ఈ దిశగా పరిశోధనల్లో కీలక ముందడుగు
ఊపిరితిత్తులపై పరిశోధనలకు దేశంలోనే తొలి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభం
ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి ఏర్పాటు చేసిన జర్మనీ యూనివర్సిటీ
పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించిన ఏఐజీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సమీప భవిష్యత్తులో బయో ఇంజనీర్డ్ ఊపిరితిత్తులు, రక్తనాళాల నమూనాల అభివృద్ధే లక్ష్యంగా కీలక అడుగు పడింది. ఊపిరితిత్తుల ఆరోగ్య సంబంధ పరిశోధనల కోసం దేశంలోనే తొలి బయోఇంజనీరింగ్ పరిశోధన కేంద్రం (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో బుధవారం ప్రారంభమైంది. జర్మనీకి చెందిన జస్టస్ లీబిగ్ యూనివర్సిటీలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ లంగ్‌హెల్త్ (ఐఎల్‌హెచ్), ఐఐటీ హైదరాబాద్ సంయుక్తంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశాయి. ఐఐటీహెచ్ డైరెక్టర్ ఫ్రొఫెసర్ బి.ఎస్.మూర్తి, ఇన్‌స్టిట్యూట్ ఫర్ లంగ్ హెల్త్ ప్రతినిధులు ప్రొఫెసర్ వెర్నర్ సీగర్, ప్రొఫెసర్ సోని సవాయ్ పుల్లంశెట్టి సమక్షంలో పద్మవిభూషణ్ అవార్డుగ్రహీత, ఏఐజీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న గాలి కాలుష్యం ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని.. ఈ పరిస్థితుల్లో ఊపిరితిత్తుల ఆరోగ్య పరిశోధనలపై దృష్టి సారించడం అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. ఊపిరితిత్తుల ఆరోగ్య రంగంలో కీలక పరిశోధనలు విస్తృతంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్‌స్టిట్యూట్ ఫర్ లంగ్‌హెల్త్ (ఐఎల్‌హెచ్)తో కలిసి ఏర్పాటు చేసిన ఈ కేంద్రం క్లినికల్ పరిశోధన, రోగుల ప్రయోజనాలకు కీలక పరిష్కారం చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశీయ పరిస్థితులకు ప్రపంచస్థాయి పరిష్కారాలే లక్ష్యం..
ఇప్పటివరకు ఊపిరితిత్తులు పాడైన రోగులకు అవయవ మార్పిడి చికిత్స విధానమే అందుబాటులో ఉండగా బయో ఇంజనీర్డ్ ఊపిరితిత్తులు, రక్తనాళ నమూనాల అభివృద్ధి పూర్తిస్థాయిలో జరిగితే ఊపిరితిత్తుల చికిత్సలో సరికొత్త విప్లవం రానుందని నిపుణులు చెబుతున్నారు.
మెకానోబయాలజీ, లేబుల్–ఫ్రీ ఇన్‌వివో ఇమేజింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన జంతు పరిశోధన సదుపాయాలు ఐఐటీహెచ్‌లో ఉన్నాయి. అలాగే ఐఐటీహెచ్‌లోని మైక్రోఫ్లూయిడిక్స్ ల్యాబ్, 3డీ ప్రింటింగ్ వంటి సదుపాయాలను కూడా ఈ పరిశోధన కేంద్రం ఉపయోగించుకోనుంది. నాన్–ఇన్వేసివ్ డయాగ్నొస్టిక్స్, ఆధునిక చికిత్సా విధానాల అభివృద్ధికి ఈ కేంద్రం బాటలు వేయనుంది. వాయు కాలుష్యానికి తోడు, ధూమపానం, ఆహార అలవాట్ల కారణంగా దేశంలో లక్షలాది మంది ఊపిరితిత్తుల కేన్సర్లు, ఆస్తమా వంటి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నారు. దేశీయంగా ఉన్న పరిస్థితులను అధ్యయనం చేస్తూ ప్రపంచస్థాయిలో పరిష్కారాలను చూపడమే లక్ష్యంగా ఈ కేంద్రంలో పరిశోధనలు సాగనున్నాయి.


