న్యూఢిల్లీ: ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో భాగంగా చివరిరోజున కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేయడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏఐ సదస్సులో యువ కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు లేకుండా నిరసన చేపట్టారు. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ .. ఇది ఎటువంటి మేధస్సులేని, భావోద్వేగంలేని చర్యగా అభివర్ణించింది.
ఈ సమ్మిట్ ఐదవరోజు శుక్రవారం(ఫిబ్రవరి 20వ తేదీ) భారత్ అధికారికంగా అమెరికా ప్రధాన ఏఐ ప్రాజెక్ట్ Pax Silicaలో చేరింది. ఇది అమెరికా యొక్క కృత్రిమ మేధస్సు-సరఫరా గొలుసు భద్రతకు సంబంధించిన ప్రధాన కార్యక్రమం. అయితే దీనిపై కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. భారత మండపం (ప్రగతి మైదాన్, న్యూఢిల్లీ)లో ఆఖరిరోజు సదస్సులో భాగంగా యూత్ కాంగ్రెస్ సభ్యులు చొక్కాలు విప్పి నినాదాలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తూ నినాదాలు చేశారు. జాతీయ ప్రయోజనాల కంటే కార్పొరేట్ ప్రయోజనాలే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువైపోయాయంటూ పలువురు నిరసనలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి 10 మంది కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై బీజేపీ తీవ్రంగా ధ్వజమెత్తింది. ఇది చొక్కాలు లేని నిరసనే కాదు.. బుర్రలేని నిరసన అంటూ కౌంటర్ ఇచ్చింది బీజేపీ.
చివరి రోజు సమ్మిట్‌లో భాగంగా భారత విద్యా వ్యవస్థపై పునరాలోచించడం, అమెరికా-భారత్ భాగస్వామ్యం ద్వారా AI యుగానికి శక్తినివ్వడం, చర్చలు-రాజనీతిలో ఏఐ వినియోగం తదితర అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది.


