ఎస్‌ఎంఎఫ్‌సీఎల్ నుంచి ఏపీఐఐసీ రుణం
మొత్తం అప్పు, వడ్డీకి ప్రభుత్వ గ్యారెంటీ
‘లెటర్ ఆఫ్ కంఫర్ట్’ జారీకి ఆమోదం
ఉత్తర్వులు జారీచేసిన పరిశ్రమల శాఖ
పారిశ్రామిక క్లస్టర్ల భూసేకరణ కోసం ఇప్పటికే ఏపీఐఐసీ రూ.8,500 కోట్ల అప్పు
తాజా అప్పుతో ఏపీఐఐసీ మొత్తం అప్పు రూ.11,000 కోట్లు
సాక్షి, అమరావతి: వివిధ కార్పొరేషన్ల పేరుతో అప్పుల పరంపరను చంద్రబాబు సర్కారు యథేచ్ఛగా కొనసాగిస్తోంది. తాజాగా.. సాగరమాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్‌ఎంఎఫ్‌సీఎల్) నుంచి ఆంధ్రప్రదేశ్ ఇండ్రస్టియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఐఐసీ) రూ.2,500 కోట్లు టర్మ్ రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మొత్తం అప్పు, వడ్డీకి ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. ఎస్‌ఎంఎఫ్‌సీఎల్‌కు ఆమోదయోగ్యమైన రీతిలో అసలు, వడ్డీ రెండింటినీ కవర్ చేస్తూ రుణ కాలపరిమితి అంతటా చెల్లుబాటయ్యేలా రూ.2,500 కోట్ల రుణానికి హామీ ఇచ్చింది.
అలాగే, ఎస్క్రో ఖాతాలో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటి భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ‘లెటర్ ఆఫ్ కంఫర్ట్’ను కూడా జారీచేసింది. ఈ రుణం పూర్తిగా ఏపీఐఐసీ సొంత వనరులు లేదా భూముల విక్రయం ద్వారా వచ్చే ఆదాయంతోనే తీర్చాలి. వీటిని తీర్చడంలో ఏపీఐఐసీ విఫలమైనప్పుడు ప్రభుత్వ హామీ అమలులోకి వస్తుంది. భూముల లీజు, అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని ఎస్క్రో ఖాతాకు మళ్లించాలి.
ఎస్‌ఎంఎఫ్‌సీఎల్ విధించిన డాక్యుమెంటేషన్, రుణ పంపిణీకి ముందు, పంపిణీ తర్వాత పాటించాల్సిన అన్ని షరతులను పాటించడానికి ఏపీఐఐసీకి అధికారం ఇచ్చారు. అలాగే, ఈనెల 30లోగా తీసుకునే రుణానికి 8.40 శాతం వడ్డీగా నిర్ణయించారు. చంద్రబాబు సర్కారు వచ్చిన తరువాత ఏపీఐఐసీ ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో రూ.8,500 కోట్లు అప్పుచేసింది. ఇప్పుడు చేసే అప్పుతో కలిపి ఏపీఐఐసీ ద్వారా చేసిన అప్పు మొత్తం రూ.11,000 కోట్లకు చేరనుంది.


