మళ్లీ అదే గోప్యత.. ఎక్కడికి వెళ్లారో చెప్పని ప్రభుత్వం
ఉద్యోగులకు తుపాన్ ఎమర్జెన్సీ రూల్స్
చంద్రబాబుకు మాత్రం వర్తించని వైనం
సోషల్ మీడియాలో చర్చకు దారితీసిన సీఎం పర్యటన
సాక్షి, అమరావతి: తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారన్న వార్తలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆయన ఏ దేశానికి వెళ్లారు? ఎక్కడ బస చేస్తారు? అనే కనీస సమాచారాన్ని కూడా ప్రభుత్వం బయటపెట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మూడు రోజులపాటు ఎక్కడ ఉంటారో ప్రజలకు తెలియని పరిస్థితి నెలకొనడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తుపాన్, భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర సహా పలు జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సహాయక చర్యలు, నష్టం అంచనా, బాధితులకు పరిహారం వంటి పనులు ఇంకా కొనసాగాల్సిన సమయంలో ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని వీడి వెళ్లడమేమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
గతంలోనూ రహస్యమే..
చంద్రబాబు విదేశీ పర్యటనలపై గోప్యత ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది జనవరిలో నూతన సంవత్సర వేళ ఆయన విదేశాలకు వెళ్లినప్పుడు కూడా పర్యటన వ్యక్తిగతమా? అధికారికమా? అన్నది ప్రభుత్వం స్పష్టం చేయలేదు. ఆయన పర్యటన లండన్, సింగపూర్, బాలి అంటూ రకరకాల ప్రచారాలు జరిగాయి. సాధారణ పరిపాలన శాఖకే సమాచారం లేదన్న విమర్శలు కూడా వచ్చాయి. తన జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పుకునే ముఖ్యమంత్రి తన పర్యటనల విషయంలో ఎందుకింత రహస్యం పాటిస్తున్నారన్న ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు.
ఉద్యోగికి ఒక న్యాయం.. సీఎంకు మరో న్యాయం
తుపాన్ అత్యవసర పరిస్థితుల్లో విధులకు ఆటంకం కలిగించారంటూ శ్రీకాకుళం జిల్లాలో గ్రామ సర్వేయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుబాబును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ‘ఆదివారం సెలవు రోజున తలపెట్టిన శాంతియుత నిరసనకు పిలుపు ఇవ్వడమే తప్పుగా భావించి’ మధుబాబుపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడింది. ‘తుపాన్ ఎమర్జెన్సీ’ పేరుతో వేటువేసింది. ఇంతటి తుపాన్ తీవ్రత ఉన్నప్పుడు.. సీఎం కుటుంబంతో విదేశాలకు వెళ్లడం ఏమిటని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. నిబంధనలు ఉద్యోగులకేనా, పాలకులకు వర్తించవా అని నిలదీస్తున్నాయి.
కుటుంబంతో విదేశాలకు సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంతోసహా విదేశాలకు వెళ్లినట్లు తెలిసింది. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఈ పర్యటన ఉంటుందని, ఇది పూర్తిగా వ్యక్తిగతమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి ఏ దేశానికి వెళ్లారు? ఎక్కడ బస చేస్తారు? అనే అంశాలపై కనీస సమాచారం కూడా ప్రభుత్వం బయటపెట్టకపోవడం గమనార్హం.


