
‘సాక్షి’ఎడిటర్ ఇంట్లో సోదాలు దుర్మార్గం
చరిత్ర నేర్పిన గుణపాఠాలను పాలకులు గమనంలో పెట్టుకోవాలి
రూ.9 వేల కోట్లు అప్పు కోసం రూ.2 లక్షల కోట్లు విలువైన గనులు తాకట్టు
రాయలసీమ కార్మీక, కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి
సాక్షి ప్రతినిధి, కడప: ‘నియంతృత్వ పాలన ఈ దేశంలో ఎప్పుడూ మనుగడ సాగించలేదు. విపరీత జనాకర్షణ కలిగిన నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి పత్రికా స్వేచ్ఛ గొంతు నొక్కారు. ప్రజలు ఎమర్జెన్సీని తిరస్కరిస్తూ ఆమెకు, ఆమె పార్టీకి గుణపాఠం చెప్పారు’ అని రాయలసీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి అన్నారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ నియంతృత్వ చర్యలపై తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
రాష్ట్రంలో గనులు ధారాదత్తం
రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు ప్రశ్నించిన వారినంతా అణిచివేయాలనే దృక్పథంతో ఉన్నారు. ఎమర్జెన్సీని పెట్టిన ఇందిరాగాంధీ ప్రజాగ్రహానికి గురయ్యారన్న విషయం వారికి తెలియంది కాదు. చరిత్ర ఎన్నిమార్లు గుణపాఠాలు నేర్పినా పాలకులు ఆ పంథా వీడడం లేదు. రాష్ట్రంలో గనులు, భూములను ప్రభుత్వం ఇష్టారాజ్యంగా తమకు కావాల్సిన వాళ్లకు ధారాదత్తం చేస్తోంది. ఓబుళాపురం ఇనుప ఖనిజ గనుల్లో అధికారులు ఎంతమందికి శిక్ష పడిందో గమనించి కూడా గనులను అస్మదీయులకు ధారాదత్తం చేస్తున్నారు.
ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై విశ్వాసం కన్పించడం లేదు...
ప్రజాస్వామ్యంపై విశ్వాసం కలిగించాల్సిన ప్రభుత్వమే వ్యవస్థను బలహీన పరుస్తోంది. తద్వారా రాబోయే ప్రభుత్వాలకు తప్పుడు సంకేతాలు ఇస్తోంది. ఇలాంటి పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. వివిధ వర్గాల ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వ పాలన పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో వారి గొంతుకగా నిలుస్తూ, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న ‘సాక్షి’పై అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఆ పత్రికా ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో సోదాలు, పోలీసుల దురుసు ప్రవర్తన, ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా వ్యవహరించిన తీరు చాలా దుర్మార్గమైన విషయం.
ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించడంపై ప్రజల పక్షంగా ‘సాక్షి’ నిలుస్తోంది. ఇలాంటివి మనస్సులో ఉంచుకొని మానసికంగా దెబ్బకొట్టే చర్యలకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమయ్యారు. ఇప్పటికే వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ సోషల్ మీడియా యాక్టివిస్టులను తొక్కిపెట్టారు. మరోవైపు పత్రికల గొంతు నొక్కే చర్యలకు సిద్ధమయ్యారు. పత్రికా స్వేచ్ఛను దెబ్బతీసే పరిస్థితులకు ప్రభుత్వమే దిగడం ప్రజాస్వామ్యవాదులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
రూ.9వేల కోట్లు అప్పు కోసం..
ప్రభుత్వానికి రూ.9 వేల కోట్ల అప్పు కోసం దాదాపు రూ.రెండు లక్షల కోట్ల విలువైన 436 రకాల ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించేందుకు సిద్ధపడటం దురదృష్టకరం. ఏపీఎండీసీ ఆధ్వర్యంలో ఆ గనుల తవ్వకాలు చేపడితే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. నిరుద్యోగుల అసంతృప్తిని చల్లార్చవచ్చు.
ప్రభుత్వం ప్రజలకు మేలు చేసినా, చేయకపోయినా వారికున్న స్వేచ్ఛను హరించకుండా ఉంటే అదే పదివేలనిపిస్తోంది. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కొనసాగుతున్నాయి. నాటి పరిస్థితిని పాలకులు మరిపిస్తున్నారు. ఉన్నత న్యాయస్థానాలు అనేక పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగ చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మందలించినప్పటికీ అప్రజాస్వామిక దాడులు ఆగడం లేదు. ఇది ఏమాత్రం సహేతుకం కాదు.
నోటీసులు ఇవ్వకుండా సోదాలు సరికాదు
నోటీసులు ఇవ్వకుండా సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటి మీదకు వెళ్లి సోదాలు చేయడం సరికాదు. చట్టం పద్ధతులు, నిబంధనలు పాటించకుండా ఎడిటర్ ఇంట్లో తనిఖీలు చేయడాన్ని జర్నలిస్టులు అంతా ఖండిస్తున్నారు. మా నోరు నొక్కడానికే పోలీసులు ఇలా చేస్తున్నారని అంటున్నారు. తప్పు చేస్తే నోటీసులిచ్చి పిలిచి అడగాలి కానీ.. నోటీసులివ్వకుండా ముందుగానే సోదాలు చేయొద్దని కోర్టులు కూడా చెబుతున్నాయి. అయినా వీటిని పోలీసులు పాటించడం లేదు. మీడియా, సోషల్ మీడియాలో పొగిడితే ఓకే... విమర్శిస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నారు.
– తెలకపల్లి రవి, సీనియర్ సంపాదకులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు