తాయి. అదేవిధంగా పత్రికా స్వేచ్ఛను హరిస్తాయి. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం’ అని విమర్శించారు. – జస్టిస్ చంద్రకుమార్