
పోలీసులు ఇచ్చిన నోటీసులను పరిశీలిస్తున్న సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి
ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డికి పోలీసుల నోటీసులు
వార్తా కథనానికి సంబంధించి సోర్స్ వెల్లడించాలి
వార్త ప్రిపరేషన్, ఎడిటింగ్, పబ్లికేషన్‌లతో సంబంధమున్న సిబ్బంది సమాచారం ఇవ్వాలి
వార్తా కథనానికి ఆధారాలు సమర్పించాలి
పబ్లికేషన్ ఆథరైజేషన్ ఆమోదాల సమాచారమూ ఇవ్వాలి
నోటీసుల్లో స్పష్టం చేసిన నెల్లూరు జిల్లా పోలీసులు
తద్వారా ‘న్యూస్‌సోర్స్’పై ఉన్నత న్యాయస్థానాల రూలింగ్‌లను తుంగలో తొక్కిన వైనం
సాక్షి, హైదరాబాద్: ప్రజల హక్కుల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం పోరాడుతున్న ‘సాక్షి’ గొంతుక నొక్కడానికి కూటమి ప్రభుత్వం మరోసారి పోలీసులను ప్రయోగించింది. సాక్షి ఎడిటర్ ఆర్ ధనంజయరెడ్డికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు బీఎన్‌ఎస్‌ఎస్ 179 (1), 94 సెక్షన్ల కింద బుధవారం రెండు వేర్వేరు నోటీసులు జారీ చేశారు. ‘నకిలీ మద్యానికి నలుగురు బలి’ శీర్షికన 2025 అక్టోబర్ 8వ తేదీన సాక్షి ప్రధాన సంచికలో ప్రచురితమైన వార్తకు సంబంధించి దాఖలైన రెండు అక్రమ కేసుల్లో నెల్లూర్ రూరల్ పోలీస్ స్టేషన్, కలిగిరి పోలీస్ స్టేషన్‌లకు చెందిన ఎస్‌ఐలు బుధవారం హైదారాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో ఎడిటర్ ధనంజయరెడ్డికి చెరో రెండు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులకు సంబంధించి పోలీసులు కేవలం మూడు రోజుల వ్యవధిలో మూడు సార్లు సాక్షి కార్యాలయానికి రావడాన్ని పరిశీలిస్తే, వారిమీద అధికార పెద్దల ఒత్తిడి ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు.
అసమంజస ఆదేశాలు
వార్తా కథనానికి సంబంధించి బీఎన్‌ఎస్‌ఎస్ 94 సెక్షన్ ప్రకారం పలు డాక్యుమెంట్లు సమర్పించాలని నిర్దేశించారు. వార్తకు సంబంధించి ఎడిటోరియల్ ఫైల్.. ఒరిజనల్ డ్రాఫ్ట్ కాపీ (ప్రింట్ అండ్ డిజిటల్) ఇవ్వాలని కోరారు. దీనితోపాటు వార్తా కథనానికి సంబంధించి ప్రిపరేషన్, ఎడిటింగ్, పబ్లికేషన్‌లతో సంబంధమున్న రిపోర్టర్‌లు, కరస్పాండెంట్లు, ఎడిటోరియల్ సిబ్బంది పేర్లు, హోదాలు, ఫోన్ నంబర్‌లు ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.
ఈ వార్తా కథనానికి ఆధారాలకు సంబంధించిన మెటీరియల్, నోట్స్, ఫొటోలు, వీడియో ఫుటేజ్, స్టేట్‌మెంట్లు, ఈ–మెయిల్, మెసేజ్‌లు వంటి ఇతర ఆధారాలు ఏమున్నా సమర్పించాలని సూచించారు. పబ్లికేషన్ ఆథరైజేషన్ ఆమోదాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందించాలని స్పష్టం చేశారు. తద్వారా పత్రిక, మీడియాకు సంబంధించి సోర్స్ బయటకు వెల్లడించాల్సిన పనిలేదని ఆర్నాబ్ గోస్వామి కేసుతోసహా పలు సందర్భాలో ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును పోలీసులు పూర్తిగా ఉల్లంఘించారు.
కేవలం 12 గంటల గడువు
కాగా, పోలీసులకు ఎడిటర్ పూర్తి స్థాయిలో సహకరించినప్పటికీ, ‘‘తాము నిర్దేశించిన సమయంలో అందుబాటులో లేరు’’ అంటూ నోటీసుల్లో పేర్కొన్న పోలీసులు తాము కోరిన సమాచారాన్ని అంతా కేవలం 12 గంటల లోపు అంటే.. 16వ తేదీన 2:30 గంటలకల్లా హైదరాబాద్ సాక్షి ప్రధాన కార్యాలయంలోకానీ లేదా ఆయా పోలీస్ స్టేషన్‌లలో కానీ (నెల్లూర్ రూరల్ పోలీస్ స్టేషన్, కలిగిరి పోలీస్ స్టేషన్)లలో సమర్పించాలని స్పష్టం చేశారు. అలాగే ‘‘నిర్దేశించిన సమయంలో అందుబాటులో లేని కారణంగా’’ 16వ తేదీ 10.30 గంటలకు తమ విచారణకు సాక్షి కార్యాలయంలో అందుబాటులో ఉండాలని నెల్లూర్ రూరల్ పోలీసులు 179 (1) నోటీసుల్లో పేర్కొనగా, ఈ సమయాన్ని 2.30 గంటలుగా కలిగిరి పోలీసులు నిర్దేశించడం గమనార్హం.
