అందం ఆనందం.. ఆనందమే మకరందం అన్నారో మహాకవి. సినీతారలకు, ముఖ్యంగా హీరోయిన్లకు ఇది వర్తిస్తుంది. వారికి అదృష్టం, అభినయంతోపాటు తళతళ మెరిసే మేని అందం కూడా చాలా అవసరం. అది ఉంటే వయసు గురించి గుర్తుకురాదు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా అదే అంటోంది.
ఎందుకంటే పెళ్లి, బాబు అంటూ సంసార జీవితంలో మునిగిన కాజల్.. సినీజీవితాన్ని కూడా సమపాళ్లలో అనుభవిస్తోంది. కథానాయికగా చందమామగా అలరించినా, మగధీరతో అభినయించినా.. అందాలు ఆరబోసినా ఆమెకే చెల్లింది. పాన్ ఇండియా హీరోయిన్‌గా అలరిస్తున్న కాజల్ అగర్వాల్‌కు ఇటీవల దక్షిణాదిలో అవకాశాలు లేకపోయినా బాలీవుడ్‌లో బాగానే ఉన్నాయి. అక్కడ రామాయణం సినిమాలో మండోదరిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అలాగే ది ఇండియా స్టోరీ అనే మరో మూవీలోనూ హీరోయిన్‌గా నటిస్తోందట! ఇప్పటికీ మిలమిల మెరిసిపోతున్న కాజల్ తన సౌందర్య రహస్యం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఇప్పుడు తన వయసు 40 ఏళ్లని.. సౌందర్యానికి కారణం వర్కవుట్స్, యోగా అంది. తాను నిత్యం వర్కవుట్స్ చేయడంతో పాటు మంచి పోషకాహారం తీసుకుంటానంది.
ముఖ్యంగా ఆకుకూరలు, పళ్లరసాలు తీసుకుంటానని పేర్కొంది. కాయగూరల్లో ఉండే పౌష్టికాహారాలు, కొబ్బరి నీళ్లు, పళ్లరసాల్లో ఉండే ప్రకృతి సిద్ధమైన తీపి ద్వారా వెంటనే సత్ఫలితాలు అందుతాయని తెలిపింది. అందువల్ల తాను వయసు గురించి ఆలోచించనని పేర్కొంది.


