
బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ(75) ఇంకెంత కాలం రాజకీయాల్లో కొనసాగుతారు? అనే సూటి ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. బీజేపీలో ఒక వయసు దాటాక సీనియర్లను పక్కన పెడుతుండడం ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది. అయితే..
మోదీ(Modi Retirement) విషయంలో మాత్రం బీజేపీ, దాని మాతృ సంస్థ ఆరెస్సెస్ ఆ పనిని ఎందుకు చేయకపోతున్నాయంటూ ప్రతిపక్షాలు సైతం విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు మోదీ సైతం తన రిటైర్‌మెంట్‌పై ఏనాడూ పెదవి విప్పింది లేదు. ఈ తరుణంలో రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం లేకపోలేదు.
ఆఫ్రికా దేశం మొరాకోలో పర్యటించిన తొలి భారత రక్షణ శాఖ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ చరిత్ర సృష్టించారు. ఈ తరుణంలో ఆ పర్యటనలో ఉన్న ఆయన.. ఓ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలపై స్పందించారు. ఆ సమయంలో మోదీ భారత ప్రధానిగా ఇంకెంత కాలం రాజకీయాల్లో కొనసాగుతారు? అని రాజ్‌నాథ్ సింగ్‌ను యాంకర్ ప్రశ్నించింది. దానికి ఆయన బదులిస్తూ.. ‘‘2029, 2034, 2039, ఆపై 2044లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు కూడా నరేంద్ర మోదీనే బీజేపీ ప్రధాని అభ్యర్థి అని, 2047లో వికసిత్ భారత్(Viksit Bharat 2047) లక్ష్యాన్ని సాధించిన తర్వాతే విరమణ తీసుకుంటారు’’ అని బదులిచ్చారు.
మోదీ ఒక వ్యక్తి మాత్రమే కాదు భారత అభివృద్ధి లక్ష్యానికి ప్రతీక. ఆయన నాయకత్వంలో భారత్ శాంతి, శక్తి.. ఈ రెండింటికీ ప్రతినిధిగా మారింది. ఆయన సారథ్యంలోనే.. భారత తయారీ సామర్థ్యం ప్రపంచ స్థాయికి చేరింది. వికసిత్ భారత్‌ను మోదీ వ్యక్తిగత లక్ష్యంగా తీసుకున్నారు. కాబట్టి ఆయన సాధించేవరకు నాయకత్వం వదలబోరు. 2047లో మన దేశానికి స్వాతంత్రం వచ్చి వందేళ్లు పూర్తవుతుంది. వికసిత్ బారత్ లక్ష్యాన్ని చేరుకుంటాం. అప్పుడే ఆయన రిటైర్ అవుతారు అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. తద్వారా.. మోదీ విషయంలో బీజేపీ అసాధారణ మినహాయింపులు ఇచ్చిందనే విషయాన్ని పరోక్షంగా అంగీకరించారాయన.
🚨 BIG STATEMENT 🚨
RM Rajnath Singh: “PM Narendra Modi will be BJP’s PM candidate in 2029, 2034, 2039 & even 2044.” 🎯
“He will retire only after achieving the goal of a Viksit Bharat by 2047.” 🇮🇳 pic.twitter.com/f2xHicpnzB— Megh Updates 🚨™ (@MeghUpdates) September 21, 2025
మొరాకా పర్యటనలో ఉన్న రాజ్‌నాథ్ సింగ్.. ఆఫ్రికా ఖండంలోనే భారత్ తరఫున మొదటి రక్షణ తయారీ కేంద్రం ప్రారంభించారు. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ మొరాక్ పేరిట.. ఇరు దేశాల మధ్య రక్షణ పరిశ్రమ, శిక్షణ, సాంకేతిక మార్పిడి అంశాల్లో ఎంవోయూ కుదిరింది. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్-మహమ్మద్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ కలిపి ఈ కేంద్రాన్ని రూపొందించాయి. దీని ద్వారా ఏటా 100 యుద్ధ వాహనాలను(WhAP 8x8) తయారు చేయబోతున్నారు.
ఇదీ చదవండి: రాజకీయాలు వదిలేశాక ఆ పని చేస్తా-అమిత్ షా