కృష్ణాజిల్లా: మాజీ మంత్రి కొడాలి నాని కనబడటం లేదని నాలుగు నెలల క్రితం టీడీపీ వాళ్లు ఆనందపడ్డారని, ఇప్పుడేమో గుడివాడలో ఉన్న సమస్యలు టీడీపీ నేతల వెంట పడుతున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు. చంద్రబాబు ఏ సమస్య గురించీ పట్టించుకోరని తెలిపారు.
గుడివాడ నియోజకవర్గ వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేశ్ ఫారిన్ టూర్లపై హట్ కామెంట్స్ చేశారు. ‘‘నిన్నటి నుంచి చంద్రబాబు కనపడటం లేదు. చంద్రబాబు ఫారిన్ వెళ్లారని ఎవరో చెబుతున్నారు. వెళ్లారని చెప్పరు.. ఏ ఊరో చెప్పరు... ఏ దేశంలో ఉన్నారో చెప్పరు. ఒకరు సీఎం.. మరొకరు మంత్రి ఏ దేశం వెళ్లారో కూడా చెప్పుకోలేకపోతున్నారు.
ఫలానా దేశం వెళుతున్నాం...ఈ రాష్ట్రానికి ఇది సాధించడానికి వెళుతున్నామని దమ్ముగా చెప్పాలి కదా? చంద్రబాబు, లోకేశ్ దేశం దాటి వెళితే ఏ దేశం వెళ్లారో కూడా చెప్పరు. క్రమశిక్షణ లేని పెంపకం. నోటికి ఏది వస్తే అది వాగడం లోకేశ్‌కు అలవాటు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు లండన్‌కు మందులు వేసుకోవడానికి వెళుతున్నాడని లోకేశ్ మాట్లాడేవారు. మీ నాన్న ఎందుకు ఫారిన్ వెళుతున్నాడో చెప్పగలరా లోకేశ్? ఏ మందు వేసుకోవడానికి మీ నాన్నను విదేశాలకు పంపించారు?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేశ్ ఏది పడితే అది మాట్లాడారు. రాష్ట్రంలో బాధ్యత లేని ప్రభుత్వం నడుస్తోంది. బాధ్యత లేని ముఖ్యమంత్రి, బాధ్యత లేని మంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఇంకా రెండున్నరేళ్లున్నా వీళ్లెప్పుడు పోతారా? అని జనం ఎదురుచూస్తున్నారు. ప్రజలే కాదు టీడీపీ కార్యకర్తలు కూడా ఎదురుచూస్తున్నారు’’ అని చెప్పారు.
‘‘చంద్రబాబు రైతులకు నీళ్లు లేవంటే పట్టించుకోరు. ఎల్ నినో ఉంది.. పంటలు సాగు చేయొద్దంటారు. పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వరు. హాస్టల్ ఫీజులు వేయరు...మెస్ ఛార్జీలు ఇవ్వరు. రోడ్లు వేయరు. గ్రామాల్లో మంచినీళ్లు రావు. సమస్యలన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. పరిష్కారం దేవుడే చూస్తాడని మాట్లాడతారు. ఈ మాత్రం దానికి ఆయనెందుకు సీఎంగా?’’ అని పేర్ని నాని అన్నారు.


