బకాయిలపై నిలదీస్తున్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి
గవర్నర్‌తో అవాస్తవాలు చెప్పించారంటూ వైఎస్సార్‌సీపీ ఆగ్రహం
రెండేళ్ల తల్లికి వందనం ఇంకా పూర్తి స్థాయిలో ఎందుకు ఇవ్వలేదని నిలదీత
తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి.. రెండో ఏడాది చాలా కుటుంబాలకు రూ.7–8 వేలు బకాయి
కాదు అని నిరూపిస్తే సభకు క్షమాపణ చెబుతానని మండలి ప్రతిపక్ష నేత బొత్స సవాలు
15 శాతం మందికి అందలేదని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్న మంత్రి కొలుసు
ఒక గ్రామ సచివాలయం పరిధిలో పథకం అందని వారి జాబితాను అందజేసిన ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి
అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు వేయకపోయినా వేసినట్లు ఎలా చెబుతారని ఆగ్రహం
సాక్షి, అమరావతి: సవాళ్లు ప్రతిసవాళ్లతో గురువారం శాసన మండలి దద్దరిల్లింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో అధికార, విపక్ష పార్టీ సభ్యులు ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు. గవర్నర్ చేత అవాస్తవాలు చెప్పించారంటూ వైఎస్సార్‌సీపీ సభ్యుడు పి.చంద్రశేఖర్‌రెడ్డి గణాంకాలతో వివరించారు. తల్లికి వందనం పథకం కింద మొదటి ఏడాది ఒక్క రూపాయి పడలేదని, రెండో ఏడాది పూర్తిగా రూ.15 వేలు ఇవ్వకుండా తగ్గించి ఇచ్చి, గవర్నర్ చేత మాత్రం పూర్తిగా ఇచ్చేసినట్లు అవాస్తవాలు చెప్పించారని ఎత్తి చూపారు.
అన్నదాత సుఖీభవ కింద ఏ రైతు ఖాతాలో రూ.20,000 జమ చేయకుండానే ఇచ్చేసినట్లు అసత్యాలు వల్లె వేయించారని విమర్శించారు. దీనిపై మంత్రి కొలుసు పార్థసారధి స్పందిస్తూ.. గవర్నర్ ప్రసంగంలోని ప్రతీ మాటకు కట్టుబడి ఉన్నామని, అర్ధ సత్యాలతో సభను తప్పుదోవ పట్టించొద్దంటూ అడ్డు తగలడంతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. మండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎవరివి అవాస్తవాలో.. ఎవరివి నిజాలో ప్రజలు తెలుసుకుంటారన్నారు.
ఇప్పటికీ చాలా కుటుంబాలకు తల్లికి వందనం కింద పూర్తి స్థాయిలో డబ్బులు పడలేదని, ఈ మాటకు తానూ కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఇది తప్పు అని నిరూపిస్తే క్షమాపణ చెప్పి తన మాటలు వెనక్కి తీసుకుంటానని సవాల్ విసిరారు. కావాలంటే మీ నియోజకవర్గ అధికారులను అడిగి తెలుసుకోవాలన్నారు. దీనిపై మంత్రి పార్థసారధి స్పందిస్తూ.. సాంకేతిక కారణాలతో ఒకరిద్దరికి పడకపోవచ్చని, వీటిని తమ దృష్టికి తీసుకువస్తే సరి చేస్తామన్నారు.
దమ్ముంటే తప్పు అని నిరూపించండి
ఒకరిద్దరు కాదు.. 15–18 శాతం మందికి ఇంకా రూ.7 వేల నుంచి రూ.8 వేలు చెల్లించాల్సి ఉందనే మాటకు ఇప్పటికీ తాను కట్టుబడి ఉన్నానని బొత్స ప్రతి సవాల్ విసరడంతో అధికార పక్షం ఆత్మరక్షణలో పడింది. ఆధారాలిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమని, అన్నదాత సుఖీభవ కూడా పడలేదంటూ తప్పుడు సమాచారం చెపుతున్నారని మంత్రి పార్థసారథి చర్చను పక్కదోవ పట్టించే యత్నం చేశారు. ఇది పెద్దల సభ అని, తాము తప్పుడు సమాచారంతో సభను తప్పుదోవ పట్టించామని నిరూపిస్తే బేషరతుగా క్షమాపణ చెపుతానంటూ బొత్స మరోసారి స్పష్టం చేశారు.
తిరిగి చర్చను ప్రారంభించిన చంద్రశేఖర రెడ్డి.. ఒక గ్రామంలోని సచివాలయంలో 21 మందికి తల్లికి వందనం అందలేదని ఫిర్యాదులు చేస్తే, వాటిని పరిశీలించి పరిష్కరించామంటూ చూపిస్తున్నా, ఇప్పటికీ తమ ఖాతాల్లో డబ్బులు పడలేదని లబ్ధిదారులు చెపుతున్నారంటూ ఆధారాలను సభకు సమర్పించారు. దీనిపై రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కలుగచేసుకుంటూ.. అధికారుల తప్పు ఉంటే తప్పకుండా వారిని సస్పెండ్ చేస్తామన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ప్రజల్లో భయాందోళనలు సృష్టించి, రద్దు చేసినట్లు ప్రకటించి.. వేరే పేరుతో దాన్నే కొనసాగిస్తున్నారని చంద్రశేఖరరెడ్డి తప్పు పట్టారు.
‘గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్చి ఇప్పుడు ఇంటి వద్దకే పౌర సేవలు అంటున్నారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి కొత్తగా రెండు జిల్లాలు తీసుకువచ్చారు. తొలిసారి ముఖ్యమంత్రి అయిన జగన్ ఏకంగా ఒకేసారి కొత్తగా 13 జిల్లాలు తీసుకొచ్చారు. తద్వారా ఎవరు విజన్ ఉన్న ముఖ్యమంత్రో ఇట్టే తెలుస్తోంది’ అని చంద్రశేఖర రెడ్డి అన్నారు.


