ఆ్రస్టేలియా గడ్డపై ఇంగ్లండ్ టెస్టు విజయం
రెండు రోజుల్లోనే ముగిసిన నాలుగో టెస్టు
4 వికెట్ల తేడాతో ఆసీస్ ఓటమి
ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్ 132 ఆలౌట్
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 178/6
జనవరి 4 నుంచి చివరి టెస్టు
మెల్‌బోర్న్: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఇంగ్లండ్ జట్టు అద్భుతం చేసింది. ఆ్రస్టేలియా గడ్డపై గత పదిహేనేళ్లుగా ఒక్క టెస్టు మ్యాచ్ కూడా నెగ్గలేకపోయిన ఇంగ్లండ్ జట్టు... ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. ‘యాషెస్’ సిరీస్‌లో భాగంగా రెండు రోజుల్లోనే ముగిసిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మూడు టెస్టులు గెలిచిన ఆతిథ్య ఆ్రస్టేలియా సిరీస్ హస్తగతం చేసుకోగా... ఈ విజయంతో ఇంగ్లండ్ 1–3తో నిలిచింది.
‘యాషెస్’ సిరీస్‌లో భాగంగా సొంతగడ్డపై వరుసగా 18 టెస్టుల్లో పరాజయం ఎరగని ఆ్రస్టేలియా జట్టు... మెల్‌బోర్న్ టెస్టులో ఓటమి చవిచూసింది. ఈ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు రెండు రోజుల్లోనే విజయం సాధించగా... ఇప్పుడు అశేష అభిమానుల మధ్య సాగిన పోరులో ఇంగ్లండ్ కూడా రెండు రోజుల్లోనే గెలుపొందింది. ఒకే సిరీస్‌లో ఇలా రెండు మ్యాచ్‌లు రెండు రోజుల్లోనే ముగియడం 129 ఏళ్లలో ఇదే తొలిసారి.
ఓవర్‌నైట్ స్కోరు 4/0తో శనివారం రెండో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా చివరకు 34.3 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ (67 బంతుల్లో 46; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... కెపె్టన్ స్టీవ్ స్మిత్ (39 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్) కాస్త పోరాడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 4, బెన్ స్టోక్స్ 3, జోష్ టంగ్ 2 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఇంగ్లండ్ ముందు 175 పరుగుల లక్ష్యం నిలవగా... చక్కటి పోరాటం కనబర్చిన పర్యాటక ఇంగ్లండ్ జట్టు 32.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.
జాకబ్ బెథెల్ (46 బంతుల్లో 40; 5 ఫోర్లు), జాక్ క్రాలీ (48 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్), బెన్ డకెట్ (26 బంతుల్లో 34; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. బ్రూక్ (18 నాటౌట్), జేమీ స్మిత్ (3 నాటౌట్) అజేయంగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, జే రిచర్డ్‌సన్, స్కాట్ బోలాండ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్ పేసర్ జోష్ టంగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు జనవరి 4 నుంచి ప్రారంభం కానుంది.
మళ్లీ అదే తంతు...
పేసర్లు పండగ చేసుకున్న ఈ పోరులో... తొలి ఇన్నింగ్స్‌లో ఆకట్టుకోలేకపోయిన ఆ్రస్టేలియా... రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే వైఫల్యం కొనసాగించింది. హెడ్, స్మిత్‌తో పాటు కామెరాన్ గ్రీన్ (19) మాత్రమే రెండంకెల స్కోరు చేయగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. నైట్ వాచ్‌మన్ స్కాట్ బోలాండ్ (6) ఏడో ఓవర్‌లో అవుట్ కాగా... కాసేపటికే వెదరాల్డ్ (5) అతడిని అనుసరించాడు. లబుషేన్ (8) విఫలం కాగా... ఉస్మాన్ ఖ్వాజా (0), అలెక్స్ కేరీ (4) ఇలా వచ్చి అలా వెళ్లారు. దీంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఆసీస్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది.
ఇంగ్లండ్ ముందు 175 పరుగుల లక్ష్యమే ఉన్నా... పచ్చికతో కూడిన పిచ్‌పై కంగారూ పేసర్లను ఎదుర్కొంటూ ఆ మాత్రం స్కోరు చేయడం కూడా కష్టమే అనిపించింది. అయితే ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు ‘పోరాడితే పోయేదేముంది’ అన్న తరహాలో చెలరేగింది. ఓపెనర్లు క్రాలీ, డకెట్ తొలి వికెట్‌కు 51 పరుగులు జోడించి జట్టుకు శుభారంభం అందించగా... బ్రైడన్ కార్స్ (6), జో రూట్ (15), కెపె్టన్ బెన్ స్టోక్స్ (2) ఎక్కువసేపు నిలవలేకపోయినా... బెథెల్ చక్కటి షాట్‌లతో జట్టును విజయం దిశగా తీసుకెళ్లాడు.
‘ఈ విజయానికి ముందు వరకు ఈ పర్యటన చాలా కష్టంగా సాగింది. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా జట్టుగా పోరాడం. ప్లేయర్లు చూపిన తెగింపు ఆకట్టుకుంది. అందుకు తగ్గ ఫలితం దక్కింది. ‘బాక్సింగ్ డే’ టెస్టు రెండు రోజుల్లో ముగియాలని ఎవరూ కోరుకోరు’ అని ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ అన్నాడు.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 152 పరుగులు చేయగా... ఇంగ్లండ్ 110 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఒక్క ఆటగాడు కూడా హాఫ్ సెంచరీ నమోదు చేయలేదు. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఓపెనర్ హెడ్ చేసిన 46 పరుగులే అత్యధికం. ‘రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 50–60 పరుగులు తక్కువ చేశాం. అవి ఉంటే ఫలితం మరోలా ఉండేది’ అని ఆస్ట్రేలియా కెపె్టన్ స్మిత్ అన్నాడు.
17 మ్యాచ్‌ల తర్వాత ఆ్రస్టేలియా గడ్డపై రూట్ తొలి టెస్టు విజయం రుచి చూశాడు. న్యూజిలాండ్ మాజీ కెపె్టన్ డానియల్ వెటోరీ 1997 నుంచి 2011 మధ్య ఆ్రస్టేలియాలో 12 మ్యాచ్‌లాడి ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు.
92,045 బాక్సింగ్ డే టెస్టు రెండో రోజు ఆటను ప్రత్యక్షంగా తిలకించేందుకు మెల్‌బోర్న్ క్రికెట్ మైదానానికి వచ్చిన అభిమానుల సంఖ్య.
5468 రోజుల తర్వాత ఆ్రస్టేలియా గడ్డపై ఇంగ్లండ్ జట్టు టెస్టు మ్యాచ్ గెలిచింది. చివరగా 2011లో ఆసీస్‌లో టెస్టు నెగ్గిన ఇంగ్లండ్ జట్టు ఆ తర్వాత ఆడిన 18 టెస్టుల్లో 16 మ్యాచ్‌ల్లో ఓడి, రెండింటిని ‘డ్రా’ చేసుకుంది.
479 ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎదుర్కొన్న బంతులు. 1928 బ్రిస్బేన్ టెస్టు (457 బంతులు) తర్వాత ఇదే అత్యల్పం.


