హీరో ఫ్రెండ్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు మధునందన్. నిన్నే ఇష్టపడ్డాను, సై, ఇష్క్, గీతాంజలి, గుండెజారి గల్లంతయ్యిందే, రభస, లై, వినయ విధేయ రామ.. ఇలా అనేక సినిమాలు చేశాడు. తాజాగా 'శంబాల' సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరవగా అనేక విషయాలు పంచుకున్నాడు.
మధునందన్ మాట్లాడుతూ.. గుండెజారి గల్లంతయ్యిందే తర్వాత కొన్ని మంచి సినిమాలు చేశాను. అయితే రెండు సినిమాల షూటింగ్ కోసం వరుసగా ఆరునెలలు అమెరికాలోనే ఉండిపోయాను. దాంతో చాలామంది ఏమనుకున్నారంటే.. ఇంకా ఉద్యోగం చేస్తూ యాక్టింగ్ చేస్తున్నాననుకున్నారు. ఉద్యోగం వల్ల సరైన టైం ఇవ్వలేననుకున్నారు. దానివల్ల 10-15 సినిమా అవకాశాలు పోయాయి. కానీ అప్పటికే నేను జాబ్ మానేసి చాలాకాలమైంది.
మోసపోయా..
నా పక్కనే ఉంటూ నా క్యారెక్టర్లు కొట్టేసిన వ్యక్తితో ఇప్పటికీ స్నేహం చేస్తున్నాను. కాకపోతే జాగ్రత్తగా ఉంటాను. వాళ్లలా ఒకరిని తొక్కి ఎదగడం నాకు చేతకాదు. అలాంటివాళ్లను పెద్దగా పట్టించుకోను. నా వరకు వస్తే ఓకే, కానీ నన్ను దాటి కుటుంబం జోలికి వెళ్తే మాత్రం అస్సలు ఊరుకోను.
కెరీర్ మొదట్లో ఉద్యోగం, సినిమాలు రెండూ చేశాను. ఓపక్క ఉద్యోగం, మరో పక్క సినిమాలు చేస్తూ రోజుకు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయేవాడిని. అలా నాలుగేళ్లపాటు కష్టపడి సంపాదించిన రూ.25 లక్షలు బిజినెస్‌లో పెట్టాను. అప్పుడు ఓ వ్యక్తి నన్ను నిండా ముంచేశాడు. ఉన్న డబ్బంతా పోయింది అని మధునందన్ చెప్పుకొచ్చాడు.


