
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి విరమణ అనంతరం తన భవిష్యత్ ప్రణాళికపై ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. గుజరాత్ అహ్మదాబాద్ వేదికగా ఆయన ఈ ప్రకటన చేశారు.
న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా(60) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విరమణ అనంతరం అనంతరం భవిష్యత్ ప్రణాళికపై ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. వేదాలు, ఉపనిషత్తులు చదవడంతోపాటు ప్రకృతి వ్యవసాయంపై దృష్టిపెడతానని అన్నారాయన.
గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల సహకార సంఘాల మహిళలతో బుధవారం అహ్మదాబాద్‌లో జరిగిన 'సహకార్ సంభాద్' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రిటైర్మెంట్ తర్వాత వేదాలు, ఉపనిషత్తులు చదవడంతోపాటు, ప్రకృతి వ్యవసాయానికే సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకున్నా. రసాయన ఎరువులతో పండించే పంటలతో వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రకృతి వ్యవసాయం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శరీరాన్ని వ్యాధులకు దూరంగా ఉంచడంతోపాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుంది అని అన్నారాయన.
సహకార శాఖ మంత్రిగా తన ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉందని అమిత్ షా పేర్కొన్నారు. ‘‘హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ముఖ్యమైన శాఖ ఇచ్చారని అందరూ అన్నారు. కానీ, సహకారశాఖ మంత్రి బాధ్యతలు అప్పగించినప్పుడు మాత్రం.. హోంశాఖ కంటే పెద్ద శాఖ ఇచ్చారని నేను భావించా. ఎందుకంటే ఈ శాఖ దేశంలోని రైతులు, పేదలు, గ్రామాలు, పశుసంపద కోసం పనిచేస్తుంది’’ అని షా సంతోషంగా చెప్పారు. అయితే రిటైర్మెంట్ ఎప్పుడనేది మాత్రం ఆయన చెప్పలేదు.
సహకార శాఖ మంత్రిగా.. 2021లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వ శాఖకు అమిత్ షా తొలి మంత్రిగా నియమితులయ్యారు. సహకార్ సే సమృద్ధి అనే నినాదంతో ఈ శాఖ గ్రామీణ అభివృద్ధికి దోహదం చేస్తోంది. ఈ శాఖ ఏర్పాటునకు ముందు వ్యవసాయ శాఖ సహకార సంఘాల కార్యకలాపాలను చూసుకునేది.
అమిత్ షా రాజకీయ ప్రస్థానం..
1980లలో RSS (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) ద్వారా సామాజిక సేవలోకి ప్రవేశించారు. 1983లో ABVP (RSS విద్యార్థి విభాగం)లో చేరారు. 1987లో భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. యువజన విభాగమైన బారతీయ జనతా యువ మోర్చాలో కీలక పాత్ర పోషించారు. 1997లో గుజరాత్‌లోని సర్కేజ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. గుజరాత్‌లో 2002–2010 మధ్య హోం, న్యాయ, ట్రాన్స్‌పోర్ట్, జైలు, నిషేధం వంటి పలు శాఖల మంత్రిగా పనిచేశారు.
నరేంద్ర మోదీతో షాకు బలమైన అనుబంధం ఉంది. గుజరాత్ రాజకీయాల్లో మోదీకి అత్యంత విశ్వసనీయుడిగా ఎదిగారు. మోదీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎదిగే దారిలో కీలక పాత్ర పోషించారు. 2014లో BJP జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన వ్యూహాలతోనే BJP అనేక రాష్ట్రాల్లో విజయం సాధించింది. 2014 & 2019 లోక్‌సభ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. యూపీలో 2019 ఎన్నికల్లో 303 సీట్లు గెలవడమూ(2014లో 71 సీట్లు) అమిత్ షా వ్యూహాత్మక నాయకత్వ ఫలితమే. 2019లో హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్టికల్ 370 రద్దు, CAA వంటి కీలక నిర్ణయాల్లో కీలక భూమిక పోషించారు. 2021లో కేంద్రం కొత్తగా తెచ్చిన సహకార మంత్రిత్వ శాఖకు తొలి మంత్రిగా నియమితులయ్యారు.