పవన్‌ను దించేసి.. ఎమ్మెల్యేను ఎక్కించారు! | Municipal Commissioner Srinivasa Viswanath Saluting a Photo Of Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌ను దించేసి.. ఎమ్మెల్యేను ఎక్కించారు!

Sep 26 2026 11:00 AM | Updated on Sep 26 2026 11:19 AM

Municipal Commissioner Srinivasa Viswanath Saluting a Photo Of Pawan Kalyan

ప్రొద్దుటూరు(వైఎస్‌ఆర్‌ జిల్లా ): అధికారంలో ఎవరుంటే వారి కాళ్ల కింద తివాచీ పరచడం, సీట్లలో ఎవరు కూర్చుంటే వారి ఫొటోలకు దండలేయడం కొందరు అధికారులకు వెన్నతో పెట్టిన విద్య.  ప్రొద్దుటూరు మున్సిపల్‌ కమిషనర్‌ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌ కూడా ఇప్పుడు ఇదే ‘రాజకీయ భక్తి’ మార్గంలో నడుస్తూ బ్యూరోక్రసీ చరిత్రలోనే నిలిచిపోయే సరికొత్త వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు. కమిషనర్‌ ఛాంబర్‌లో రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఫొటో ఉండేది. అయితే స్థానిక కూటమి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డిపై ఉన్న అమితమైన ‘ప్రేమ’ కొద్దీ, పవన్‌ ఫొటోను గుట్టుచప్పుడు కాకుండా పక్కనబెట్టి.. అదే స్థానంలో ఎమ్మెల్యే ఫొటోను తగిలించేశారు. ప్రభుత్వ ప్రొటోకాల్‌ను, నిబంధనలను బూజు పట్టిన కాగితాల్లా పక్కన పారేసి, స్థానిక బాస్‌ను ప్రసన్నం చేసుకునేందుకు కమిషనర్‌ పడిన తాపత్రయం అంతా ఇంతా కాదు. 

నెటిజన్ల షాక్‌.. కమిషనర్‌ యూ–టర్న్‌ డ్రామా 
అయితే, ఈ ‘ఫొటో మార్పిడి’ వ్యవహారాన్ని గమనించిన కొందరు నెటిజన్లు శుక్రవారం ఉదయం సోషల్‌ మీడియాలో కమిషనర్‌ అత్యుత్సాహంపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్‌ మొదలుపెట్టారు. డిప్యూటీ సీఎం ఫొటో తీసేసి ఎమ్మెల్యే ఫొటో పెట్టడం ఏ చట్టంలో ఉందంటూ నెటిజన్లు ప్రశ్నించేసరికి కమిషనర్కు ఒక్కసారిగా చెమటలు పట్టాయి. వెంటనే తప్పు తెలుసుకున్న ఆయన.. పక్కన పారేసిన పవన్‌ కళ్యాణ్‌ ఫొటోను చకచకా తెచ్చి మళ్లీ పాత స్థానంలోనే తగిలించారు. అంతటితో ఆగకుండా, ఆ ఫొటోకు భక్తిశ్రద్ధలతో సెల్యూట్‌ చేస్తూ.. ‘సెల్యూట్‌ బాస్‌.. మనది విడదీయరాని బంధం, గుండెల్లో గూడు కట్టుకున్న అనుబంధం. అందుకో నా సెల్యూట్‌ బాస్‌.. మా పవన్‌ బాస్‌’ అంటూ తన అధికారిక సోషల్‌ మీడియా గ్రూపుల్లో కవిత్వాలు, పోస్టులు గుప్పించారు. 

రాజకీయాలు చేయాలనుకుంటే రాజీనామా చెయ్‌: ప్రజా సంఘాల ఆగ్రహం 
మున్సిపల్‌ కమిషనర్‌ హోదాలో ఉండి ఒక రాజకీయ నాయకుడిలా పవన్‌ కళ్యాణ్‌కు ఈ స్థాయి భజన చేస్తూ ఎలా పోస్టులు పెడతారంటూ దీనిపై ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి.ఎమ్మార్పీఎస్  రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్‌ మాదిగ, జాతీయ మాలమహానాడు అధ్యక్షుడు గోసా మనోహర్, దళిత సంఘం నాయకుడు ఎమ్మన్యుయేల్‌ కమిషనర్‌ వ్యవహార శైలిపై నిప్పులు చెరిగారు. కూటమి నేతలపై అంతగా ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి, నేరుగా ఆ పార్టీల్లో చేరి జెండాలు మోసుకోవాలని ఘాటుగా విమర్శించారు. 

మరో తప్పు.. అంబేద్కర్‌తో పోలికా?! 
ప్రజా సంఘాల నుంచి విమర్శలు మరింత ముదరడంతో కమిషనర్‌ కంగారులో మరో తప్పిదానికి తెరలేపారు. ఈ వివాదాన్ని డైవర్ట్‌ చేయడానికి.. తాను గతంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నమస్కరిస్తున్న ఒక పాత ఫొటోను తీసుకొచ్చి మళ్లీ అదే గ్రూపులో పోస్ట్‌ చేశారు. ఈ చర్యతో ప్రజా సంఘాల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దేశానికి రాజ్యాంగం రాసిన మహనీయుడు బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ను, ఒక రాజకీయ పార్టీ నాయకుడైన పవన్‌కళ్యాణ్‌ను ఒకే తాటిపై తెచ్చి పోలుస్తారా?ఎంతటి అజ్ఞానం అంటూ వారు తప్పుబ ట్టారు. కుర్చీ కాపాడుకోవడానికి ప్రొటోకాల్‌ను ఖూ నీ చేసి,దొరికిపోయాక కవర్‌ చేసుకోవడానికి అంబేద్కర్‌ ను వాడుకుంటున్న కమిషనర్‌ తీరుపై ఇప్పుడు సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ సాగుతోంది. 

ఇదీ చదవండి: టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డికి భారీ షాక్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement