
షెన్‌జెన్ (చైనా): భారత అగ్రశ్రేణి జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి వరుసగా రెండో టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. చైనా మాస్టర్స్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం టైటిల్ పోరుకు అర్హత సంపాదించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో ఎనిమిదో సీడ్ భారత జోడీ వరుస సెట్లలో మాజీ ప్రపంచ చాంపియన్స్, రెండో సీడ్ ఆరోన్ చియా–సో వూ యిక్ (మలేసియా) జంటపై అద్భుత విజయం సాధించింది.
సాత్విక్–చిరాగ్ ద్వయం 21–17, 21–14తో మలేసియన్ ప్రత్యర్థి జంటను ఓడించింది. రెండుసార్లు ఒలింపిక్ పతకాలు నెగ్గిన ప్రత్యర్థి జంట ఈ సెమీస్ మ్యాచ్‌కు ముందు భారత ద్వయంపై 11–4 తేడాతో ఆధిపత్యంలో ఉంది. అలాంటి జోడీపై సాత్విక్–చిరాగ్‌లు ఈ సెమీస్‌లో మాత్రం చెలరేగారు. కేవలం 41 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించి విజయం సాధించారు.
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో హాంకాంగ్ ఓపెన్ బరిలోకి దిగిన భారత జంట రన్నరప్‌గా నిలిచింది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో టైటిల్‌పై కన్నేసింది. నేడు జరిగే ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ టాప్ సీడ్ కిమ్ వోన్ హో–సియో సియంగ్ జే జంటతో తలపడుతుంది.