అత్యధిక నీటి నిల్వ సామర్థ్యంగల జలాశయాలున్న బేసిన్‌లలో అగ్రస్థానం
మూడో స్థానంలో గోదావరి.. నాలుగో స్థానంలో నర్మద
అన్ని బేసిన్‌లలోని జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 9,105.92 టీఎంసీలు
కేంద్ర జలసంఘం తాజా అధ్యయన నివేదికలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: దేశంలో అతిపెద్ద నది గంగ.. అతిపెద్ద నదుల్లో కృష్ణమ్మది మూడో స్థానం. కానీ అత్యధిక నీటి నిల్వ సామర్థ్యంగల జలాశయాలు ఉన్న నదీ పరీవాహక ప్రాంతాల (బేసిన్)లో కృష్ణా అగ్రగామిగా నిలిచింది. ఆ తర్వాతే గంగా బేసిన్ ఉంది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను పొందుపరిచింది. దేశంలోని అన్ని నదీ పరీవాహక ప్రాంతాల్లో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న జలాశయాల నీటి నిల్వలపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది.
అధ్యయన నివేదికలోని ప్రధానాంశాలు ఇవీ..
⇒ దేశంలో అన్ని నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తయిన జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 9,105.92 టీఎంసీలు. నిర్మాణంలో ఉన్న జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 1,651.73 టీఎంసీలు.
⇒ కృష్ణా బేసిన్‌లో ఇప్పటికే పూర్తయిన జలాశయాల నీటినిల్వ సామర్థ్యం 1,789 టీఎంసీలుకాగా నిర్మాణంలో ఉన్న జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 146.79 టీఎంసీలుగా ఉంది. కృష్ణా బేసిన్‌లో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న జలాశయాల నీటినిల్వ సామర్థ్యం కలిపితే 1,935.79 టీఎంసీలకు పెరుగుతుంది.
⇒ గంగా బేసిన్‌లో పూర్తయిన జలాశయాల నీటినిల్వ సామర్థ్యం 1,719.28 టీఎంసీలుగా ఉండగా నిర్మాణంలో ఉన్న జలాశయాల నిల్వ సామర్థ్యం 270.17గా ఉండనుంది.
⇒ గంగా బేసిన్‌లో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న జలాశయాల నీటినిల్వ సామర్థ్యం కలిపితే 1,989.45 టీఎంసీలకు పెరుగుతుంది. అంటే.. నిర్మాణంలో ఉన్న జలాశయాలు పూర్తయితే అత్యధిక నీటి నిల్వగల రిజర్వాయర్లు ఉన్న బేసిన్‌లలో కృష్ణమ్మను గంగమ్మ అధిగమించి ప్రథమ స్థానానికి చేరుతుందన్న మాట.

⇒ చైనా, భారత్, బంగ్లాదేశ్‌ల మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే బ్రహ్మపుత్రా నది హిమాలయ నది. జీవనది. కానీ వర్షఛాయ ప్రాంతంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే పెన్నా నదీ పరివాహక ప్రాంతంలోనే అత్యధిక నీటి నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాలు ఉండటం విశేషం. దేశంలో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న జలాశయాల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. అత్యధిక నీటి నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు ఉన్న బేసిన్‌లలో పెన్నా పదో స్థానంలో నిలిస్తే.. బ్రహ్మపుత్ర 11వ స్థానంలో నిలవడం గమనార్హం. బ్రహ్మపుత్ర బేసిన్ పర్వతాలు, లోయలతో కూడుకున్నది. జలాశయాల నిర్మాణానికి అనువైన ప్రాంతం కాదు.


