ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రేవంత్ తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్‌ను అభినందిస్తున్న సోనియాగాంధీ. ఆరు గ్యారంటీల అమలు గురించి తెలుసుకున్నారా? అంటూ కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. గ్యారెంటీలు, హామీల అమలు వదిలేసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారంటూ లేఖలో దుయ్యబట్టారు.
‘‘తెలంగాణ అభివృద్ధి పేరిట విజన్ డాక్యుమెంట్‌తో కొత్త పల్లవి అందుకున్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన గ్యారెంటీలను గాలికి వదిలేశారా? 420 హామీలను మూసినదిలో కలిపేశారా? గతంలో ఇచ్చిన హామీలపై నిలబడాలి. లేదంటే ప్రజల ఆగ్రహం మీ పాలిట భస్మాసుర హస్తమవుతుంది. గ్యారెంటీలపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి. మోసానికి పాల్పడితే గుణపాఠం తప్పదు’’ అంటూ కిషన్‌రెడ్డి హెచ్చరించారు.
‘‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికైనా కొత్త ఊహలు, కొత్త ఆశలు, కొత్త హామీలు కల్పించేముందు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ఇచ్చిన మాట మీద నిలబడాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా గ్యారంటీల పేరుతో రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలి’’ అని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.


