
కుల సంఘాల స్పష్టీకరణ
సాక్షి ఎడిటర్‌పై ఏపీ సర్కార్ అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్
సాక్షి, హైదరాబాద్: అక్రమ కేసులతో మీడియాను అణచివేయడం అసాధ్యం అని కుల సంఘాలు స్పష్టం చేశాయి. సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై ఏపీ పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని ఈ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి.
ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్‌గా వ్యవహరించే మీడియా.. ప్రజల సమస్యలతో పాటు ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతుందని, అలాంటి వాటిని సానుకూలంగా స్వీకరించి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని సూచించాయి. సాక్షి మీడియా వచ్చిన తర్వాత బీసీలు, బడుగు, బలహీన వర్గాల గొంతు పెద్ద ఎత్తున వినిపిస్తోందని ఆ సంఘాలు తెలిపాయి.
అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి..
ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అత్యంత కీలకం. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా వ్యవహరించే ఈ వ్యవస్థను బలవంతంగా కేసులు పెట్టి లొంగదీసుకోవాలనుకోవడం ముర్ఖత్వం. సాక్షి మీడియా ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టడాన్ని బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. వెంటనే ఏపీ ప్రభుత్వం ఈ కేసులను ఉపసంహరించుకోవాలి. – జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు
పత్రికా స్వేచ్ఛను హరించడమే..
ప్రతిపక్షంతో పాటు విపక్ష అనుకూల మీడియా గొంతు నొక్కుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ప్రభుత్వాల చర్యలను ఎండగట్టడంలో మీ డియా పాత్ర కీలకం. అలాంటి వార్తలను ప్రభుత్వం పాజిటివ్‌గా తీసుకుని పరిష్కార చర్యలు చేపట్టాలి. అలాకాకుండా మీడియాపైన అక్రమంగా కేసులు పెట్టడమంటే ప్రతికా స్వేచ్ఛను హరించడమే. సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. – గవ్వల భరత్‌కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం
మీడియాపై దాడి మంచిదికాదు
ప్రభుత్వాలు ఏ మీడియాపైనా ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేయవద్దు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వస్తే.. వాటికి వివరణ ఇవ్వడమో, ఖండించడమో జరగాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా కేసులు నమోదు చేస్తామనడం సరికాదు. సాక్షి ఎడిటర్‌పై ఏపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి.
మీడియాలో కేవలం పాలకపక్షం వార్తలే కాకుండా ప్రతిపక్షం వార్తలు కూడా వస్తాయి. ప్రతిపక్షాల వార్తలు రాసినందుకు సాక్షి మీడియాపై కేసులు నమోదు చేయడమంటే జర్నలిజంపై నేరుగా దాడి చేయడమే. – జి.చెన్నయ్య, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు