
నాగార్జున కెరీర్‌లోని వందో సినిమా ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్). తమిళ దర్శకుడు ఆర్‌ఏ కార్తీక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున ద్వి పాత్రాభినయం చేస్తున్నారని, కథలో ముగ్గురు హీరోయిన్లకు చాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా టబు ఖరారయ్యారనే వార్తలు తెరపైకి వచ్చాయి.
తాజాగా మరో హీరోయిన్ పాత్ర కోసం మేకర్స్ అనుష్కా శెట్టిని సంప్రదించారని టాక్. ఇక 2005లో వచ్చిన ‘సూపర్’ సినిమాలో నాగార్జున, అనుష్కా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ తర్వాత ‘డాన్’ (2007), ‘రగడ’ (2010), ‘ఢమరుకం’ (2012) చిత్రాల్లో నాగార్జున, అనుష్క నటించారు.
అలాగే నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ (2016)లో అతిథి పాత్ర చేశారు అనుష్క. ఇంకా నాగార్జున భక్తుడిగా నటించిన ‘ఓం నమో వేంకటేశాయ’ (2017)లో భక్తురాలిగా ఆమె నటించారు. ఇంకో విషయం ఏంటంటే... నాగార్జున హీరోగా నటించిన ‘కింగ్’ (2008)లో ఓ పాటలో నటించిన అనుష్క ఇప్పుడు ‘కింగ్ 100’లో హీరోయిన్‌గా కనిపిస్తారా? నాగ్–అనుష్కల జోడీ రిపీట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.