ఈ ప్రశ్నలకు బదులేది?
ఒక వార్తా కథనానికి సంబంధించి ఎడిటర్‌ను సోర్స్ (ఆధారం) వెల్లడించమని పోలీసులు డిమాండ్ చేయడం, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) కింద పత్రికా స్వేచ్ఛను నేరుగా ఉల్లంఘించడం కాదా?
వార్తా కథనానికి సంబంధించి రెండు వేర్వేరు పోలీస్ స్టేషన్లు (నెల్లూరు రూరల్, కలిగిరి) ఒకే రోజున వేర్వేరు నోటీసులు జారీ చేయడం, ద్వంద్వ విచారణ (డబుల్ జియోపార్డీ) లేదా అధికార దురి్వనియోగం కిందకు రాదా?
బీఎన్‌ఎస్‌ఎస్ 94 కింద డాక్యుమెంట్లు, ఎడిటోరియల్ ఫైళ్లు, రిపోర్టర్‌ల పేర్లు, ఫోన్ నంబర్లు ఇవ్వమని పోలీసుల ఆదేశం పత్రికా స్వేచ్ఛను అణిచివేసే చర్య కాదా?
ఉన్నత న్యాయస్థానాలు పలు తీర్పుల్లో పత్రికా సోర్స్‌ను వెల్లడించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసినప్పటికీ, ఏపీ పోలీసుల చర్య ఆ తీర్పులను తుంగలోతొక్కడం కాదా?
కేవలం 12 గంటల గడువులో ‘అంతా
సమర్పించాలని’ అంటూ డిమాండ్ చేయడం, సహజ న్యాయ సూత్రమైన ‘సమంజస సమయం ఇవ్వాలి’ అనే నిబంధనను ఉల్లంఘించడం కాదా?
సాక్షి పత్రికలో ప్రచురితమైన వార్త ప్రజా ప్రయోజనాలతో ముడిపడి, ప్రజా అవగాహన కోసం ప్రచురితమైనది కాబట్టి, దానిని ఆధారంగా తీసుకుని కేసులు నమోదు చేయడం ప్రజా ప్రయోజన జర్నలిజాన్ని అణిచివేయడం కదా?
ఈ చర్య మొత్తం జర్నలిస్టుల స్వేచ్ఛను హరించి భయపెట్టి, లొంగదీసుకునే చర్యగా ఎందుకు పరిగణించకూడదు?
ఇది.. మీడియాపై టెర్రరిజం
మీడియాను టెర్రరైజ్ చేసే ధోరణులు ప్రజాస్వామ్యంలోని వ్యక్తులందరూ ఖండించాలి. పత్రికా ఎడిటర్లు, విలేకర్లపై పోలీసులుపదేపదే కేసులు నమోదు చేయడాన్ని మీడియాపై టెర్రరిజంగానే పరిగణించాలి. ప్రచురితమైన వార్తకు సంబంధించి సమాచారం పేరిట పత్రికా కార్యాలయానికి నోటీసు ఇవ్వడం తగదు.
– జి.ఆంజనేయులు, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ
ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ ఇది. ఎడిటర్లు, విలేకర్లను భయభ్రాంతులకు గురి చేసి పత్రికా వ్యవస్థను భయపెట్టాలనే ఆలోచన తప్పు. ప్రభుత్వం ఇలాంటి విధానాన్ని ఇప్పటికైనా మానుకోవాలి. పత్రికా కార్యాలయాలపైకి పోలీసులు పంపించడం సరికాదు.
– శ్రీరాం యాదవ్, ఏపీ మీడియా ప్రొఫెషనల్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
సాక్షి మీడియాపై దాడి హేయం
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సాక్షి మీడియాపై దాడి హేయం. నకిలీ మద్యంలో ప్రభుత్వం ప్రజలకు ఎదుట దోషిలా నిలబడింది. వాస్తవాలను ఎత్తి చూపుతున్న ‘సాక్షి’పై కేసులు పెట్టి అడ్డుకోవాలని చూస్తోంది. ఎడిటర్‌పై కేసు పెట్టి నోటీసులతో పత్రికా కార్యాలయానికి వెళ్లడం ప్రజాస్వామ్యం దాడిగానే పరిగణించాలి.
– ధారా గోపీ, సీనియర్ జర్నలిస్టు
మీడియాపై రాజకీయ కక్షలు సరికాదు
మీడియాపై రాజకీయ కక్షలు తగవు. సాక్షిలో ప్రభుత్వ వైఫల్యాలపై కథనాలు వచ్చినంత మాత్రాన పత్రిక కార్యాలయాలపై పోలీసులు దాడులు చేయడం, ఎడిటర్‌ను బెదిరించడం, కార్యాలయంలో సోదాలు నిర్వహించడం సరికాదు. మీడియాపై అధికారుల దాడులు, ఒత్తిళ్లు, వేధింపులు ఇలాగే కొనసాగితే ప్రభుత్వ చర్యలకు నిరసనగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిస్తుంది.
– కె.స్వాతిప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏపీయూడబ్ల్యూజే