మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో తీవ్రమైన మానసిక వేధింపుల కారణంగా ఉసురుతీసుకున్న మాజీ మిస్ పుణే, నటి త్విషా శర్మ (34) కేసుకు సంబంధించిన అనేక షాకింగ్ వివరాలను సీబీఐ తన దర్యాప్తులో వెల్లడించింది. ఆగస్టు 14న దాఖలు చేసిన దాఖలు చేసిన 600 పేజీల ఛార్జ్‌షీట్‌లు పలు కీలక అంశాలను పొందుపర్చింది. ముఖ్యంగా త్విషా శర్మ జీవితంలో చివరి 90 నిమిషాల్లో ఏం జరిగిందనేదానిపై అసాధారణమైన మినిట్ టూ మినిట్ రిపోర్ట్‌ను సమర్పించింది.
త్విషా ఆత్మహత్య కేసులో తీవ్రమైన మానసిక వేధింపుల (Sustained mental cruelty) ద్వారా ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు (Abetment to suicide) భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాల సింగ్ (రిటైర్డ్ జిల్లా జడ్జి)పై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 85, 108, 3(5) కింద కేసు నమోదు చేసింది సీబీఐ.
సమర్థ్ సింగ్, గిరిబాల సింగ్ మానసికంగా ఎంతగా హింసించారంటే, త్విషాకు "ఇక చావు తప్ప మరో మార్గం లేకుండా పోయింది" అని ఏజెన్సీ చివరికి నిర్ధారించింది. అయితే, ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ, సీబీఐ దర్యాప్తు ఇంకా ముగియలేదు.
ఈ కేసులో వాట్సప్ మెసేజ్‌లు, సీసీటీవీ ఫుటేజ్‌లతోపాటు, ఫోన్ కాల్స్, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, వైద్యులు, కౌన్సెలింగ్ సెషన్‌లతో పాటు పలువుర్ని సీబీఐ విచారించింది. దీని ప్రకారం చనిపోయే రోజు రాత్రి 9:36 గంటలకు ట్విషా తన ఆడపడుచుకు "రేపు ఉదయం వచ్చి తన భార్య అవశేషాలను తీసుకెళ్లమని మీ తమ్ముడికి చెప్పింది. నన్నుఇప్పుడు ప్రశాంతంగా చావనివ్వండి" అని వాట్సాప్‌లో పంపిన మెసేజ్ కీలకంగా మారింది. ఆ తరువాత ఆమె ఒంటరిగా టెర్రస్ వైపు వెళ్తుండగా సీసీటీవీలో దృశ్యాలు నమోదయ్యాయి. రాత్రి 10:23 గంటలకు ఆమె భర్త సమర్థ్, అత్త గిరిబాల సింగ్ టెర్రస్ వైపు వెళ్లారు. ఆ తర్వాత ఆమెను AIIMS భోపాల్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
అంతేకాదు చనిపోవడానికి ముందు తల్లిదండ్రులకు ఫోన్ చేసి, తన భర్త సమర్థ్ సింగ్ ఏ మాత్రం మారలేదనీ,మరింత హింసాత్మకంగా మారిపోయాడని,వెంటనే రావాలని ఏడుస్తూ చెప్పింది. తనను ఈ నరకం నుంచి తప్పించలని కూడా వేడుకుంది.
నెలల తరబడి వేధింపులు
గత ఏడాది డిసెంబర్ 9న వివాహం చేసుకున్నారు. పెళ్లయినప్పటి నుంచి త్విషా పాత సంబంధాల ఆధారంగా శారీరక, మానసిక క్షోభకు గురిచేశారు. మాటలతో పొడుచుకుతిన్నారు. విపరీతంగా అనుమానించేవాడని CBI పేర్కొంది. కొడుకుకి సర్ది చెప్పాల్సిన అత్త గిరిబాల కూడా రెచ్చగొడుతూ అతడికే వత్తాసు పలికేది. అలా మానసికంగా వేధించి వేధించి పెళ్లయిన ఐదు నెలల్లోనే ఆమెకు నరకం చూపించారు.
డబ్బుల కోసం, గర్భస్రావం వివాదాలు
గుండెపోటు తర్వాత చికిత్స పొందుతున్న తండ్రి దగ్గర త్విషా షా ఉంటున్నప్పుడు, భోపాల్‌కు తిరిగి రావాలని నిందితులిద్దరూ ఆమెపై ఒత్తిడి చేశారని సీబీఐ ఆరోపిస్తోంది. ఆమె మార్చి 24న తిరిగి వచ్చింది. ఆ తరువాత త్విషా పేరిట ఉన్న రూ. 20 లక్షల డీమ్యాట్ పెట్టుబడులను జాయింట్ అకౌంట్‌కు మార్చాలని భర్త, అత్త ఒత్తిడి తెచ్చారు. ఆమె అందుకు నిరాకరించడంతో వివాదం మరింత ముదిరింది. ఈవిషయాన్ని కూడా తల్లితో చెప్పుకొని బాధపడింది.
ఇంతలో ఆమె (ఏప్రిల్‌లో)గర్భం దాల్చింది. దీంతో అత్తమామలు గర్భస్రావం చేసుకోమని ఒత్తిడి తెచ్చారు. మే 6, 8 తేదీల్లో గర్భస్రావం (MTP) మందులు తీసుకున్నారు. ఆతరువాత మాటమార్చిన అత్త హంతకి అని నిందించడం, భర్త అది తన బిడ్డేనా అని అనుమానించడం ఆమెను మరింత కృంగిపోయింది. కానీ ఎలాగైనా ఈనరకం నుంచి బయటపడాలని శతవిధాలా ప్రయత్నించింది. మళ్లీ ఉద్యోగం చేయాలని నిర్ణయించుకొని, ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
ఊరికి వెళ్లిపోయినా బతికేదేమో..!
మే 12 ఉదయం త్విషా తన పుట్టింటికి వెళ్లేందుకు రూ. 3,000 పెట్టి రైలు టికెట్ బుక్ చేసుకుంది. కానీ కౌన్సెలింగ్‌కు భర్త అంగీకరించడంతో ఆగిపోయింది. కౌన్సెలింగ్ తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు లేకపోవడంతో ఆమె తీవ్ర నిరాశకు లోనైంది.
AIIMS ఢిల్లీ నిర్వహించిన రెండవ పోస్టుమార్టం నివేదికలోఇది ఉరివేసుకోవడం వల్ల సంభవించిన ఆత్మహత్య అని, ఎలాంటి దాడి గాయాలు లేవని తేలింది. త్విషా ఐఫోన్ రికవరీ, CCTV డేటా, వాయిస్ శాంపిల్స్ పరిశీలన ,కట్నం వేధింపుల కోణంలో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. దర్యాప్తు సమయంలో స్వాధీనం చేసుకున్న ఆడియో రికార్డింగ్‌లతో పోల్చడానికి సమర్థ్ , గిరిబాల వాయిస్ నమూనాలను పరిశీలిస్తున్నారు.


