ఒకరు మన తోడుంటేనే జీవితం పరిపూర్ణం అని చెప్పారు తప్ప నీకు నవ్వు ముఖ్యం.. ఒంటరిగా అయినా సంతోషంగా ఉండగలవు అని ఎవరూ చెప్పలేదు అంటోంది బాలీవుడ్ నటి షెఫాలి షా. హిందీ సినిమాలు, సిరీస్‌లతో అలరించే షెఫాలికి రెండు పెళ్లిళ్లయ్యాయి. మొదటగా బుల్లితెర నటుడు హర్ష్ చయ్యను పెళ్లాడింది.
రెండు పెళ్లిళ్లు
కానీ, వీరి బంధం ఎంతోకాలం కొనసాగలేదు. 2000వ సంవత్సరంలో దంపతులిద్దరూ విడిపోయారు. తర్వాత అదే ఏడాది దర్శకుడు విపుల్ అమృత్‌లాల్ షాను రెండో పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. తాజాగా తన మొదటి వైవాహిక జీవితపు తాలూకు చేదు అనుభవాలను నటి గుర్తు చేసుకుంది.
ఎన్నో దారుణాలు
షెఫాలి మాట్లాడుతూ.. నీకు భర్త, స్నేహితుడు, అన్న, చెల్లి.. ఇలా ఎవరి అవసరమూ లేదు, నీకు నువ్వు చాలు అని ఎవరూ నాతో చెప్పలేదు. ఒకవేళ మీరు మంచి రిలేషన్‌లోనే ఉంటే అంతకన్నా అద్భుతం ఇంకోటి ఉండదు. కానీ ఆ రిలేషన్‌షిప్ బాగోలేకపోతే మాత్రం అంతకన్నా నరకం మరొకటి లేదు. ఎన్నో దారుణాలు చూడాల్సి వస్తుంది. ఆ రిలేషన్‌ను కొనసాగించాలా? వదిలేయాలా? అన్న అంతర్మథనంలో పడతారు.
చావు తప్ప..
చివరకు ఒకరోజు వస్తుంది. ఇక సహించడం నా వల్ల కాదనిపిస్తుంది.. దీన్నలాగే వదిలేస్తే రేపు నా ప్రాణాలు పోవచ్చేమో అనిపిస్తుంది. అలాంటి సందర్భం నా జీవితంలోనూ ఎదురైంది.. అది నా ఫస్ట్ మ్యారేజ్ సమయంలో! అప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ ఓ ప్రశ్న అడిగింది. నీ జీవితంలో మళ్లీ నిన్ను ప్రేమించే వ్యక్తి తారసపడకపోతే ఏం చేస్తావ్? రిస్క్ తీసుకుంటావా? లేదా ఈ బంధాన్ని కంటిన్యూ చేస్తావా? అని అడిగింది. రిస్క్ తీసుకోవడానికే మొగ్గు చూపాను.
రిస్క్ చేశా
అవసరమైతే నా జీవితాన్ని ఒంటరిగానైనా గడుపుతానన్నాను. అంతేకానీ నాకు విలువ లేని చోట, ఏమాత్రం ఆనందం దొరకని చోట శిలలా బతకలేనని బదులిచ్చాను. ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరిచేందుకు నేనేం పిజ్జాను కాదని చెప్పా.. అని గుర్తు చేసుకుంది. షెఫాలి చివరగా ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 వెబ్ సిరీస్‌లో కనిపించింది. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.


