హైదరాబాద్‌లో ఆఫ్ క్యాంపస్ ఏర్పాటుకు మొగ్గు..
కొత్త కోర్సులు డిజైన్ చేస్తాం.. అంతర్జాతీయ ఫ్యాకల్టీ అందిస్తాం
ఇప్పటికే పలు దేశాల వర్సిటీ ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు
సాక్షి, హైదరాబాద్: తమ క్యాంపస్‌ల ఏర్పాటుకు గ్లోబల్ సమ్మిట్‌లో అంగీకారం తెలపాలనుకుంటున్న విదేశీ వర్సిటీలు అనేక ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుకు తెస్తున్నాయి. నిర్వహణపరమైన పూర్తి స్వేచ్ఛ, కోర్సుల డిజైన్, ఫ్యాకల్టీ నియామకం, బోధన విధానంలో సాధికారత కోరుతున్నాయి. ఈ తరహా హామీలు ఇస్తేనే తాము హైదరాబాద్‌లో ఆఫ్ క్యాంపస్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు పంపుతున్నాయి. నాణ్యమైన విద్య అందిస్తామనే విశ్వాసం ఇస్తే, ఇవేవీ సమస్యలు కాబోవని విదేశీ వర్సిటీ ప్రతినిధులకు ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.వి.బాలకిష్టారెడ్డి ఇప్పటికే పలు వర్సిటీల ప్రతినిధులతో సమన్వయం చేసుకున్నారు. రప్పించే ప్రయత్నం.. వచ్చేందుకు సిద్ధం: గ్లోబల్ సమ్మిట్‌కు కొన్ని విదేశీ వర్సిటీలనైనా రప్పించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ బాధ్యతను మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డికి ప్రభుత్వం అప్పగించింది. ఈ దిశగానే ఆయన విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు పలు విదేశీ వర్సిటీలు కూడా హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటుకు దీన్నో అవకాశంగానే భావిస్తున్నాయి. హైదరాబాద్‌లో అనేక అవకాశాలున్నాయని ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ సర్వేల్లోనూ విదేశీ వర్సిటీలు గుర్తించాయి.
ఇప్పటి వరకూ ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ముంబయి, అహ్మదాబాద్, బెంగుళూరు, చెన్నై ప్రాంతాల్లోనే విదేశీ వర్సిటీలు తమ ఆఫ్ క్యాంపస్‌లు ఏర్పాటు చేశాయి.
అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ, యూకేలోని ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ యాజమాన్యాలు రెండేళ్లుగా హైదరాబాద్‌లో అవకాశాలపై ఆరా తీస్తూనే ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం 2023 ఫిబ్రవరిలో విదేశీ క్యాంపస్‌ల ఏర్పాటుకు గెజిట్ జారీ చేసిన తర్వాత ఈ ప్రక్రియ కొంత పుంజుకుంది.
దేశవ్యాప్తంగా 14 విదేశీ యూనివర్సిటీలు తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనుమతి పొందాయి.
హైదరాబాద్, కోల్‌కత్తాలో మాత్రం ఇప్పటి వరకూ విదేశీ వర్సిటీలు రాలేదు. గ్లోబల్ సమ్మిట్‌లో సానుకూల సంకేతాలు వస్తాయని ఉన్నత విద్యావర్గాలు అంటున్నాయి.
యూనివర్సిటీ ఆఫ్ లండన్ సహా జర్మనీ, ఆస్ట్రేలియా, యూకే యూనివర్సిటీల ప్రతినిధులు జరుపుతున్న చర్చలు ఈ దిశగా ఆశలు కల్పిస్తున్నాయి.
