పెట్టుబడి గల్లంతు! | Thousands of acres of crops submerged in heavy rains | Sakshi
Sakshi News home page

పెట్టుబడి గల్లంతు!

Sep 26 2026 5:06 AM | Updated on Sep 26 2026 5:06 AM

Thousands of acres of crops submerged in heavy rains

అన్నదాతలకు కోలుకోలేని దెబ్బ   

వేల ఎకరాల్లో నీట మునిగిన పంటలు  

వరి నుంచి మిరప వరకు ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.2.50 లక్షల వరకు నష్టం  

పంట చేతికొచ్చిన దశలో అరటి రైతుకు శరాఘాతం 

ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి, కృష్ణా ప్రాంతాల్లో రైతుల కన్నీరు 

ఉచిత పంటల బీమా ఉండి ఉంటే బావుండేదని ఆవేదన 

ఎడతెగని వర్షంతో పలు చోట్ల రహదారులు జలమయం 

వేర్వేరు ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో 12 మంది మృతి  

వంశధార, నాగావళిలో కొనసాగుతున్న వరద ఉధృతి 

ప్రకాశం బ్యారేజ్‌ గేట్లన్నీ ఎత్తి 47,125 క్యూసెక్కులు దిగువకు విడుదల

నాగావళి ఉగ్రరూపం  

ముంచెత్తిన ఒడిశా వర్షాలు 

ఉమ్మడి విజయనగరం జిల్లాలో ముంపులో పంటపొలాలు, తీర గ్రామాలు 

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/చింతూరు/ సాక్షి, పాడేరు/నెట్‌వర్క్, : భారీ వర్షాలు, గాలులతో ఉత్తరాంధ్ర రైతుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. పొలాల్లో నీరు నిలవడంతో పంటలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి.  రైతులు పెట్టిన పెట్టుబడి అంతా నీటిపాలైంది. పొలాల్లోంచి నీళ్లు వెళ్లిపోయాక పంటలు ఏ మేరకు కోలుకుంటాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రధానంగా గోదావరి, కృష్ణా డెల్టాల్లో సాగైన వరి పంట ముంపు బారిన పడింది. ఎకరాకు సుమారు 20–25 క్వింటాళ్ల దిగుబడిని పరిగణనలోకి తీసుకుంటే, క్వింటాల్‌కు రూ.2,300 చొప్పున ఉత్పత్తి విలువ సుమారు రూ.46 వేల నుంచి రూ.57,500 వరకు ఉంటుంది. 

దీనికి ఎకరాకు రూ.25–35 వేల వరకు పెట్టుబడి కలిస్తే.. పంట పూర్తిగా దెబ్బతిన్న సందర్భంలో రైతుపై సుమారు రూ.70 వేల వరకు నష్టం పడే అవకాశం ఉంది. మొక్కజొన్న ఎకరాకు 25–30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని పరిగణిస్తే.. పంట పూర్తిగా మునిగితే ఉత్పత్తి విలువతో పాటు రూ.25–32 వేల వరకు పెట్టిన పెట్టుబడి కూడా రైతుకు తిరిగి రాకుండా పోతుంది. మొత్తం నష్టం ఎకరానికి సుమారు రూ.45–55 వేల పరిధిలో ఉండే అవకాశం ఉంది. పత్తి పంటలో విత్తనం, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు అధికంగా ఉండటంతో పెట్టుబడి భారం ఎక్కువ. 

ఎకరాకు రూ.30–40 వేల వరకు పెట్టుబడి పెట్టే పరిస్థితుల్లో పంట పూర్తిగా దెబ్బతింటే దిగుబడి విలువతో కలిపి రైతుకు సుమారు ఎకరానికి రూ.50–75 వేల వరకు నష్టం సంభవించే అవకాశం ఉంది. మిరప సాగులో పెట్టుబడి ఇతర పంటలతో పోలిస్తే ఎక్కువ. ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.90 వేల వరకు ఖర్చు అయ్యే పరిస్థితుల్లో పంట పూర్తిగా పోతే పెట్టుబడి నష్టంతో పాటు చేతికందాల్సిన ఉత్పత్తి విలువ కూడా కోల్పోవాల్సి ఉంటుంది. దీంతో ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు నష్టం తప్పదు. 

