సాక్షి ఫొటోగ్రాఫర్ ఇంటి వద్ద పోలీసులు
తిరుపతిలో ఫొటోగ్రాఫర్ ఇంట్లో సోదాలతో పోలీసుల హల్‌చల్
తిరుమలలో సాక్షి రిపోర్టర్లు, ఫొటోగ్రాఫర్లను పిలిచి విచారణ
ఇతర పత్రికలు, టీవీ చానళ్లలో వచ్చినా సాక్షిపైన మాత్రమే కక్ష
సాక్షి పత్రిక, టీవీ లక్ష్యంగా పోలీసుల వేధింపులు
సాక్షి, అమరావతి: సాక్షి పత్రిక, టీవీ లక్ష్యంగా చంద్రబాబు సర్కారు మరోసారి వేధింపులకు పాల్పడింది. తిరుమలలో ఖాళీ మద్యం బాటిళ్లు కనిపించాయన్న కథనానికి సంబంధించి సాక్షి పత్రిక, టీవీ రిపోర్టర్లు, కెమెరామెన్‌లపై కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా తిరుపతిలో, తిరుమలలో ఇష్టారీతిన వ్యవహరించారు. తిరుపతి సాక్షి ఫొటోగ్రాఫర్ ఇంట్లో మంగళవారం ఉదయం నుంచి ఒక సీఐ, ఎస్‌ఐ, 20 మంది పోలీసులు సోదాలతో హల్‌చల్ చేశారు. టెరర్రిస్టులు, స్మగ్లర్లు, హంతకుల కోసం గాలించినట్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగైదుసార్లు ఫొటోగ్రాఫర్ ఇంట్లో సోదాలు చేశారు.
సాక్షి ఫొటోగ్రాఫర్ ఇంట్లో లేకపోవడంతో ఎక్కడికెళ్లాడంటూ ఇంట్లోవాళ్లమీద ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి వేధించారు. మీ ఆయన ఎక్కడ, ఫోన్లు ఎక్కడ పెట్టాడు.. అంటూ గుచి్చగుచ్చి అడిగారు. ఇంతమంది రావడం ఏమిటి, అసలు ఏం జరిగిందని ఫొటోగ్రాఫర్ కుటుంబసభ్యులు అడిగినా పోలీసులు సమాధానం చెప్పలేదు. సాయంత్రం ఫొటోగ్రాఫర్ కుటుంబసభ్యులకు పోలీసులు నోటీసులు ఇచ్చి అతడిని విచారణకు హాజరుకావాలని చెప్పమని సూచించి వెళ్లిపోయారు. రోజంతా పోలీసులు ఇష్టారీతిన వ్యవహరించడంతో సాక్షి ఫొటోగ్రాఫర్ కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు.
ఇదే వార్తను ఈనాడు, ఆంధ్రజ్యోతి సహా ఇతర పత్రికలు ప్రచురించినా, ఎల్రక్టానిక్ మీడియా చానళ్లు విస్తృతంగా ప్రసారం చేసినా.. ఒక్క సాక్షి రిపోర్టర్లు, ఫొటోగ్రాఫర్లను మాత్రమే పిలిపించి విచారించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కక్షపూరితంగా సాక్షి విలేకరులనే లక్ష్యంగా చేసుకుని విచారణ జరపడం మీడియా స్వేచ్ఛపై దాడేనని జర్నలిస్టు వర్గాలు మండిపడుతున్నాయి.


