
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు నటి హేమ (Actress Hema). టాలీవుడ్‌లో వందలాది సినిమాలు చేసిన ఆమె ఇటీవలి కాలంలో ఏదో ఒక వివాదంతో వార్తల్లో నానుతూ వస్తోంది. తాజాగా తన జర్నీ గురించి యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు పంచుకుంది. హేమ మాట్లాడుతూ.. అమ్మకు సినిమాలంటే ఇష్టం. అలా నేను ఇండస్ట్రీకి వచ్చాను. అమ్మ సపోర్ట్ లేకపోతే నేనింతవరకు వచ్చేదాన్ని కాదు. ఇండస్ట్రీకి వచ్చి 37 ఏళ్లవుతోంది.
పెళ్లయ్యాక ఎంజాయ్‌మెంట్ లేదు
కెరీర్ బాగున్నప్పుడే ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. సినిమాకు, ఫంక్షన్‌కు, ఓ ఇంటర్వ్యూకు.. అలా కాసేపు బయటకు వెళ్దామన్నా సరే మా ఆయన రాడు. తను రిజర్వ్‌డ్‌గా ఉంటాడు. పొద్దున్నే లేచి టిఫిన్, లంచ్ ప్రిపేర్ చేసి షూటింగ్‌కు వెళ్లేదాన్ని. తిరిగి రాగానే మళ్లీ వంట చేసేదాన్ని. అలా క్షణం తీరిక లేకుండా పరిగెత్తుతూనే ఉన్నాను. నా లైఫ్‌లో ఎంజాయ్‌మెంట్ లేకుండా పోయింది.
అందుకే బిగ్‌బాస్‌కు వెళ్లా..
లాక్‌డౌన్‌లో 40 ఏళ్ల వయసు దాటేశాను. ఆ వయసులో నా శరీరంలో హార్మోన్లలో మార్పు మొదలైంది. డిప్రెషన్ ఛాయలు కనిపిస్తున్నాయి. నాకెవరి టార్చర్ లేదు, అయినా తెలియని కోపం, బాధ.. ఎందుకో నాకే అర్థం కాలేదు. అప్పుడు బిగ్‌బాస్ ఆఫర్ రావడంతో షోకి వెళ్లిపోయా.. బిగ్‌బాస్ హౌస్‌లో అందరికీ బాగా వండిపెట్టాను. నాకు నాగార్జునగారంటే చాలా ఇష్టం. ఆయనకు నేను ఎదురుచెప్పలేను. బహుశా అందుకే నన్ను వారం రోజులకే ఎలిమినేట్ చేశారు. కానీ ఆ షో వల్ల ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్లతో కలిసి చిల్ అయ్యేదాన్ని.
నాగార్జున వస్తే..
త్వరగానే డిప్రెషన్ నుంచి బయటపడ్డాను. చిన్న చిన్న బిజినెస్‌లు చేశాను. నా కూతురి మెచ్యూరిటీ ఫంక్షన్‌కి నాగార్జున, అమలతో కలిసి వచ్చారు. గంటన్నరసేపున్నారు. ఇంకా ఉండాలనుకున్నారు. కానీ అక్కడున్నవాళ్లు ఫోటోల కోసం ఇబ్బందిపెడుతుండటంతో ఇక వెళ్లిపోండి.. అని నాగార్జునను బతిమాలి పంపించేశాను. నా జీవితంలో అనుభవించని కష్టాలు, ఇబ్బందులన్నీ ఒక్క 2024లోనే ఫేస్ చేశాను. ఏ తప్పు చేయకపోయినా కష్టాలపాలయ్యాను. ఒకానొక సమయంలో చచ్చిపోవాలనిపించింది లేదంటే ఎవరినైనా చంపేయాలనిపించింది అని హేమ చెప్పుకొచ్చింది. ఈ నటి తెలుగు బిగ్‌బాస్ మూడో సీజన్‌లో పాల్గొంది.