అరటి తోటల్లో పంట పూర్తిగా దెబ్బతింటే ఇప్పటికే చేసిన పెట్టుబడితో పాటు మార్కెట్‌కు రావాల్సిన ఉత్పత్తి కూడా కోల్పోవాల్సి ఉంటుంది. తోట వయసు, సాగు విధానం, దిగుబడి ఆధారంగా ఎకరాకు రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు నష్టం సంభవించే అవకాశం ఉంది. వంకాయ, బెండ, టమాటా తదితర పంటలు కుళ్లిపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా పంట పోతే ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు నష్టం తప్పదని కన్నీటి పర్యంతం అవుతున్నారు.   

ఆశలు నేలకూలాయి  
ఈ రైతు పేరు కూనిబిల్లి మోహనరావు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ గ్రామం. 14 ఎకరాల్లో బొప్పాయి తోట వేశాడు. మంచి కాపు వచ్చింది. పంట చక్కగా చేతికి వస్తుందని సంతోష పడుతున్న సమయంలో వర్షం, రాకాసి గాలుల ధాటికి చెట్లు సగానికి విరిగిపడ్డాయి. మరికొన్ని పూర్తిగా నేలకూలాయి. రూ.50 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతు మోహనరావు కన్నీటి పర్యంతం అయ్యాడు. ప్రభుత్వం వెంటనే ఆదుకో వాలని కోరుతున్నాడు.  

అధికారిక అంచనాలే కీలకం 
పంట పూర్తిగా మునిగినప్పుడు రైతుకు నష్టం కేవలం పొలంలో కనిపించే పంట విలువకే పరిమితం కాదు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీలకు పెట్టిన డబ్బు కూడా తిరిగి రాదు. మరోవైపు అదే భూమిలో తిరిగి సాగు చేయాలంటే కొత్తగా పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో ఒకే సీజన్‌లో రైతుపై రెండు వైపులా ఆర్థిక భారం పడుతుంది. ప్రస్తుతం పేర్కొన్న నష్టం గణాంకాలు పంట పూర్తిగా దెబ్బతిన్నట్లయితే వచ్చే ప్రాథమిక ఆర్థిక అంచనాలు మాత్రమే. 

వాస్తవ నష్టాన్ని పంటల వారీగా, మండలాల వారీగా క్షేత్ర స్థాయి ఎన్యూమరేషన్‌ అనంతరం మాత్రమే నిర్ధారణకు వస్తాయి. ముఖ్యంగా వరి పంటలో ముంపు వ్యవధి, పంట దశ, నేలవాలిన పరిస్థితి, గింజ నాణ్యత ఆధారంగా నష్టం మారుతుంది. రెండు రోజుల వాన.. రెండు రకాల నష్టం. ఒకటి ఇప్పటికే పెట్టిన పెట్టుబడి.. మరొకటి చేతికందాల్సిన పంట. ఈ రెండూ పోతే రైతు మళ్లీ సాగు చేసే పరిస్థితి లేదు. ఇప్పటివరకు అందిన ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 30 వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. 

ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 18148 ఎకరాల్లో వరి, 1147 ఎకరాల్లో మొక్కజొన్న, 235 ఎకరాల్లో పత్తి, 1575 ఎకరాల్లో ఉద్యాన పంటలు.. మొత్తం 21,107 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో 1,842 ఎకరాలు, కాకినాడ జిల్లాలో 1,885 ఎకరాల్లో వరి నీట మునిగింది. నాగావళి, వంశధార ముంపు గ్రామాలు, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల లెక్కలు తేలితే నష్టం మరింత పెరగనుంది. 

