పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికలకు శరవేగంగా సన్నాహాలు
తుది ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్ల ఖరారుపై అధికారుల దృష్టి
12వ తేదీలోగా ఓటర్ల తుది జాబితా ప్రచురణకు ఎస్‌ఈసీ ఆదేశం
నేడు రాజకీయ పార్టీల సలహాలు, సూచనలు తెలుసుకోనున్న ఎన్నికల సంఘం
మున్సిపాలిటీలు, వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారుకు త్వరలో మార్గదర్శకాలు
ఈనెల మూడో వారంలోగా షెడ్యూల్, ఫిబ్రవరిలో ఎన్నికలు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం తుది ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్ల ఖరారు, పోలింగ్ సామగ్రిని సమకూర్చుకోవడం వంటి అంశాలపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల సన్నాహాల్లో భాగంగా బుధవారం కీలక సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని.. జిల్లా కలెక్టర్లు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం– 2019లోని సవరించిన సెక్షన్ 195–ఎ ప్రకారం మున్సిపల్ వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను ఈ నెల 12వ తేదీలోగా తప్పనిసరిగా ప్రచురించాలని సూచించారు. 
రాణీ కుముదిని
ఈ నెల 13వ తేదీన పోలింగ్ స్టేషన్ల వివరాల ముసాయిదా జాబితాను ప్రచురించి, వాటిని ‘టి పోల్’యాప్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతో పాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వద్ద స్పష్టంగా ప్రదర్శించాలని చెప్పారు. పోలింగ్ నిర్వహణలో భాగంగా అవసరమైన రిటరి్నంగ్ అధికారులు, సహాయ రిటరి్నంగ్ అధికారులు, జోనల్ అధికారులు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్‌లను వెంటనే నియమించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. పోలింగ్ కోసం అవసరమయ్యే బ్యాలెట్ బాక్సులు, ఇతర పోలింగ్ సామగ్రిని సమకూర్చుకోవాలని సూచించారు.
నేడు రాజకీయ పార్టీలతో భేటీ
ఇప్పటికే జిల్లా స్థాయిలో రాజకీయ పక్షాలతో ఈ నెల 5న సమావేశాలు నిర్వహించగా, గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో రాష్ట్ర స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరగనుంది. ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయా పార్టీల ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఇదిలావుంటే ఈ నెల 16 నాటికి ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్లపై స్పష్టత రానున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తదుపరి కార్యాచరణపై ఎస్‌ఈసీ దృష్టి పెట్టనుంది.
పాత రిజర్వేషన్ల ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మున్సిపాలిటీలు, వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారుకు త్వరలో మార్గదర్శకాలు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మున్సిపాలిటీ వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లు జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఖరారు చేస్తారు. మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేస్తుంది. ప్రభుత్వం నుంచి అందే రిజర్వేషన్లు, ఎన్నికల తేదీలకు సంబంధించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది.
ఫిబ్రవరి నెలాఖరుకల్లా కొత్త పాలకమండళ్లు!
మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు చేసి ఈ నెల మూడోవారంలోగా షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఫిబ్రవరి మూడో వారంలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి వచ్చే నెలాఖరుకు కొత్త పాలక మండళ్లకు పురపాలన బాధ్యతలు అప్పగించేలా కసరత్తు జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నల్లగొండ జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ హోదాకు అప్‌గ్రేడ్ చేస్తూ మంగళవారం ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ‘తెలంగాణ పురపాలికల చట్ట సవరణ’బిల్లును ఆమోదించారు. గతంలో నల్లగొండ మున్సిపాలిటీలో 48 వార్డులు ఉండగా, ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్‌లోనూ 48 డివిజన్లుగా రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహిస్తారు.