ఇలా అయితే... వస్తాం
విదేశీ వర్సిటీలు విద్యార్థుల ప్రవేశాలు, నిర్వహణ, కోర్సుల డిజైన్, ఫీజుల నిర్ణయంపై పూర్తి స్వేచ్చను కోరుతున్నాయి. విదేశీ వర్సిటీల్లో ఉన్న వారితో ఆన్‌లైన్ ద్వారా బోధన అందించే వెసులుబాటు ఉండాలని కోరుతున్నాయి. అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న, గ్రేడింగ్ విధానంతో కూడిన కోర్సులను ప్రవేశపెట్టాలనే ప్రతిపాదన చేస్తున్నాయి. ఫీజుల విషయంలోనూ ప్రధాన క్యాంపస్‌తో సమానంగా వసూలు చేసే అవకాశం కోరుతున్నాయి. కోర్సులు, ఫ్యాకల్టీ విషయంలో ప్రభుత్వ వర్గాలకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. అయితే, ఫీజుల విషయంలోనూ కొంత అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాన క్యాంపస్‌లో ఫ్యాకల్టీ నేరుగా బోధిస్తుంది. ఆఫ్ క్యాంపస్‌లో ఆన్‌లైన్ మోడ్‌లో ప్రధానంగా బోధన ఉంటుంది. కాబట్టి ఫీజులు కొంత తగాలనేది ప్రభుత్వ వాదన.
ఆ ఒత్తిడి తగ్గుతుందా?
దేశం నుంచి ఏటా లక్షల సంఖ్యలో విదేశీ విద్యకు వెళుతున్నారు. ఇందులో అమెరికాకు వెళ్లేవారే ఎక్కువ. 2023–24లో 3.30 లక్షల మంది ఉంటే, 2024–25లో 3.66 లక్షల మంది అమెరికాకు వెళ్లారు. ఇందులో హైదరాబాద్ నుంచి వెళ్లిన విద్యార్థులు 35 శాతం ఉన్నట్టు భారత రాయభార కార్యాలయం పేర్కొంది. దీనిని నివారించేందుకు విదేశీ, ప్రైవేట్ యూనివర్సిటీలను భారత ప్రభుత్వం 1995 నుంచి ప్రోత్సహిస్తోంది. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్ర యూనివర్సిటీల సంఖ్య కన్నా, ప్రైవేటు, డీమ్డ్ వర్సిటీల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రైవేటు వర్సిటీల సంఖ్య దేశంలో 502 ఉంటే, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు 496 మాత్రమే ఉన్నాయి.
2017–22 మధ్య కాలంలో 51 శాతం పెరిగాయి. అయినా దేశంలో 18–23 మధ్య వయసు ఉన్న యువత 28.4 శాతం మంది మాత్రమే ఉన్నత విద్యలో ప్రవేశిస్తున్నారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇవి అందుబాటులో లేకపోవడమే ప్రధాన కారణం. ఇక్కడ ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుపై విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలంగాణలో 137 అనుబంధ గుర్తింపు పొందిన ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే, 75 యూజీసీ అటానమస్ హోదా పొందాయి. వీటిల్లో సగం 2021 నుంచి 2024 మధ్య అటానమస్ పొందినవే. అటానమస్ కాకముందు 45 శాతం ఉత్తీర్ణత ఉంటే, పొందాక 90 శాతం విద్యార్థులు పాసవ్వడాన్ని విద్యార్థి సంఘాలు ప్రశి్నస్తున్నాయి.
నమ్మకాన్ని కోరుతున్నాయి
రాష్ట్రంలో ఆఫ్ క్యాంపస్ ఏర్పాటుకు విదేశీ వర్సిటీలు ఆసక్తిగానే ఉన్నాయి. అయితే, అవి కొన్ని రకాల భద్రత, నమ్మకాన్ని ఆశిస్తున్నాయి. పూర్తి స్వేచ్ఛ కావాలని కోరుతున్నాయి. భూమి ఇవ్వడం, పన్నుల నుంచి మినహాయింపును అడుగుతున్నాయి. నాణ్యమైన విద్య అందిస్తామనే భరోసా ఇవ్వడానికి స్థానిక తోడ్పాటు అవసరమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో వనరులు, పరిస్థితులపై విదేశీ వర్సిటీలు పూర్తి విశ్వాసంతో ఉన్నాయి. – ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్