పలు కుటుంబాల్లో విషాదం 
తీవ్ర వాయుగుండం రాష్ట్రంలో మృత్యు ఘోషను మిగిల్చింది. మూడు రోజులపాటు కురిసిన వర్షాలు రాష్ట్రంలో 12 మందిని బలిగొన్నాయి. శుక్రవారం కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చినవలసలో వర్షానికి నానిన ఇంటి గోడ కూలి లక్ష్మీనారాయణ (8) అనే బాలుడు కన్ను మూశాడు. పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలంలో శుక్రవారం కొండవాగు దాటుతుండగా బలిజ సుబ్బమ్మ (70) ప్రవాహంలో కొట్టుకుపోయారు. 

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదకడలో ఎడతెరిపి లేని వర్షం, చలికి తాళలేక సమిరెడ్డి పరదేశమ్మ (65), నంగిరెడ్డి లక్మం నాయుడు (63) మృతి చెందారు. వాయుగుండం తీరం దాటకముందే పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలో పొంగిపొర్లుతున్న తోటపల్లి కాలువలో విజయవాడకు చెందిన యువకుడు హేమంత కృష్ణ గల్లంతయ్యాడు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కేర్‌ పురం సమీపంలోని తూర్పు కాలువలో గురువారం రాత్రి పూనెం భాస్కరరావు కొట్టుకుపోయాడు. శుక్రవారం అతని మృతదేహం బయటపడింది.  

పోటెత్తుతున్న గోదావరి  
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద శుక్రవారం సాయంత్రానికి 4.11 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. శనివారం రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద చేరుతుందని, ఆదివారం రాత్రి నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో కోనసీమ లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. కృష్ణా నదికి వరద రావడంతో ప్రకాశం బ్యారేజీ గేట్లన్నీ ఎత్తి 47,125 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.  

నాగావళి ఉగ్రరూపం
మూడు రోజులుగా ఒడిశాలో కురుస్తోన్న వర్షాలకు ఉమ్మడి విజయనగరం జిల్లాలోని నాగావళి, జంఝావతి, సువర్ణముఖి, వేగావతి నదులు ఉగ్రరూపం దాల్చాయి. తోటపల్లి, జంఝావతి, మడ్డువలస ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండడంతో వచ్చి న నీటిని వచ్చినట్టుగా కిందకు విడిచిపెడుతున్నారు. దీంతో నదీతీర గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. 

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం దేవునిగుంప గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సోమేశ్వరుని ఆలయం పూర్తిగా మునిగిపోయింది. తోటపల్లి బ్యారేజ్‌ నుంచి ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు పాటించకుండా 45వేల క్యూసెక్కుల పైబడి వరదనీటిని కిందకు విడిచిపెట్టడంతో ఒక్కసారిగా నాగావళి పొంగి వరద బీభత్సం సృష్టించింది. దీంతో నాగావళి నది తీర గ్రామాలైన అంపిలి, అన్నవరం, ఎరకరాయపురం, మంగళాపురం గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.  

సిక్కోలును ముంచెత్తిన వరద 
ఒడిశా వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలోని మూడు నదీ పరీవాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగా, మధ్యాహ్నం 1.15గంటల తర్వాత నాగావళికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నారాయణపురం ఆనకట్టకు మధ్యాహ్నం 1.15 గంటలకు 70వేల క్యూసెక్కుల వరద రావడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 73,800 క్యూసెక్కుల వరకు ఇన్‌ఫ్లో వచ్చింది. ఉదయం 8 గంటలకు మొదట ప్రమాద హెచ్చరిక జారీ చేయగా, మధ్యాహ్నం ఒంటి గంటకు నాగావళిలో నీటి ప్రవాహం భారీగా పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయక తప్పలేదు. ఉదయం 8 గంటలకు వంశధారకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.తోటపల్లి వద్ద కూడా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని 28 మండలాల్లో 382 గ్రామాల్లో పంట నీట మునిగింది. 12,041.76 హెక్టార్లలో పంటలు నీట మునిగాయి.   

పోటెత్తిన శబరినది 
ఎగువనున్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి వరద నీటితో పాటు డొంకరాయి జలాశయం నుంచి విడుదల చేసిన నీటితో పోలవరం జిల్లా చింతూరు డివిజన్‌ పరిధిలోని శబరినది ఒక్కసారిగా పోటెత్తింది. చింతూరు వంతెన వద్ద గురువారం రాత్రి 32 అడుగులుగా ఉన్న శబరి నీటిమట్టం శుక్రవారానికి 41 అడుగులకు పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద మరింత పెరుగుతుందనే అధికారుల ప్రకటనతో నదీ పరీవాహక గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. చింతూరు మండలం కుయిగూరు, సోకిలేరు, జల్లివారిగూడెం, చంద్రవంక, చీకటి వాగులు పొంగి వరదనీరు గ్రామాల్లోకి ప్రవేశించింది.

అప్పులే మిగిలాయి
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు గురాన అయ్యప్ప. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కలిశెట్టిబడి గ్రామం. ఈయన రెండు ఎకరాల్లో అరటి పంట సాగు చేశాడు. తుఫాన్‌ ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన వానకు అరటి పంట మొత్తం నాశనమైంది. ఎకరాకు రూ.80 వేలు చొప్పున రెండు ఎకరాల్లో రూ.1.6 లక్షలు పెట్టుబడి పెట్టాడు. పంట నేల మట్టం కావడంతో కన్నీరు పెడుతున్నాడు. ఉచిత పంటల బీమా పథకం ఉండి ఉంటే ఇలాంటి సమయాల్లో రైతులకు ఎంతో ఉపయోగంగా ఉండేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

మల్లిగూడ రైల్వేస్టేషన్‌ వద్ద ట్రాక్‌ ధ్వంసం 
ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు కోరాపుట్‌ జిల్లా మల్లిగూడ రైల్వేస్టేషన్‌ వద్ద గురువారం అర్ధరాత్రి 400 మీటర్ల రైల్వేట్రాక్‌ ధ్వంసమైంది. సమీపంలోని విద్యుత్‌ సరఫరా టవర్లతో పాటు హైటెన్షన్‌ విద్యుత్‌ను సరఫరా చేసే భారీ టవర్‌ కూడా నేలకూలంది. వర్షంతో మట్టికోతకు గురవ్వడంతో ట్రాక్‌ ధ్వంసమైంది. దీంతో అరకులోయ నుంచి కోరాపుట్‌ వరకు అన్ని రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విశాఖ–కిరండూల్‌ పాసింజర్‌ రైళ్లను రద్దు చేశారు. శుక్రవారం ఉదయం నుంచి ట్రాక్‌ పునరుద్ధరణతో పాటు విద్యుత్‌ టవర్ల పునరద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి రైళ్ల రాకపోకలు జరగవచ్చని అరకు సెక్షన్‌ రైల్వే అధికారులు తెలిపారు.

స్తంభించిన ఏజెన్సీ.. దెబ్బతిన్న ఇళ్లు 
వాగులు పొంగడంతో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో 40 గ్రామాలకు, జిల్లాలో మరో 20 గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. పలుచోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. పల్నాడు జిల్లాలో పెదమద్దూరు వంతెన నీటమునగడంతో అమరావతి–విజయవాడ మధ్య రాకపోకలు స్తంభించాయి. ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి ఉధృతి శుక్రవారం రోజంతా కొనసాగింది. 

శ్రీకాకుళం జిల్లా గొట్టా బ్యారేజీ వద్ద 47,400 క్యూసెక్కులు వస్తుండగా, 49,136 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నారాయణపురం ఆనకట్ట వద్ద 63,900 క్యూసెక్కులతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నాగావళి పొంగడంతో పలు గ్రామాలను వరద చుట్టుముట్టింది. మరోవైపు వాయుగుండం బలహీనపడి ఛత్తీస్‌గఢ్‌ వైపు మరలిందని శనివారం ఉదయానికి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో శనివారమూ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement