పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం
విపక్ష సభ్యుల ఆగ్రహం
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, ఆజీవికా మిషన్–గ్రామీణ(జీ రామ్ జీ) బిల్లుకు గురువారం పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. తొలుత లోక్‌సభలో విపక్షాల నిరసనల మధ్యే మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించారు. ఈ బిల్లు పట్ల ప్రతిపక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభలో బిల్లు ప్రతులను చించేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. మోదీ ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందని, గాం«దీజీ ఆశయాలు, ఆదర్శాలను నీరుగారుస్తోందని మండిపడ్డారు.పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం ఏమిటని నిలదీశారు. గాం«దీజీ వారసత్వాన్ని నామరూపాల్లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు. జీ రామ్ జీ బిల్లుపై లోక్‌సభలో దాదాపు 8 గంటలపాటు చర్చ జరిగింది.
విపక్ష సభ్యులు తమ అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ఈ చర్చకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సమాధానమిచ్చారు. ఉపాధి హమీ పథకంలో అవినీతి జరుగుతోందని, లోపాలను సరిచేయడానికే బిల్లును తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇప్పటి అవసరాలకు తగ్గట్టుగా పథకంలో మార్పులు చేస్తున్నామని, స్థిరాస్తులను సృష్టించడం, గ్రామాలను మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేయడం పథకం ఉద్దేశమని వివరించారు. గాం«దీజీ ఆదర్శాలను మోదీ ప్రభుత్వం పాటిస్తోందని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు సాధించడానికి ఎన్నో ప్రథకాలు అమలు చేస్తోందని గుర్తుచేశారు. రాజకీయ లబ్ధి కోసం గాంధీజీ పేరు వాడుకోవద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు.
రాముడి పేరుపై ఎందుకంత అసహనం?
విస్తృతమైన సంప్రదింపుల తర్వాతే జీ రామ్ జీ బిల్లును రూపొందించామని శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పష్టంచేశారు. గ్రామీణ ఉపాధికి ప్రభుత్వం దాదాపు రూ.11 లక్షల కోట్లు ఖర్చు చేయనుందని చెప్పారు. ఈ నిధులను నీటి సంరక్షణ, గ్రామీణ, జీవనోపాధి సంబంధిత మౌలిక సదుపాయాలు, ప్రతికూల వాతావరణ సమస్యలను పరిష్కరించే పనుల కోసం వెచ్చించబోతున్నట్లు వెల్లడించారు.అనంతరం ఆయన బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సభలో బిల్లు ప్రతులను చించివేసి దుర్మార్గుల్లా ప్రవర్తించారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని గూండాయిజంగా మారుస్తారా? అని ప్రశ్నించారు. బిల్లుకు జీ రామ్ జీ అని పేరు పెడితే తప్పేమిటని ప్రశ్నించారు. పేరుపై రాద్ధాంతం అవసరం లేదని అన్నారు. ప్రతిపక్షాలు కేవలం పేరును పట్టుకొని వేలాడుతున్నాయని, తాము మాత్రం పనిపై దృష్టి పెట్టామని స్పష్టంచేశారు. రాముడి పేరు వినిపిస్తే ఎందుకంత అసహనం? అని నిలదీశారు.
విపక్షాల నిరసన ర్యాలీ
జీ రామ్ జీ బిల్లును పార్లమెంటరీ కమిటీ పరిశీలకు పంపించాలని లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యుడు కె.సి.వేణుగోపాల్ కోరారు. స్పీకర్ ఓం బిర్లా అందుకు అంగీకరించలేదు. దీనిపై మాట్లాడేందుకు అన్ని పారీ్టల సభ్యులకు అవకాశం ఇస్తున్నామని చెప్పారు. బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో విపక్ష సభ్యులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రేరణ స్థలంలోని గాం«దీజీ విగ్రహం నుంచి మకరద్వారా వరకూ నడిచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఉపాధి హామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం హత్య చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు.
రాజ్యసభలో బిల్లు..
జీ రామ్ జీ బిల్లును కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ గురువారం మధ్యాహ్నం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. బిల్లును ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకించారు. సమగ్ర పరిశీలన కోసం పార్లమెంటరీ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశారు. బిల్లులో సవరణలు సూచించడానికి తగినంత సమయం ఇవ్వాలని కోరారు. సుదీర్ఘ చర్చ తర్వాత మూజువాణి ఓటుతో అర్ధరాత్రి దాటాక రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది.
పార్లమెంట్‌లో...
→ ప్రతి పక్షాల తీవ్ర నిరసనల మధ్య ‘జీ రామ్ జీ’ బిల్లు లోక్‌సభలో మూజువాణి ఓటుతో గట్టెక్కింది.
→ సభలో ప్రతిపక్ష సభ్యులు బిల్లు ప్రతులను చించివేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
→ అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.
→ రాజ్యసభలో అర్ధరాత్రి దాటాక జీరామ్‌జీ బిల్లు ఆమోదం పొందింది.
→ అణు ఇంధన రంగంలో ప్రైవేట్ సంస్థలకు ప్రవేశం కల్పిచడానికి ఉద్దేశిచిన ‘శాంతి’ బిల్లుకు పార్లమెంట్ జై కొట్టింది. బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు గురువారం రాజ్యసభలో ఓకే అయ్యింది.
→ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో ‘సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్ బిల్లు’ను ప్రవేశపెట్టారు.
→ స్వల్ప చర్చ అనంతరం ఈ బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపించాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు.


