
భావ ప్రకటన స్వేచ్ఛ.. రాజ్యాంగం కల్పించిన హక్కు
మనం ప్రజాస్వామ్యాన్ని ఎంచుకున్నాం.. రాచరికం, నియంతృత్వాన్ని కాదు
తప్పును ఎత్తిచూపి, విమర్శించే హక్కు పత్రికలకు రాజ్యాంగం కల్పించింది
ప్రజా జీవితంలో ఉన్న వారిపై పత్రికలు, పౌరులు కచ్చితంగా విమర్శలు చేస్తారు
వారిపై కేసులు పెడతాం, జైలుకు పంపుతామంటే రాజ్యాంగ ఉల్లంఘనే
ప్రభుత్వంలో ఉన్నవారే తమ బాస్‌లుగా పోలీసులు భావిస్తున్నారు
పోలీసులకు అపరిమితమైన స్వేచ్ఛ ఇవ్వడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు
పత్రికల స్వేచ్ఛ, పౌర హక్కులను ప్రభుత్వాలు, వ్యవస్థలు కాపాడాలి
జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బ్రహ్మారెడ్డి
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాజ్యాంగం నాలుగు వ్యవస్థలను ఏర్పాటు చేసింది. అందులో నాలుగో వ్యవస్థ (ఫోర్త్ ఎస్టేట్) పత్రికలు. వీటి భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రజా జీవితంలోని వ్యక్తులు, ప్రభుత్వాలు, వ్యవస్థలు తప్పుచేస్తే ఎత్తి చూపడం, విమర్శించే హక్కు పత్రికలకు ఉంది. కానీ.. పత్రికలు వార్తలు రాస్తే కేసులు పెడతాం, జైలుకు పంపిస్తామంటే ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే.
మనం రాచరిక, నియంతృత్వ వ్యవస్థలో లేం అనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. ప్రజాస్వామ్యాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలి’ అని జన విజ్ఞానవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బ్రహ్మారెడ్డి అన్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం, సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి నివాసానికి వెళ్లి భయానక వాతావరణాన్ని సృష్టించడం వంటి పరిణామాల నేపథ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రభుత్వాల బాధ్యత, తాజా పరిణామాలపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
మనం రాచరికాన్ని ఎంచుకోలేదు
మనం ప్రజాస్వామ్య వ్యవస్థను ఎంచుకున్నాం. రాచరిక, నియంతృత్వ వ్యవస్థలను కాదు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రజాస్వామ్యం బతికేందుకు మనం నాలుగు వ్యవస్థలను ఎంచుకున్నాం. అందులో నాలుగో వ్యవస్థగా పత్రికలకు, భావ ప్రకటన స్వేచ్ఛకు రాజ్యాంగ నిర్మాతలు చోటు కల్పించారు. ప్రజాస్వామ్యం బతకాలంటే భావ ప్రకటన స్వేచ్ఛ బతకాలి.
సమాజంలోని మంచిని ఎలా పత్రికలు తెలియజేస్తాయో.. ప్రభుత్వాలు తమ సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని పత్రికలను ఎలా ఆశ్రయిస్తాయో.. అలాగే ప్రభుత్వాలు, ప్రజాజీవితంలోని వ్యక్తుల తప్పులను ఎత్తిచూపడం, విమర్శించడం పత్రికలకు ఉన్న హక్కు. దీన్ని కాలరాయడం ముమ్మాటికీ తప్పు. ఎడిటర్ ఇంటికి వెళ్లి అలజడి సృష్టించడం సరికాదు.
తప్పును ఎత్తిచూపడం పత్రికల హక్కు
తప్పును ఎత్తిచూపడం, విమర్శించడం పత్రికల హక్కు. ఇలాంటి వాటిపై అభ్యంతరాలుంటే న్యాయస్థానాలను ఆశ్రయించాలి. తప్పొప్పులను కోర్టులు నిర్ణయిస్తాయి. అంతేకానీ.. ‘తప్పులు ఎత్తిచూపకూడదు, వార్తలు రాస్తే పోలీసులతో కేసులు పెడతాం, రిమాండ్‌కు పంపుతాం’ అంటే ఎలా? ఇది ముమ్మాటికీ తప్పే. ఈ కేసులేవీ కోర్టుల్లో నిలబడవు. అప్పుడు రిమాండ్‌కు పంపిన వ్యక్తికి పరిహారం కూడా ప్రభుత్వాలు చెల్లించాలి. ఇటీవల భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. దీనిని పౌరసంఘాలు ఖండించాలి. భావ ప్రకటన స్వేచ్ఛకు మద్దతుగా నిలవాలి.
పౌర సంఘాలు ప్రశ్నించాలి..
ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లితే ప్రశ్నించడం పౌరహక్కుల నేతల బాధ్యత. కాబట్టే ప్రజాస్వామ్యానికి భంగం వాటిల్లితే కచ్చితంగా ప్రశ్నిస్తా. ప్రశ్నించకూడదు అంటే ఎలా? ఈవీఎంలపై అనుమానాలు మాకు ఉన్నాయి. ప్రజలకు ఉన్నాయి. ఈవీఎంలో పోలైన ఓట్లకు, వీవీ ప్యాట్లకు తేడాలు ఉన్నాయి.
వీటిని ప్రశ్నిస్తే నివృత్తి చేసి వ్యవస్థపై నమ్మకం పెంచేలా ప్రభుత్వాలు, ఎన్నికల కమిషన్ బాధ్యతలు తీసుకోవాలి. కానీ.. ఆ పని చేయలేదు. దీంతో అనుమానాలు పెరుగుతాయి. వ్యవస్థలపై నమ్మకం పోతుంది. ఎన్నికల కమిషన్ నిష్పాక్షికంగా వ్యవహరించలేదనే అనుమానాలు ప్రజల్లో ఉంటాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇలాంటి అంశాలలో పౌరసంఘాలు ప్రశ్నించాలి.
పోలీసులకు అపరిమిత స్వేచ్ఛ ప్రమాదకరం
ఎవరు అధికారంలో ఉంటే వారిని పోలీసులు బాస్‌లుగా భావిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు అపరిమితమైన స్వేచ్ఛ ఇవ్వడం అత్యంత ప్రమాదకరం. ప్రస్తుత దుష్పరిణామాలకు మద్దతు తెలపడం అంటే రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే.
ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే నిజమైన దేశభక్తి
మన ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉంది. ఇది ప్రభుత్వాలు గ్రహించాలి. తమపై విమర్శలు చేసే వ్యక్తులు, పత్రికలపై కేసులు పెడతామంటే ప్రజాస్వామ్యాన్ని తీసేసి రాచరిక, నియంతృత్వ వ్యవస్థలను పెట్టుకోవాలి. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే నిజమైన దేశభక్తి. బాధ్యతగల ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.
మీడియా స్వేచ్ఛను హరించకూడదు
మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్
సాక్షి, హైదరాబాద్: రాజకీయపరమైన కారణాలతో మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టడం సమర్థనీయం కాదని ఆరి్థక, రాజకీయరంగ నిపుణుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. భావప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని అందరూ గౌరవించాలని సూచించారు. విజయవాడలో ఏపీ పోలీసులు ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి నివాసానికి సెర్చ్‌వారెంట్ లేకుండానే వెళ్లి సోదాలు జరపడంపై నాగేశ్వర్ స్పందించారు.
ప్రభుత్వంలో ఎవరున్నా మీడియా కవరేజీ విషయంలో ఏమైనా భిన్నాభిప్రాయాలుంటే దాని గురించి చెప్పాలే తప్ప, కేసులు పెట్టడం సరికాదన్నారు. కేసులు పెట్టి మీడియా స్వేచ్ఛను హరించకూడదని, వార్తలపై ఏమైనా అభ్యంతరాలుంటే రిజాయిండర్, లేదా వివరణ కోరవచ్చని అన్నారు. ప్రజాస్వామ్యానికి మూలం విమర్శ కాబట్టి దానిని సరైన పద్ధతిలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏదైనా నేరం చేస్తే కేసులు పెట్టడం వేరని, కానీ కేవలం రాజకీయ కారణాలతో మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టడం సరికాదని సూచించారు.
‘సాక్షి’ ఎడిటర్‌కు వేధింపులు అన్యాయం
సీనియర్ సంపాదకుడు కె.శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి’ దినపత్రిక సంపాదకుడు ధనంజయరెడ్డిపై వేధింపులు అన్యాయమని సీనియర్ సంపాదకుడు కె.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. విజయవాడలోని ధనంజయరెడ్డి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించిన నేపథ్యంలో.. కె.శ్రీనివాస్ పై విధంగా స్పందించారు. ఒక పత్రికా సంపాదకుడిని లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదని స్పష్టం చేశారు.
నోటీసుల్లేకుండా ఎడిటర్ ఇంట్లో సోదాలా?
తెలంగాణ స్టేట్ ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ ఖండన
సాక్షి, హైదరాబాద్: విజయవాడలో ‘సాక్షి‘ దినపత్రిక సంపాదకుడు ఆర్.ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసులు ముందస్తు నోటీసులు లేకుండా సోదాలు చేయడాన్ని తెలంగాణ స్టేట్ ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.గంగాధర్, ప్రధాన కార్యదర్శి హరి ఒక ప్రకటనలో పోలీసులు తీరును గర్హించారు.